ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యల
విజయనగరం టౌన్ : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలకు పరిష్కారమార్గం చూపకపోవడంతో జిల్లావాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అశోక్ చొరవతో ప్రత్యేక జోన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ఎప్పటిలాగానే రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ఎదురైంది. 2015-16 బడ్జెట్‌ను పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు జిల్లాకు మొండిచేయి చూపించారు. చాలా ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపలేదు. కొత్త ఇంటర్ సిటీలు వ స్తాయని, రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నుంచి విజయవాడ వరకూ, అదేవిధంగా విశాఖ నుంచి భువనేశ్వర్ వరకూ ప్రత్యే క రైళ్లు ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందన్న ప్రజల ఆశలు నీరుగారాయి. బడ్జెట్‌లో పాత వాటి ఊసేలేదు...కొత్త ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లేదు. గత ఏడాది ఒక్క రైలుతో సరిపెట్టగా, ఈ ఏడాది అదీ లేకుండా చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడంపై విమర్శ లు వ్యక్తమయ్యాయి.
పట్టాలెక్కని హామీలివే....
ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది.
విజయనగరం నుంచి రాజాం మీదగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రస్తావనే లేకుండాపోయింది.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్థారణ కేంద్రం తదితర వన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్‌లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న ది అలానే ఉండిపోయాయి.
సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మిం చిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాం డ్‌కు మోక్షం కలగలేదు
ఇక రూ.10కోట్లుకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది.
‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా అంతే. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్‌లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. దాన్నీ పట్టించుకోలేదు వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు వినతులుగానే మిగిలిపోయాయి.