ఈ ఏడాది కరెంట్ షాకుల్లేవ్
ఈ ఏడాది కరెంట్ షాకుల్లేవ్
Published Mon, Aug 28 2017 2:40 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
విద్యుత్ చార్జీలు యథాతథం
- కొత్త టారీఫ్ ప్రకటించిన ఈఆర్సీ
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కనెక్షన్లపై పరిమితి ఎత్తివేత
- దక్షిణ మధ్య రైల్వే, మెట్రో రైలుకు ఊరట
- రైల్వేకు యూనిట్ ధర రూ.7.10 నుంచి రూ.4.05కు తగ్గింపు
- మెట్రో రైలుకు రూ.7 నుంచి రూ.3.95కు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరట! ఈ ఏడాది కరెంట్ చార్జీలు పెరగవు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రస్తుతం ఉన్న చార్జీలనే యథాతథంగా వసూలు చేయనున్నాయి. గతేడాది (2016–17) విద్యుత్ చార్జీలనే ప్రస్తుత ఏడాది(2017–18) కొనసాగించాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) ఆమోదించింది. రైల్వేతోపాటు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్)కు విద్యుత్ చార్జీలను తగ్గించింది. విద్యుత్ చార్జీలు పెంచొద్దని, ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో డిస్కంలు.. ఏప్రిల్ 13న పెంపు ప్రతిపాదనలు లేకుండానే 2017–18 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)ను ఈఆర్సీకి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్సీ 2017–18 విద్యుత్ టారీఫ్‌ను ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
రైల్వే, హెచ్‌ఎంఆర్‌కు ఊరట
రైల్వే, హెచ్‌ఎంఆర్‌కు విద్యుత్ నియంత్రణ మండలి చార్జీలను తగ్గించింది. రైల్వేకు యూనిట్‌పై రూ.7.10 నుంచి రూ.4.05కు, హెచ్‌ఎంఆర్‌కు రూ.7 నుంచి 3.95కు తగ్గించింది. ప్రస్తుతం డిస్కంలు వసూలు చేస్తున్న విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే, హెచ్‌ఎంఆర్ సంస్థల యాజమాన్యాలు బహిరంగ విచారణలో ఈఆర్సీ ముందు వాదనలు వినిపించాయి. విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో వారి నుంచి వసూలు చేసే విద్యుత్ చార్జీలను ఈఆర్సీ తగ్గించింది.
ఆంక్షల్లేని ఉచిత విద్యుత్
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కనెక్షన్లపై ఇక ఆంక్షలు ఉండవు. మెట్ట భూమి రైతుకు మూడుకి మించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని, 2.5 ఎకరాల లోపు మాగాణి ఉన్న రైతే ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు అర్హుడని ఇప్పటి వరకు నిబంధనలున్నాయి. ఇకపై మెట్ట, మాగాణి భూముల రైతులకు ఎలాంటి ఆంక్షల్లేకుండా ఎన్నైనా విద్యుత్ కనెక్షన్లు జారీ కానున్నాయి. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, భూవిస్తీర్ణం విషయంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించింది. పాలీహౌస్/గ్రీన్‌హౌస్‌లలో పంటల సాగుకు సైతం ఉచిత విద్యుత్ పథకం వర్తించనుంది. అయితే కార్పొరేట్ రైతుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలు యథాతథంగా అమలు కానున్నాయి.
ఆదాయ లోటు రూ.4 వేల కోట్లు
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు డిస్కంలు సగటున యూనిట్‌కు 6.05 రూపాయలు ఖర్చు చేయనున్నాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలు చేస్తే డిస్కంలు 2017–18లో రూ.4,777 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం గృహ, వ్యవసాయ వినియోగదారులకు సబ్సిడీ కింద 4,777 కోట్ల రూపాయల నిధులను డిస్కంలకు ఇచ్చేందుకు అంగీకరించిందని ఈఆర్సీ తన ఉత్తర్వుల్లో వివరించింది. ఈ నిధులతో డిస్కంల వార్షిక లోటు తీరుతుందని పేర్కొంది.
2017–18 విద్యుత్ టారీఫ్‌లో ముఖ్యమైన గణాంకాలు..
రాష్ట్ర మొత్తం విద్యుత్ అవసరాలు : 52,245.39 మిలియన్ యూనిట్లు
మొత్తం విద్యుత్ లభ్యత : 58,357.73 ఎంయూలు
ఒక యూనిట్ విద్యుత్ సరఫరా వ్యయం : రూ.6.05
విద్యుత్ సరఫరా మొత్తానికి అయ్యే వ్యయం(ఏఆర్‌ఆర్) : రూ.28,412.91 కోట్లు
ఉదయ్ పథకంలో చేరడంతో పొదుపు : రూ.1,116.42 కోట్లు
విద్యుత్ సరఫరా నికర వ్యయం(ఎన్‌ఆర్‌ఆర్) : రూ. 27,296.48 కోట్లు
డిస్కంల ఆదాయ లోటు : రూ.4,777.04 కోట్లు
లోటును పూడ్చేందుకు ప్రభుత్వ సబ్సిడీ నిధులు : రూ.4,777.04 కోట్లు
Advertisement
Advertisement