ఆస్తి పన్ను, విద్యుత్‌ చార్జీలు.. పెంచక తప్పదు | CM KCR Clarification Current Charges Hike In Telangana Assembly | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను, విద్యుత్‌ చార్జీలు.. పెంచక తప్పదు

Published Sat, Mar 14 2020 2:42 AM | Last Updated on Sat, Mar 14 2020 5:25 AM

CM KCR Clarification Current Charges Hike In Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థలు మనుగడ సాగించాలం టే పన్నులు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచి తీరుతామని ప్రకటించారు. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పబోమని, పన్ను కట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతామన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. పంచాయతీరాజ్‌ చట్టం అమలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్ల విధులు, కలెక్టర్లకు ఉన్న అధికారాల గురించి మాట్లాడారు. ఆస్తి పన్నుతోపాటు విద్యుత్‌ చార్జీలు కూడా పెంచనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని 

ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘గత పాలకులు రాజకీయం చేసి పంచా యతీరాజ్, సహకార రంగాలను ఉరితీశారు. గ్రామీణులను ఏకీకృతం కాకుండా గ్రూపు లుగా విడగొట్టారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. బోరుబావులను పూడ్చే పరిస్థితి లేదు. బోరుబావిలో పిల్లలు పడితే.. టీవీలు గగ్గోలు పెడితే ఇక్కడి నుంచి చూడటం తప్ప ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. ఇదో పంచాయతీరాజ్‌ వ్యవస్థనా? పెంటకుప్పలా తయారైంది. కరోనా, గిరోనా ఎందుకు వస్తోంది.

ఓపెన్‌ డ్రైనేజీ వ్యవస్థను అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థగా మారిస్తే రోగాలు దరికి చేరవు. సర్పంచ్‌ను పొద్దున తీసేస్తే మధ్యాహ్నానికల్లా ఎమ్మెల్యేను పట్టుకొని కలెక్టర్‌ ఎదురుగా కూర్చొని వెకిలినవ్వు నవ్వే పరిస్థితి ఉంది. వంద శాతం ఆస్తిపన్ను వసూలు కావాల్సిందే. పన్ను వసూలు చేయకపోతే సర్పంచ్, కార్యదర్శులను ఉద్యోగం నుంచి తీసేస్తాం. నిందించినంత మాత్రాన, విమర్శించినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తాం. శషభిషల్లేవ్‌.

విద్యుత్‌ చార్జీల పెంపు తప్పనిసరి...
విద్యుత్‌ చార్జీలు పెంచుతాం. సంస్థను కాపాడుకునేందుకు ఇది తప్పనిసరి. దళితులు, గిరిజనులకు 101 యూనిట్ల పరిధిలో మాత్రం చార్జీలు పెంచం. కొంత ఆస్తి పన్ను కూడా పెంచబోతున్నాం. మాకు ఆ ధైర్యం ఉంది. పన్నులు పెంచబోమని చందమామ కథలు చెప్పం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పన్నులపైనే నడుస్తుంది. అయితే పన్నులను అడ్డదిడ్డంగా పెంచం. దళితులకు, గిరిజనులకు రూపాయి కూడా పెంచం. పన్నుకట్టే సామర్థ్యం ఉన్న వారిపైనే భారం మోపుతాం.

ట్యాక్సులు పెంచకుంటే సంస్థల మనుగడ ఎలా? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పన్నులు పెంచాల్సిందే. పన్ను నిర్ధారణలోనూ శాస్త్రీయత పాటిస్తాం. సిబ్బందితో కుమ్మక్కై కొలతలు సరిగా చూపని మతలబులు ఇక కుదరవు. ఇకపై ఇంటి యజమానే ఆస్తిపన్ను లెక్కలు ఇవ్వాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే దానికి తగ్గట్లుగా పన్ను వసూలు చేస్తాం. ఒకవేళ ఈ లెక్కల్లో తేడా ఉన్నట్లు తేలితే 25 రెట్లు జరిమానా విధిస్తాం. రెండేళ్ల జైలుశిక్ష వేస్తాం. దీన్ని చట్టంలోనే పొందుపరిచాం.

నిధుల విషయంలో వెనక్కు తగ్గం..
15వ ఆర్థిక సంఘం నిధుల ఖరారులో కేంద్రం వైఖరి విచిత్రంగా ఉంది. ఐదేళ్లకు తగ్గట్లు ప్రణాళిక చేయకుండా ఈ ఏడాది అది కూడా మధ్యంతర నివేదిక ఆధారంగా రాష్ట్రానికి రూ. 1,847 కోట్లు కేటాయించింది. అందులోనూ 5–10 శాతం నిధులను మండల, జెడ్పీలకు ఇవ్వాలి. కేంద్ర నిధులకు సమానంగా రూ. 1,847 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీన్ని బడ్జెట్‌లో కూడా పెట్టాం. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపైనా.. మేం పస్తులుండైనా పంచాయతీలకు నిధులిస్తాం తప్ప వెనక్కిపోం. కొత్త పంచాయతీల్లో త్వరలోనే రేషన్‌ షాపులను కూడా ప్రారంభించబోతున్నాం. జనాభా ప్రాతిపదికన అన్ని పంచాయతీలకు సమృద్ధిగా నిధులిస్తున్నాం. ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్‌ ఒకసారి వ్యయమే. దానిపై కాంగ్రెస్‌ సభ్యుల రాద్ధాంతం బాగోలేదు. ట్రాక్టర్లు కొనాలని నేనే చెప్పా.

106 జనాభా ఉన్న గ్రామానికి కూడా ట్రాక్టర్‌ కొనాలని నిర్ణయించాం. మంచైనా.. చెడైనా నేనే బాధ్యత తీసుకుంటా. ఎన్ని అదనపు నిధులైనా ఇస్తాం. సత్తుపల్లి నియోజకవర్గ సర్పంచ్‌లకు అభినందనలు. వర్ధన్నపేట నియోజకవర్గం దేవరన్నపేట పంచాయతీలో కామిడి నర్సింహరెడ్డి రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చారు. హుస్నాబాద్‌ సెగ్మెంట్‌ గట్ల నర్సింగాపూర్‌ గ్రామంలో గుండవరపు భాస్కర్‌రావు రూ. 3 కోట్లను, నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డి కోటి రూపాయలను గ్రామాల అభివృద్ధికి విరాళంగా అందజేశారు. వారందరికీ చేతులెత్తి దండాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డబ్బుకంటే వారి స్ఫూర్తి గొప్పది.

మొక్కలు ఎండితే బాధ్యత కౌన్సిలర్లదే..
ప్రేమ, భయం లేకపోతే అభివృద్ధి జరగదు. లంచాలకు మరిగిన కొందరు సిబ్బందితో మనమెందుకు బాధలు, నిందలు పడాలి? గత ప్రభుత్వాల దుర్మార్గాలు అంతాఇంత కాదు. హెచ్‌టీ లైన్ల కింద ఇళ్లకు ఎలా అనుమతులిస్తారు? అందుకే లేఅవుట్ల అనుమతుల అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టాం. దీనిపై కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్రమార్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాసినట్లు గగ్గోలు పెట్టారు. గిలిగింతలు, చక్కిలిగింతలు పెడితే ఫలితాలు రావు. 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం మనది. ఎవరి పరిధిలో వారు సక్రమంగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. హరితహారం కింద నాటిన మొక్కల్లో 86 శాతం మొక్కలు బతికాయి. వార్డుల్లో మొక్కల సంరక్షణ బాధ్యత కౌన్సిలర్లది. వార్డుల బాధ్యత వారు చూసుకోకపోతే వేరేవారు ఎందుకు చూసుకుంటారు?

విశ్వసనీయత ఉండాలి..
ఓట్ల కోసం భయపడం. ఉన్నది ఉన్నట్లు చెబుతాం. ఎన్నికల్లో ఏది పడితే అది చెబితే ఓట్లు రావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చింది. మేం రూ. లక్షలోపు రుణాలను విడతలవారీగా చేస్తామని చెప్పాం. ఓటర్లు మావైపు మొగ్గు చూపారు. ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి. అంతేతప్ప ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాం అనుకోవడం తప్పు. వితండవాదాలు వద్దు. పంచ రంగులు చూపొద్దు.

కుల, మతరహిత శ్మశానవాటికలు నిర్మిస్తున్నాం...
చనిపోయిన వాళ్లను సంస్కారహితంగా పంపడం మన సమాజం సంస్కారం. ఒడిశాలో ఒకాయన 20 కిలోమీటర్లు సైకిల్‌పై భార్య శవాన్ని మోసుకెళ్లిండు. భూమి లేని వాళ్లు ఎక్కడ అంత్యక్రియలు చేసుకోవాలి? ఆ బాధ మనకే ఎదురైతే ఎంత కుమిలిపోతం? అందుకే అన్ని గ్రామాల్లో దహనవాటికలు, వైకుంఠధామాలు తయారవుతున్నాయి. కుల, మతరహిత సామూహిక శ్మశానవాటికలను చూడబోతున్నాం. ఇందుకోసం రూ. 10 కోట్లు కానీ రూ. 20 కోట్లు కానీ ఎంత అవసరమైతే అంత ఇస్తాం.

షెడ్యుల్‌ ఏరియాలు కావడంతో...
మణుగూరు, పాల్వంచ, ఆసిఫాబాద్, భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంత మున్సిపాలిటీలు షెడ్యూల్డ్‌ ఏరియాలుగా ఉండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యంకావట్లేదు. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం.

ఎర్రబెల్లి టాప్‌ పర్‌ఫార్మర్‌..
టాప్‌ పెర్ఫార్మింగ్‌ మినిస్టర్‌గా మా అంతర్గత సర్వేలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవార్డు వచ్చింది. ఆయన పల్లె ప్రగతి కోసం త్రీవ్రంగా శ్రమించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement