మెట్రోకు ట్రాఫిక్ బ్లాక్ చార్జీలు వద్దు
రైల్వే మంత్రిని కోరిన సీఎం కేసీఆర్
నగరంలో ఎనిమిది చోట్ల దక్షిణ మధ్య రైల్వే క్రాసింగ్‌లు దాటనున్న మెట్రో ప్రాజెక్టుకు ట్రాఫిక్ బ్లాక్ చార్జీల పేరుతో రూ.80 కోట్లు అడగడం సమంజసం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుకు స్పష్టంచేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో 8 చోట్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్‌ఓబీ(రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే ట్రాఫిక్ బ్లాక్ చార్జీలు అధికంగా ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. ఈవిషయంలో రైల్వే శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మూడేళ్లుగా నలుగుతున్న వివాదానికి తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాలని మంత్రిని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే స్థలాల లెసైన్సు చార్జీల నిమిత్తం రైల్వేశాఖకు రూ.25 కోట్లు చెల్లించిందన్నారు. చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లోనూ నామమాత్రంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేశాఖకు రుసుము చెల్లించాయని సీఎం రైల్వే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రైల్వేబోర్డు ఈ విషయంలో స్పష్టతనివ్వని కారణంగానే కొన్ని నెలలుగా మెట్రో ప్రాజెక్టు కోసం భరత్‌నగర్ మెట్రో రైల్వే క్రాసింగ్ పనులు ఆలస్యమౌతున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మెట్రో పనులు జరిగేందుకు వీలుగా రైట్ ఆఫ్ వే ఏర్పాటుకు రైల్వేశాఖ అనుమతించాలని కోరారు. నగరంలో మొత్తం 10 చోట్ల రెండు ఎకరాల లోపుగానే రైల్వే స్థలాలు మెట్రో ప్రాజెక్టుకు అవసరమౌతాయని, వాటిని తక్షణం కేటాయించాలని కోరారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఏడాదిన్నర క్రితమే దక్షిణమధ్య రైల్వేకు చెల్లించామన్నారు. మెట్రో ప్రాజెక్టుతో ఆస్తులు కోల్పోయే బాధితులకు ప్రతి చదరపు అడుగు విస్తీర్ణానికి రూ.50 వేలు పరిహారం చెల్లించగా.. రైల్వే శాఖ మాత్రం చదరపు అడుగుకు రూ.1.50 లక్షల పరిహారం కోరడం చట్టబద్దం కాదని సీఎం స్పష్టంచేశారు. రైల్వేశాఖ స్థలం దక్కని కారణంగా ఈ ప్రాంతంలో మెట్రో పనులు ముందుకు సాగడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ భేటీ జరిగినప్పటికీ రైల్వేశాఖ తాత్సారం చేస్తోందని ఆక్షేపించారు.
రూ. 60 కోట్లు చెల్లించాం అనుమతులివ్వండి
నగరంలో 8 చోట్ల రైల్వే పట్టాలపైన మెట్రో పనుల కోసం నిర్మించనున్న రైల్వే క్రాసింగ్‌ల నిర్మాణం, పది చోట్ల రైల్వేశాఖ స్థలాల కోసం రూ.60 కోట్లు దక్షిణమధ్య రైల్వేశాఖకు తెలంగాణా ప్రభుత్వం చెల్లించిం దని సీఎం మంత్రికి తెలిపారు. తక్షణం మెట్రో పనులు జరిగేందుకు వీలుగా ఆర్‌ఓబీల నిర్మాణం, రైల్వే స్థలాల్లో రైట్‌ఆఫ్‌వే ఏర్పాటుకుకు అనుమతులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.