ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం | will develop Telangana railway network, says Railway Minister Suresh Prabhu | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

Published Sun, Mar 26 2017 3:28 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం - Sakshi

ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

- తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి రూ.1729 కోట్లు
- రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడి
- పలు రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శ్రీకారం


సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ మాత్రం నిధుల కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సకాలంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1729 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రైల్వేల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు సమానంగా నిధులు కేటాయిస్తాయని, 25 శాతం మూలధనంగా సమకూర్చి మిగతా నిధులను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను శనివారం ఆయన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో వీడియో ద్వారా ప్రారంభించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, ఏపీ జితేందర్‌రెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి, డి.శ్రీనివాస్, బి.బి.పాటిల్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు శ్రీవాస్‌గౌడ్, బి.గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్‌–మోర్తాడ్‌ మార్గం ప్రారంభం...
ఈ కార్యక్రమంలో సురేశ్‌ప్రభు... నిజామాబాద్‌–మోర్తాడ్, దేవరకద్ర–జక్లేర్‌ కొత్త రైల్వే మార్గాలను, నిజామాబాద్‌– కరీంనగర్, మహబూబ్‌నగర్‌–జక్లేర్‌ మధ్య డెమూ ప్యాసిం జర్‌ రైళ్లను ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌– సికింద్రా బాద్‌ కొత్త రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారు. పూర్తిగా నగదు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చిన నాంపల్లి, సికింద్రాబాద్, బాసర, గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, రాయచూర్, ఔరంగాబాద్, నాందేడ్‌ రైల్వేస్టేషన్‌లను డిజిటల్‌ పేమెంట్‌ స్టేషన్లుగా ప్రకటించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో 225 కిలోవాట్‌ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ పవర్, వాటర్‌ రీసైక్లింగ్‌ యూనిట్లు, పునరుద్ధరించిన నిజాం కాలం నాటి ఆలుగడ్డ బావిని మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి, మహారాష్ట్రలో గుడిపడవ పండుగల కానుకగా అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సోలార్‌ విద్యుత్‌ వినియోగం ద్వారా ఈ ఏడాది రూ.4 వేల కోట్లు ఆదా అయినట్లు మంత్రి చెప్పారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో సోలార్‌ పవర్‌ యూనిట్‌ను ప్రారంభిస్తాం. ఆలుగడ్డబావి వంటి నీటి వనరులను పునర్వినియోగంలోకి తేవడంతో పాటు, వాటర్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ల ద్వారా ద.మ.రైల్వేలో ఏటా రూ.2.5 కోట్లు ఆదా అవుతుంది. రాష్ట్రంలో చేపట్టనున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు రైల్వే స్థలాల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం’అని మంత్రి తెలిపారు.

లింగంపల్లిలో రెండు రైళ్లకు హాల్టింగ్‌...
ప్రయాణికుల కోరిక మేరకు ముంబై–భువనేశ్వర్‌ (11019/11020) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–పుణే ఎక్స్‌ప్రెస్‌ (17014/17013) రైళ్లను లింగంపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. భద్రాచలం రోడ్డు నుంచి భద్రాచలంటౌన్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మించాలని దత్తాత్రేయ కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపట్ల ఎంపీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో పెద్దపల్లి–నిజామాబాద్‌ రైలును రిమోట్‌ ద్వారా ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు. చిత్రంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు మల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement