Railway coach factory
-
వచ్చే నెలలో తెలంగాణకు మళ్లీ మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరోసారి రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాజీపేటలో రైల్వేశాఖ నిర్మించనున్న సరుకు రవాణా వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవం కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. వీటితోపాటు కాజీపేట ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వీలు కల్పించేలా.. ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావటంతో.. గతంలో కేంద్రం కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నా దానిస్థానంలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును మంజూరు చేసింది. దీంతో కేంద్రంపై రాజకీయ విమర్శలను ఎక్కుపెట్టడంతో.. వర్క్‌షాపు స్థానంలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అది ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారడంతో.. ఇతర కార్యక్రమాలతో కలిపి సింపుల్‌గా శంకుస్థాపన చేయటం సరికాదని కేంద్ర పెద్దలు ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విడిగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వచ్చే నెలలో శంకుస్థాపనకు ఛాన్స్.. కాజీపేటకు తొలుత మంజూరు చేసిన పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్ ముగిసిన తర్వాత రైల్వేశాఖ.. ఈ వర్క్‌షాప్ ప్రతి పాదనను వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీగా మారుస్తూ, అంచనాను రూ.521 కోట్లుగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భూమిని రైల్వేశాఖకు బదలాయించిన నేపథ్యంలో.. నిర్మాణ పనులకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ వచ్చే నెలలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి.. వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
వరంగల్ రాజకీయాలలో కాకా పుట్టిస్తున్న.. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ
-
Kazipet: పట్టాలెక్కిన రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్.. 2వేల మందికి పైగా ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో ఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన రైల్వే ఫ్యాక్టరీ ఎట్టకేలకు సాకారమవుతోంది. కాజీపేటకు మంజూరై ఇటుక కూడా పడకుండానే తరలిపోయిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ప్రకటన జరిగి ఆగిపోయిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీల స్థానంలో.. వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటవుతోంది. కాజీపేట శివారులోని మడికొండలో ఏర్పాటు చేయబోతున్న ఈ ‘పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్’ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జాయింట్ వెంచర్ సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టుకు రూ.383 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. ఈ సంస్థ రూ.361,79,22,000కు పనులు దక్కించుకుంది. ఈ మేరకు రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) వర్క్ఆర్డర్ జారీ చేసింది. 2024 డిసెంబర్ చివరి నాటికల్లా ఫ్యాక్టరీ సిద్ధమై, పని ప్రారంభించాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు విలువలో సివిల్, ట్రాక్ పనులకు రూ.208.39 కోట్లు, మెకానికల్ పనులకు రూ.115.77 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ.35.46 కోట్లు, టెలికమ్యూనికేషన్ పనులకు రూ.2.17 కోట్లు పేర్కొనగా.. జీఎస్టీయే ఏకంగా రూ.55 కోట్లు కావటం గమనార్హం. కోచ్.. వ్యాగన్ వీల్.. ఓవర్‌హాలింగ్.. కాజీపేటకు 1982 సమయంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలో సిక్కులపై ఊచకోతతో పంజాబ్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాన్ని తగ్గించే క్రమంలో నాటి కేంద్ర ప్రభు త్వం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చేసింది. మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉండగా 13 ఏళ్ల కింద కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట శివార్లలో సీతారామ స్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దానికి కేటాయించింది. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫ్యాక్టరీకి భూమి అప్పగింత ఆగిపోయింది. తీవ్ర జాప్యం జరగడంతో రైల్వేశాఖ వీల్ ఫ్యాక్టరీని మరోచోటికి బదలాయించింది. దాని స్థానంలో 2015లో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. కానీ భూమి బదలాయింపు కాకపోవటంతో నిధులు విడుదల కాలేదు. తర్వాత నామమాత్రంగా కేటాయింపులు చేశారు. గత ఏడాది కోర్టు కేసు వీడిపోవడం, ధరణిలో ఏర్పడ్డ సమస్య కూడా తీరడంతో ఇటీవలే భూమి యాజమాన్య హక్కు రైల్వేపరమైంది. వర్క్‌షాపు పని పట్టాలెక్కింది. అయితే దీనికి మరో 11 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 10 ఎకరాల అంశం కొలిక్కివచ్చినా.. మరో ఎకరం స్థలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. కాగా, వర్క్‌షాపుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. చదవండి: హెచ్ఎండీఏ: సర్కారీ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ -
వారెవ్వా ఐపాస్... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్‌లో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ప్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి. ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్–ఐపాస్‌కు ఆన్లైన్ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్ హార్ట్‌వేర్ పార్క్‌లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఐపాస్‌తో పెరిగిన వేగం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు, ఫుడ్ పార్కులు, ప్లాస్టిక్ అండ్ లెదర్ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
‘కోచ్’ వచ్చే వరకు కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకూ కొట్లాడుతామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మోదీ ప్రభుత్వ తీరుతో ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయి. తెలంగాణను మోసగించడంలో గత పాలకులను మోదీ సర్కార్ మించుతోంది. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినా సానుకూలంగా స్పందించడంలేదు’అని విమర్శించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసమే మహారాష్ట్రలోని లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.625 కోట్లు విడుదల చేశారని, కేంద్రం చేసిన దగాతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ప్రాంత యువత ఆశలపై నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే బీజేపీ మంత్రి, ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమితరిమి కొడతారు’అని కేటీఆర్ హెచ్చరించారు. -
సెంటర్ షేకైపోవాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న అధికార టీఆర్ఎస్ తమ ఆందోళనలను ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు దీనిపై కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తుండగా ఇకపై క్షేత్రస్థాయి పోరాటాలకు అవసరమైన కార్యాచరణ కోసం పదును పెడుతోంది. సీసీఐ కోసం ఒత్తిడి పెంచేలా... సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్ పునరుద్ధరణకు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో పార్టీ నేతలు, జిల్లా ప్రముఖులతో తాజాగా చర్చించారు. ‘సీసీఐ సాధన సమితి’గా ఏర్పడి కేంద్రంపై ఉద్యమించేందుకు కార్యాచరణ మొదలు పెట్టా లని ఈ సమావేశంలో నిర్ణయించారు. బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటు డిమాండ్‌తో టీఆర్ఎస్ నేతలు శుక్రవారం మహబూబాబాద్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇక కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిం చినా కేంద్రం మంజూరు చేయడం లేదు. దీనిపై కేంద్రం వైఖరిగా నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శనివారం కాజీపేటలో ధర్నా చేయనుంది. సోమవారం సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. ప్రభుత్వరంగ సంస్థల అప్పగింతపైనా పోరు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేం ద్రం ప్రయత్నిస్తోందంటూ టీఆర్ఎస్ ఇప్పటి కే పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బీడీఎల్, హెచ్ఏఎల్, డీఆర్డీఎల్, ఈసీఐల్, తపాలా, బీమా, బ్యాంకింగ్ తదితర రంగాలనూ కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఇటీవల సమా వేశమై కేంద్రం విధానాలకు నిరసనగా జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలను ఇరుకునపెట్టేలా... రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నా ఇక్కడి నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు తమతో కలసి రావడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే అంశా న్ని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల ద్వారా ఎత్తిచూపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
మహారాష్ట్రకు ‘కోచ్’.. తెలంగాణకు తూచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామంటూనే రిక్తహస్తం చూపిన రైల్వేశాఖ, అదే సమయంలో మహారాష్ట్రకు దానిని కేటాయించి వేగంగా పూర్తిచేస్తోంది. తెలంగాణ ఎదురుచూస్తున్న కోచ్ ఫ్యాక్టరీపై ఆశలను ఆవిరి చేస్తూ, మహారాష్ట్రలోని లాతూరుకు దానిని కేటాయించి దాదాపు పూర్తి చేసింది. ఈ ఏడాది డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమైంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవికుమార్ వివరాలు అడుగగా రైల్వే శాఖ పలు విషయాలు వెల్లడించింది. ఇదీ సంగతి.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రం ఇదివరకు పేర్కొంది. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో దీన్ని పొందుపరచటంతో కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమోనని యావత్తు రాష్ట్రం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుత రైల్వే అవసరాలను ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలే తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అప్పట్లోనే సమాచార హక్కు చట్టం రూపంలో రైల్వే శాఖ ఆలోచన లిఖితపూర్వకంగా స్పష్టమైంది. కానీ, కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదన్న రైల్వే శాఖ, 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూరులో దాని ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించింది. కేవలం ఐదు నెలల్లోనే రూ.625 కోట్లతో మంజూరు చేసింది. ఆ వెంటనే పనులు ప్రారంభించి, ఇప్పటికే రూ.587 కోట్లు ఖర్చు చేసింది. ఈఏడాది చివరి నాటికి దానిని పూర్తి చేయనున్నట్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మంజూరు, తిరస్కరణలన్నీ రాజకీయ కారణాల ఆధారంగానే జరుగుతున్నాయని రవికుమార్ ఆరోపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును కూడా తెలంగాణ నేతలు సాధించలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. -
ఐసీఎఫ్‌కు ‘వందే భారత్’
సాక్షి, చెన్నై: చెన్నై ఐసీఎఫ్‌లో వందేభారత్ రైళ్లు 30 రూపు దిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఒక్కో రైలుకు రూ. వంద కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై పెరంబూరులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశ విదేశాలకు వేలాది రైలు బోగీలు తయారు చేసి పంపించారు. ఇటీవల పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైల్వే యంత్రాంగం వందే భారత్ రైళ్లను మరిన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ఐసీఎఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసీఎఫ్‌కు తలా 14 చొప్పున రైళ్ల తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, చెన్నైలోని ఐపీఎఫ్‌లో ఏకంగా 30 రైళ్లకు సంబంధించిన బోగీలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, వసతులు కలిగిన 16 బోగీలతో కూడిన ఒక వందే భారత్ రైలుకు రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2024 మార్చి 31 నాటికి ఈ రైళ్లను కేంద్ర రైల్వే యంత్రాంగానికి అప్పగించే లక్ష్యంతో పనులపై దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు.. కేంద్రం నిధులతో కొనుగోలు చేయదలిచిన ఎలక్ట్రిక్ బస్సులకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో 525 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు కసరత్తులు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్ని కేంద్రం నిధులు, కేంద్రం ఇచ్చే సూచనలకు అనుగుణంగా కొనుగో లు చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నిధులతో ఈ బస్సులు తమకు వద్దన్న నిర్ణయానికి డీఎంకే పాల కులు వచి్చనట్లు సచివాలయ వర్గాల సమాచారం. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాంరాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. -
వాగ్దానాన్ని నిలబెట్టుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా:/సంగారెడ్డి/పటాన్చెరు: వరంగల్‌లోని కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అతీగతీ లేదన్నారు. రాజకీయం చేయడం కోసం కాదని.. బాధతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి గురువారం ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేధా సంస్థ ద్వారానే తెలంగాణకు రైల్‌కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ప్రైవేటు సెక్టార్లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఆదిబట్ల కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడి భాగాలు, జహీరాబాద్‌లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని తెలిపారు. తాజాగా రైల్‌కోచ్ తయారీ లోటూ తీరిందన్నారు.హ్యుందాయ్ రోటెమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్న ఈ రంగంలో తెలంగాణకు చెందిన మేధా సంస్థ ఉండటం ఈ ప్రాంత బిడ్డగా ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో మోనో రైళ్ల ఏర్పాటుకు అవసరమైన కోచ్ లను మేధా సంస్థ అందించాలని కోరారు. 18 నెలల్లో ఈ సంస్థ మొదటి యూనిట్ ద్వారా కోచ్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు. హై స్పీడ్ రైళ్ల రాక అవసరం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావనే అపోహలు, అనుమానాల నుంచి.. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని కేటీ ఆర్ చెప్పారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రంగా అవతరించాలని ఆయన ఆకాక్షించారు. హై స్పీడ్ రైళ్లను తీసుకురావాల్సి ఉందని, వాటితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. గంట కు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లతో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు గంటలో, ఆదిలాబాద్‌కు గంటంబావులో చేరుకోవచ్చని అన్నారు. తద్వారా హైదరాబాద్‌లో పనిచేసే వ్యక్తి.. ఇక్కడే జీవించాల్సిన పనిలేకుండా ఇతర జిల్లాల నుంచి ట్రైన్ల ద్వారా రాకపోకలు సాగించవచ్చన్నారు. హై స్పీడు రైల్వే నెట్వర్క్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. స్థానికులకే 70 శాతం ఉపాధి కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీల్లో 70 శాతం వరకు స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ స్థాయిలో ఉపాధి కల్పిస్తే.. పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ద్విచక్ర పాలసీని అధ్యయనం చేసి ఆ దిశగా కూడా ప్రయత్నించాలని మేధా సంస్థను కోరారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిల్లో కొండకల్, వెలిమలలో ఏర్పాటవుతున్న రైల్‌కోచ్ ఫ్యాక్టరీ.. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. అలాగే ఆయా పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం ఎంపీ నిధులతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని కేటీఆర్ కోరారు. మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేధా సంస్థ ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఎస్ఐఐసీ అధ్యక్షుడు బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. -
12న హస్తినకు రండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్రంలో మళ్లీ కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 12న తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ సమాచారం పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రేణుసరీన్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో చేర్చిన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు, ఎన్టీపీసీ ప్లాంటు, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలపై ఇందులో చర్చ జరగనుంది. వీటితోపాటే కేంద్ర ఆర్థిక, జల వనరులు, రైల్వే, ఉన్నత విద్య, రవాణా, పెట్రోలియం, స్టీల్, ఆరోగ్య, గృహ నిర్మాణ, విద్యుత్, న్యాయ, విమానయాన శాఖల కార్యదర్శులను కూడా ఈ భేటీకి ఆహ్వానించింది. బయ్యారంపై ప్రత్యేక చర్చ... బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రం పలుమార్లుకేంద్రానికి విన్నవించింది. కేంద్రం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి బయ్యారం స్టీలు ప్లాంటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రానికి నివేదించింది. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కావాల్సిన సహకారాన్ని అందిస్తామని రాష్ట్రం సైతం చెబుతోంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ఇనుప ఖనిజాన్ని ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని విశాఖకు తరలిస్తున్నారని, కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి ఎందుకు ఇనుమును తరలించి స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఢిల్లీ భేటీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీకి కేంద్ర జల వనరులశాఖను సైతం కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. దీంతోపాటే పట్టిసీమతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలో తెలంగాణ వాటాను కేటాయించాలని కోరుతోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత రాలేదు. దీనిపైనా కేంద్ర జల వనరుల శాఖతో హోంశాఖ చర్చించే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
కాజీపేటలో వ్యాగన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ!
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న సంస్థల ఏర్పాటుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు సోమవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించారు. దీనికి రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ హాజరయ్యారు. పిరియాడికల్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి 160 ఎకరాల స్థలం అవసరమవుతుందని సమావేశం నిర్ధారించింది. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై తర్వాత నిర్ణయం ఇక ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లను అనుసంధానం చేస్తూ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై అధ్యయనం జరిపాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక హార్టికల్చర్, గిరిజన వర్సిటీల ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల స్థలం కేటాయించినట్లు అధికారులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం 500 ఎకరాలు కోరడంతో మిగిలిన స్థలం కింద అటవీ భూములు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ 13లోని సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో గిరిజన, సెంట్రల్ వర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్ నోట్ పూర్తైనట్లు ఆ రాష్ట్ర సీఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. -
రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
-
రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్స్ తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రైల్వే లోకోమోటివ్స్ తయారీలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు. 1990లో ఎలాంటి హడావుడి లేకుండా ఏర్పాటైన ఈ సంస్థ నేడు ఎలక్ట్రోమెకానికల్ ఉత్పత్తుల్లో ప్రపంచ స్థాయి కంపెనీలైన జీఈ, సెమెన్, మిట్సుబుషి, తోషిబా, హిటాచీలతో పోటీపడి లోకోమోటివ్లను ఉత్పత్తి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) అవసరాల కోసం ఈ పరిశ్రమలో ఏకంగా 500 మంది ఇంజనీర్లు పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమ కోసం టీఎస్ఐఐసీ ద్వారా 100 ఎకరాలను కేటాయించామని తెలిపారు. మరో మూడు, నాలుగు నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు చేతి వేళ్ల మీద లెక్కబెట్ట గల సంఖ్యలోనే ఉన్నాయని పేర్కొన్నారు. డీజిల్ లోకోమోటివ్‌లు, ఎలక్ట్రికల్ లోకోమోటివ్లను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. అమెరికా, ఐరోపాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ చైర్మన్ యుగంధర్ రెడ్డి తనతో అన్నారని, ఆయన ఆత్మవిశ్వాసాన్ని గౌరవిస్తామని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలతోనే పోటీ: యుగంధర్ రెడ్డి కోల్‌కతాలోని ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)తో కలసి తాము గంటకు 160 కి.మీల వేగంతో నడిచే రైళ్లకు డిజైన్ రూపకల్పన చేస్తున్నామని మేధా సర్వో డ్రైవ్స్ చైర్మన్ యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. 1990లో హైదరాబాద్‌లో రూ.25 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ప్రారంభమైన తమ పరిశ్రమ ఇప్పుడు రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిందని తెలిపారు. తమ ఉత్పత్తులకు దేశీయ పరిశ్రమలతో ఎలాంటి పోటీ లేదని, ప్రపంచ అగ్రగామి కంపెనీలైన జీఈ, తోషిబా, హిటాచీలతోనే పోటీ అని పేర్కొన్నారు. తాము రూపొందించిన లోకోమోటివ్ కంట్రోల్స్‌తో దేశంలో 5 వేల రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. 2008లో ఈ లోకోమోటివ్ పరికరానికి రూపకల్పన చేశామని, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయన్నారు. దేశంలో నడుస్తున్న రైళ్లలో 50 శాతం డీజిల్ లోకోమోటివ్లను తామే ఉత్పత్తి చేశామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కశ్యప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా ఏటా 200 నుంచి 300 రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇప్పటికే తమ పరిశ్రమ ద్వారా ఇరాన్, టాంజానియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర 15 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని, త్వరలో విదేశీ దిగుమతుల కోసం ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యాదవ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ వెంకట నరసింహారెడ్డి, మేధా సర్వో డ్రైవ్స్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘విభజన’ హామీ నిలబెట్టుకోలేదు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6 నెలల్లోనే వరంగల్ జిల్లాలో భారతీయ రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని మూడున్నరేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు సీఎం కేసీఆర్ స్వయంగా కలసి ఈ హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారని, రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. అయినా కేంద్రం ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: పొన్నం
హైదరాబాద్: రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. ముఖ్య మంత్రి ఫాం హౌస్ కే పరిమితయ్యారని పొన్నం ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. నిధులు రాకపోవడానికి బీజేపీ, టీఆర్ఎస్ లే కారణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో సహాయ నిరాకరణ చేయాలని, లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని వెంటనే చేపట్టండి
కేంద్ర రైల్వే మంత్రికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వరంగల్ జిల్లాలోని కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానందగౌడను కలిసింది. బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కవిత, బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి రైల్‌భవన్‌లో ఆయనకు కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. 2012-13 రైల్వే బడ్జెట్లో కాజీ పేట వద్ద వ్యాగన్ల ఫ్యాక్టరీకి రూ.152 కోట్లు మం జూరు చేసినా పనులు ప్రారంభంకాలేదన్నారు. -
దశ మారుస్తాం
60 టీఎంసీల సామర్థ్యం గల రెండు ప్రాజెక్టులు సాధిస్తాం నగరంలో అండర్డ్రెయినేజీ, రింగ్‌రోడ్డు నిర్మిస్తాం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి జయశంకర్ పేరుపెడతాం : టీఆర్ఎస్ నేత కేసీఆర్ హామీ వరంగల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. నలభైయేండ్ల క్రితం వరంగల్ ఎట్లుందో ఇప్పుడూ అట్లనే ఉంది.. ఇక్కడ బలమైన నాయకుడు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నగరశివారు మడికొండలో గురువారం రాత్రి జరిగిన ‘ఓరుగల్లు గర్జన’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పూర్తి భరోసా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. వరంగల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులతో వాటర్‌షెడ్‌ను కాకతీయులు గొప్పగా నిర్మించారని, 11శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్షెడ్లు నేర్పిన జిల్లాలో మంచినీళ్ళకు ఇబ్బంది పడుతున్నారని, ఈ కరువు పరిస్థితి మారాలన్నారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అజంజాహి మిల్లు వలసవాదుల పాలనలో నాశనమైదని, ఆ మిల్లు స్థానంలో తమిళనాడు తిరువూరు తరహాలో టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, మామునూరు ఎయిర్‌పోర్టు ఉన్నందున టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. జిల్లాలో పత్తి ఎక్కువ పండుతుందని, మూడు నాలుగు జిల్లాలకు కలిపి కాటన్ మార్కెట్ విస్తరించి ఇక్కడే కొనుగోలు చేసేవిధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘పొన్నాల లక్ష్మయ్య పొంకనాలు మాట్లాడుతున్నాడు.. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఎందుకు తేలేకపోయాడో చెప్పాలి’ అని నిలదీశాడు. కమీషన్లు వసూలు చేసుకునేందుకే టైమ్ సరిపోలేదా? అంటూ విమర్శించారు. దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖలను గెలిపిస్తే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తానని, రింగ్‌రోడ్డును తానే పర్యవేక్షించి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. వరంగల్ ప్రగతిబాట పట్టాలి..ఎవడు అడ్డమొస్తడో చూస్తానంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయంలో దేవాదులకు శంకుస్థాపన చేసిండ్రు... తర్వాత ఆరేండ్లు పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నీ చేతుల తెలంగాణ పెడితే జిల్లాకు నీళ్లొస్తయా? అని నిలదీశారు. ‘పొన్నాల ఒక్కనాడైనా ఉద్యమంలో ఉన్నడా? యాకూబ్‌రెడ్డిని పశువులెక్క చితక్కొట్టించిండు. ఇంటిచుట్టూ ముళ్ళకంచెలు పెట్టుకున్నడు’ అని మండిపడ్డారు. ఉద్యమాన్ని చేసినట్లు జిల్లాలో నీళ్ళు తెచ్చి పారిస్తం.. పక్కనే గోదావరిలో కావాల్సినన్ని నీళ్ళున్నయి. 60 టీఎంసీల సామర్థ్యంతో రెండు ప్రాజెక్టులు కడుతమని హామీ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. జూరాల-పాకాల ప్రాజెక్టును జబర్దస్తీగా సాధించుకుంటామని, 400 కిలో మీటర్లు లిఫ్ట్లేకుండా నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు నీళ్లతో నింపొచ్చన్నారు. కేంద్రంతో కొట్లాడి ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, కాజీపేటను డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ కాకతీయుల వారసత్వ సంపద ఉందని, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా పేరుపెడ్తామని ఆయన చెప్పారు. జయశంకర్ తనకు ఉద్యమగురువని, బతికున్నంత కాలం ఆయన తన గుండెల్లో ఉంటారని కేసీఆర్ అన్నారు. -
కోలార్ జిల్లాలో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
కోలారు, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి యూటీ ఖాదర్ అన్నారు. గురువారం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఖాదర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ... కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వైట్ ఫీల్డ్ నుంచి కోలారు మీదుగా ముళబాగిలు వరకు 83 కిమీ రైల్వే లైన్‌ను రూ. 658 కోట్ల వ్యయంతో, అదే విధంగా మారికుప్పం - కుప్పం నూతన రైలు మార్గాన్ని త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేమగల్ సమీపంలో టోల్‌రూం స్థాపన వల్ల నిరుద్యోగ సమస్య కొంత వరకు తీరనుందన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత నీటి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్య్ర వేడుకల కోసం ఎస్సీ, ఎస్టీ సెల్‌కు నగర సభ కమిషనర్ రూ. 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి, కమిషనర్ మహేంద్రకుమార్‌ను తీవ్రంగా మందలించారు. విలేకరుల సమావేశంలో సీఈఓ జుల్ఫికరుల్లా, డిప్యూటీ కలెక్టర్ వెంకటేషమూర్తి, ఎస్పీ రాంనివాస్ సెపాట్ తదితరులు పాల్గొన్నారు.