ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ
నేడు కోర్టులో హాజరు పరచనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు
కస్టడీతో పాటు బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు.
దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం.
మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ!
కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు.
కవితను కలసిన భర్త అనిల్
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్‌రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment