
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాతబస్తీ వాసి ఇబ్రహీం మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీం ఫిర్యాదును వాళ్లు సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా.. ఆ వ్యక్తిని భువనగిరి జిల్లాకు చెందిన ఆకుతోట రామకృష్ణగా గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రామకృష్ణకు శిక్ష ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment