సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో ఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన రైల్వే ఫ్యాక్టరీ ఎట్టకేలకు సాకారమవుతోంది. కాజీపేటకు మంజూరై ఇటుక కూడా పడకుండానే తరలిపోయిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ప్రకటన జరిగి ఆగిపోయిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీల స్థానంలో.. వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటవుతోంది. కాజీపేట శివారులోని మడికొండలో ఏర్పాటు చేయబోతున్న ఈ ‘పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్’ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జాయింట్ వెంచర్ సంస్థ దక్కించుకుంది.
ప్రాజెక్టుకు రూ.383 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. ఈ సంస్థ రూ.361,79,22,000కు పనులు దక్కించుకుంది. ఈ మేరకు రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) వర్క్‌ఆర్డర్ జారీ చేసింది. 2024 డిసెంబర్ చివరి నాటికల్లా ఫ్యాక్టరీ సిద్ధమై, పని ప్రారంభించాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు విలువలో సివిల్, ట్రాక్ పనులకు రూ.208.39 కోట్లు, మెకానికల్ పనులకు రూ.115.77 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ.35.46 కోట్లు, టెలికమ్యూనికేషన్ పనులకు రూ.2.17 కోట్లు పేర్కొనగా.. జీఎస్టీయే ఏకంగా రూ.55 కోట్లు కావటం గమనార్హం.
కోచ్.. వ్యాగన్ వీల్.. ఓవర్‌హాలింగ్..
కాజీపేటకు 1982 సమయంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలో సిక్కులపై ఊచకోతతో పంజాబ్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాన్ని తగ్గించే క్రమంలో నాటి కేంద్ర ప్రభు త్వం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చేసింది. మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉండగా 13 ఏళ్ల కింద కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట శివార్లలో సీతారామ స్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దానికి కేటాయించింది.
కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫ్యాక్టరీకి భూమి అప్పగింత ఆగిపోయింది. తీవ్ర జాప్యం జరగడంతో రైల్వేశాఖ వీల్ ఫ్యాక్టరీని మరోచోటికి బదలాయించింది. దాని స్థానంలో 2015లో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. కానీ భూమి బదలాయింపు కాకపోవటంతో నిధులు విడుదల కాలేదు.
తర్వాత నామమాత్రంగా కేటాయింపులు చేశారు. గత ఏడాది కోర్టు కేసు వీడిపోవడం, ధరణిలో ఏర్పడ్డ సమస్య కూడా తీరడంతో ఇటీవలే భూమి యాజమాన్య హక్కు రైల్వేపరమైంది. వర్క్‌షాపు పని పట్టాలెక్కింది. అయితే దీనికి మరో 11 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 10 ఎకరాల అంశం కొలిక్కివచ్చినా.. మరో ఎకరం స్థలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. కాగా, వర్క్‌షాపుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
చదవండి: హెచ్ఎండీఏ: సర్కారీ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్
Comments
Please login to add a commentAdd a comment