శుక్రవారం బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో స్పీకర్ పోచారం, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు
అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదిక మాత్రమే.. కుస్తీ పోటీల కోసం కాదు. అన్నిరంగాల్లో ముందున్న తెలంగాణ.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ప్రొటోకాల్ నిబంధనలు పాటిస్తూ, గొప్ప సంప్రదాయాలు నెలకొల్పేందుకు ఏ చర్యలు చేపట్టాలో స్పీకర్ నిర్ణయించాలి.
– కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలను వచ్చే నెల 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడ్డాయి. కాసేపటి తర్వాత స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సమావేశాల తేదీలు, ఎజెండా తదితర అంశాలపై చర్చించారు.
భిన్నాభిప్రాయాలతో..
కనీసం 20 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ తరఫున మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే సమావేశాల నిర్వహణ తేదీలపై అధికార, విపక్షాల మధ్య భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో.. అక్టోబర్ 5 వరకు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని అంశాలపై చర్చించాలన్న డిమాండ్ వస్తే.. మరోమారు బీఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి తేదీలను పొడిగించాలనే ఆలోచనకు వచ్చారు. అక్టోబర్ 5వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నా.. ఈనెల 25, 26 తేదీలు, వచ్చే నెల 2, 3 తేదీల్లో విరామం ఉండేలా షెడ్యూల్ రూపొందించారు.
దేశానికే ఆదర్శంగా ఉందాం: సీఎం కేసీఆర్
అన్నిరంగాల్లో ముందున్న తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దేశానికి ఆదర్శంగా ఉండాలని బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటిస్తూ, గొప్ప సంప్రదాయాలు నెలకొల్పేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ నిర్ణయించాలని కోరారు. ‘‘వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీని నడిపించి.. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలి. చర్చలకు తగిన సమయాన్ని కేటాయించి, ప్రతిపక్షాల సలహాలను తీసుకోవాలి. ప్రభుత్వం సూచించే అంశాలనే కాకుండా విపక్షాలు చర్చించాలనుకునే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, వాయిదా తీర్మానాలు వంటి సభా సాంప్రదాయాలను విధిగా పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు జరపాలి. సభ ముందుకొచ్చే బిల్లులను ముందస్తుగా సభ్యులకు పంపడంతో రోజూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి’’ అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ నిబంధనలు తప్పకుండా పాటించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి సీఎం, మంత్రులు సహా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఇక పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి తెలంగాణ అసెంబ్లీ ఔన్నత్యాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపేలా చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చించే అం శాన్ని పరిశీలించాలన్నారు. శాసనసభ రూల్‌బుక్‌పై సమీక్ష, అసెంబ్లీ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడటం, కొత్త విషయాలను తెలుసుకునేందుకు అసెంబ్లీ కమిటీలు విదేశీ పర్యటనలు చేయడం వంటి అంశాలనూ పరిశీలించాలని ప్రతిపాదించారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదిక మాత్రమేనని.. కుస్తీ పోటీల కోసం కాదని పేర్కొన్నారు.
►ఈ నెల 25, 26, వచ్చే నెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాలు) అసెంబ్లీ సమావేశాలకు విరామం ఇచ్చేలా షెడ్యూలు ఖరారు చేశారు.
►అంటే సమావేశాలు మొదలైన 24వ తేదీతో కలిపితే.. 8 రోజులు సమావేశాలు జరుగనున్నాయి.
►అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి.. సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు.
►మండలి భేటీని వచ్చే నెల 5వరకు నిర్వహిం చాలని ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు.
ఏ అంశాలపై చర్చలు?
►దళితబంధు, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమ లు, హరితహారం సహా మొత్తం 10 అంశాలపై అసెంబ్లీ/మండలి సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
►నిరుద్యోగ యువత, దళితబంధు, కృష్ణా గోదావరి జలాలు, విద్య, పోడు వ్యవసాయం–అటవీ హక్కుల చట్టం, వ్యవసాయం, వైద్యం–ఆరోగ్యం, ధరణి పోర్టల్, నిత్యావసరాలు–ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, మాదకద్రవ్యాలు, మద్యం– ఎక్సైజ్ అంశాలు కలిపి మొత్తంగా 12 అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ కోరింది.
►హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ ప్రతిపాదించింది.
►అధికార, విపక్షాలప్రతిపాదనలను క్రోడీకరించి వీలైనన్ని అంశాలు చర్చకు వచ్చేలా సోమవారం నాటికి ఎజెండా ఖరారు చేయనున్నట్టు స్పీకర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment