కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతకు గగన్ ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించనున్నారు.
దేశంలో కాపలాలేని రైల్వే గేట్ల వద్ద ఏటా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాల వల్ల యువతే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. భారతీయ రైల్వేల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రైల్వే లెవల్ క్రాసింగ్‌లు 31,846 ఉండగా.. వాటిలో 3,438 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లే. ఈవిషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం తన రైల్వే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్వయంగా వెల్లడించారు. వీటివద్ద పటిష్టమైన భద్రత కోసం రూ. 6,750 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ విషయమై భారతీయ రైల్వే ఉన్నతాధికారులు తమతో చర్చలు జరుపుతున్నారని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ కూడా ధ్రువీకరించారు. జీపీఎస్ (గ్లోబల్ పొజిషింగ్ సిస్టమ్) ఆధారంగా పనిచేసే జియో ఆగ్‌మెంటెడ్ నావిగేషన్ (గగన్)ను ఉపయోగిస్తే కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. వాటిలో హైదరాబాద్‌లోని విమానాశ్రయం కూడా ఉంది. ఈ వ్యవస్థను దేశంలోని ఇతర విమానాశ్రయాలకు కూడా విస్తరించేందుకు భారత ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇటీవలనే అనుమతి మంజూరు చేసింది.
ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ ద్వారా పనిచేసే ‘గగన్’ను ఇస్రో 2008లోనే అభివృద్ధి చేసింది. అయితే అదే ఏడాది ప్రయోగించాలనుకున్న జీశాట్ ప్రయోగం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం వల్ల గగన్‌ను అమల్లోకి తీసుకరావడం ఆలస్యం అయిది. ట్రయల్స్ పూర్తి చేసుకొని 2014లోనే విమానయాన రంగంలో గగన్ అమల్లోకి వచ్చింది. రన్‌వేపై విమానాలు సురక్షితంగా దిగేందుకు ఈ గగన్‌ను ఉపయోగిస్తున్నారు. రన్‌వేపై కదలికలను త్రీ డెమైన్షన్‌లో గగన్ కచ్చితంగా విమానం పైలట్‌కు చూపిస్తుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వివరించారు. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కదలికలను కచ్చితంగా అంచనా వేసే గగన్ వ్యవస్థను రైలు ఇంజన్ బోగీలోగానీ గార్డు బోగీలోగానీ అమర్చవచ్చని ఆయన చెప్పారు.
రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాలు, బాటసారులు ఎంతవేగంగా పట్టాలు దాటుతారో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అతివేగంగా దూసుకొచ్చే రైల్లోని డ్రైవర్‌కు రైల్వే క్రాసింగ్ వద్ద కదలికలు కచ్చితంగా తెలిసినంత మాత్రాన రైలు ప్రమాదాలు నివారించగలమా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.