ఎంవోయూలు మార్చుకుంటున్న మేధా సంస్థ ఎండీ కశ్యప్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్. చిత్రంలో మంత్రి కేటీఆర్, మేధా సంస్థ చైర్మన్ యుగంధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్స్ తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రైల్వే లోకోమోటివ్స్ తయారీలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు.
1990లో ఎలాంటి హడావుడి లేకుండా ఏర్పాటైన ఈ సంస్థ నేడు ఎలక్ట్రోమెకానికల్ ఉత్పత్తుల్లో ప్రపంచ స్థాయి కంపెనీలైన జీఈ, సెమెన్, మిట్సుబుషి, తోషిబా, హిటాచీలతో పోటీపడి లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) అవసరాల కోసం ఈ పరిశ్రమలో ఏకంగా 500 మంది ఇంజనీర్లు పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమ కోసం టీఎస్‌ఐఐసీ ద్వారా 100 ఎకరాలను కేటాయించామని తెలిపారు. మరో మూడు, నాలుగు నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు చేతి వేళ్ల మీద లెక్కబెట్ట గల సంఖ్యలోనే ఉన్నాయని పేర్కొన్నారు. డీజిల్ లోకోమోటివ్‌లు, ఎలక్ట్రికల్ లోకోమోటివ్‌లను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. అమెరికా, ఐరోపాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ చైర్మన్ యుగంధర్ రెడ్డి తనతో అన్నారని, ఆయన ఆత్మవిశ్వాసాన్ని గౌరవిస్తామని తెలిపారు.
అంతర్జాతీయ కంపెనీలతోనే పోటీ: యుగంధర్ రెడ్డి
కోల్‌కతాలోని ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)తో కలసి తాము గంటకు 160 కి.మీల వేగంతో నడిచే రైళ్లకు డిజైన్ రూపకల్పన చేస్తున్నామని మేధా సర్వో డ్రైవ్స్ చైర్మన్ యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. 1990లో హైదరాబాద్‌లో రూ.25 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ప్రారంభమైన తమ పరిశ్రమ ఇప్పుడు రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. తమ ఉత్పత్తులకు దేశీయ పరిశ్రమలతో ఎలాంటి పోటీ లేదని, ప్రపంచ అగ్రగామి కంపెనీలైన జీఈ, తోషిబా, హిటాచీలతోనే పోటీ అని పేర్కొన్నారు. తాము రూపొందించిన లోకోమోటివ్ కంట్రోల్స్‌తో దేశంలో 5 వేల రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. 2008లో ఈ లోకోమోటివ్ పరికరానికి రూపకల్పన చేశామని, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
దేశంలో నడుస్తున్న రైళ్లలో 50 శాతం డీజిల్ లోకోమోటివ్‌లను తామే ఉత్పత్తి చేశామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కశ్యప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా ఏటా 200 నుంచి 300 రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇప్పటికే తమ పరిశ్రమ ద్వారా ఇరాన్, టాంజానియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర 15 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, త్వరలో విదేశీ దిగుమతుల కోసం ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యాదవ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ వెంకట నరసింహారెడ్డి, మేధా సర్వో డ్రైవ్స్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘విభజన’ హామీ నిలబెట్టుకోలేదు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత 6 నెలల్లోనే వరంగల్ జిల్లాలో భారతీయ రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని మూడున్నరేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు సీఎం కేసీఆర్ స్వయంగా కలసి ఈ హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారని, రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. అయినా కేంద్రం ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment