Kazipet Wagon Factory
-
Kazipet: పట్టాలెక్కిన రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్.. 2వేల మందికి పైగా ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో ఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన రైల్వే ఫ్యాక్టరీ ఎట్టకేలకు సాకారమవుతోంది. కాజీపేటకు మంజూరై ఇటుక కూడా పడకుండానే తరలిపోయిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత ప్రకటన జరిగి ఆగిపోయిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీల స్థానంలో.. వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటవుతోంది. కాజీపేట శివారులోని మడికొండలో ఏర్పాటు చేయబోతున్న ఈ ‘పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్’ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జాయింట్ వెంచర్ సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టుకు రూ.383 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. ఈ సంస్థ రూ.361,79,22,000కు పనులు దక్కించుకుంది. ఈ మేరకు రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) వర్క్ఆర్డర్ జారీ చేసింది. 2024 డిసెంబర్ చివరి నాటికల్లా ఫ్యాక్టరీ సిద్ధమై, పని ప్రారంభించాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు విలువలో సివిల్, ట్రాక్ పనులకు రూ.208.39 కోట్లు, మెకానికల్ పనులకు రూ.115.77 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ.35.46 కోట్లు, టెలికమ్యూనికేషన్ పనులకు రూ.2.17 కోట్లు పేర్కొనగా.. జీఎస్టీయే ఏకంగా రూ.55 కోట్లు కావటం గమనార్హం. కోచ్.. వ్యాగన్ వీల్.. ఓవర్‌హాలింగ్.. కాజీపేటకు 1982 సమయంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య సమయంలో సిక్కులపై ఊచకోతతో పంజాబ్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాన్ని తగ్గించే క్రమంలో నాటి కేంద్ర ప్రభు త్వం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు మార్చేసింది. మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉండగా 13 ఏళ్ల కింద కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట శివార్లలో సీతారామ స్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దానికి కేటాయించింది. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫ్యాక్టరీకి భూమి అప్పగింత ఆగిపోయింది. తీవ్ర జాప్యం జరగడంతో రైల్వేశాఖ వీల్ ఫ్యాక్టరీని మరోచోటికి బదలాయించింది. దాని స్థానంలో 2015లో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. కానీ భూమి బదలాయింపు కాకపోవటంతో నిధులు విడుదల కాలేదు. తర్వాత నామమాత్రంగా కేటాయింపులు చేశారు. గత ఏడాది కోర్టు కేసు వీడిపోవడం, ధరణిలో ఏర్పడ్డ సమస్య కూడా తీరడంతో ఇటీవలే భూమి యాజమాన్య హక్కు రైల్వేపరమైంది. వర్క్‌షాపు పని పట్టాలెక్కింది. అయితే దీనికి మరో 11 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 10 ఎకరాల అంశం కొలిక్కివచ్చినా.. మరో ఎకరం స్థలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. కాగా, వర్క్‌షాపుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. చదవండి: హెచ్ఎండీఏ: సర్కారీ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ -
‘ధరణి’ ప్రశ్నలకు జవాబేది.. రైల్వే ఆడా, మగా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు తండ్రి పేరు ఏం రాయాలి? పుట్టిన తేదీ కాలమ్‌లో ఏం నింపాలి? ఇంతకీ ఆడా, మగా అనే చోట ఏం రాయమంటారు?..కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ భూమి యాజమాన్య మార్పిడి కోసం రెవెన్యూ సిబ్బంది అడిగిన ప్రశ్నలివి. వీటికి ఎలాంటి సమాధానం లేదు. ఆ వివరాలను నమోదు చేయకుండా లావా దేవీ నిలిచిపోయింది. దీనికి కారణం ‘ధరణి’ పోర్టల్‌లోని ఓ గందరగోళం. వినడానికి చిత్రంగా కనిపిస్తున్న ఈ సమస్యతో.. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టు జాప్యం అవుతోంది. వాస్తవానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే.. వచ్చేనెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరిగి ఉండే దని అధికారవర్గాలే చెప్తున్నాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులతో దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు ధరణి వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సమస్య ఎక్కడుంది?: దాదాపు 13 ఏళ్ల కింద కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేట సమీపంలోని మడి కొండలో ఉన్న సీతారామస్వామి దేవాల యానికి చెందిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఏళ్లకేళ్లు జాప్యం జరిగింది. ఈ లోగా రైల్వేశాఖ ఆ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చింది. తర్వాత దానిస్థానంలో రూ.383.05 కోట్ల వ్యయ అంచనాతో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును 2016లో మంజూరు చేసింది. రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇన్నేళ్ల తర్వాత గత ఏడాది కోర్టుకేసు పరిష్కారమై.. రైల్వేకు భూమిని అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం.. ఆ భూమి పూర్తిగా రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కావాలి, ఆ తర్వాతే ఫ్యాక్టరీ పనులు చేపడతారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పారు కూడా. కానీ ధరణిలో గందరగోళంతో సమస్య వచ్చి పడింది. సంస్థల పేరిట నమోదుకు చాన్స్ లేక.. ధరణిలో వ్యక్తుల వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉందేతప్ప.. సంస్థల పేరిట నమోదు చేసే అవకాశం లేదు. పేరు, తండ్రిపేరు, ఆడా/మగ, పుట్టిన తేదీ, వాటి తాలూకు ఆధారాలు వంటి వివరాలను సంస్థలకు అన్వయించడం కుదరదు. దీనివల్ల రైల్వేకు కేటాయించిన భూముల వివరాలు ధరణిలో చేరడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం గడిచిపోయినా.. అధికారులు చిక్కు ముడిని విప్పలేకపోయారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ దగ్గరపడింది. ప్రాజెక్టు భూమి రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఈసారి కూడా నిధులు కేటాయించే అవకాశం లేనట్టేనని, మరో ఏడాది వృధా అవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు త్వరగా సమస్యను కొలిక్కి తెచ్చి.. భూమిని రైల్వే పేరిట మార్చితే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక మరో 11 ఎకరాల భూమికి సంబంధించి కూడా కొంత సమస్య నెలకొంది. అందులో పదెకరాలు పరిష్కారమైందని, ఇంకో ఎకరం కేటాయింపు త్వరలో అవుతుందని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. అయితే అంతా కలిపి ఇస్తేనే లెక్కగా ఉంటుందని, అసలు భూమి రానప్పుడు ప్రాజెక్టులో కదలికకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు తేల్చి చెప్తున్నారు. ఏమిటీ ప్రాజెక్టు? రైల్వేలో వినియోగిస్తున్న గూడ్స్ వ్యాగన్లను నిర్ణీత సమయంలోగానీ, మరమ్మతులు వచ్చినప్పుడుగానీ సరిచేసి.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పని. కాజీపేటలో చేపట్టదలచిన ఈ వర్క్‌షాప్‌లో నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్ హాలింగ్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. దీనితో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. -
‘వ్యాగన్’కు మ్యుటేషన్ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు భూమి అందలేదు. రైల్వే పేరిట భూమిని మ్యుటేషన్ చేసి ఇస్తేనే మేం పని ప్రారంభింస్తాం. అప్పటివరకు మాకు భూమి అందనట్టే లెక్క’–దక్షిణ మధ్య రైల్వే ‘కోర్టు పరిధిలో ఉన్న కేసు కొలిక్కి రావటంతో జనవరిలోనే రైల్వేకు భూమిని అప్పగించాం. దాన్ని రైల్వే పేరిట మ్యుటేషన్ కోసం తహసీల్దారుకు ఇచ్చిన లేఖను రైల్వేకు అప్పగించాం. కానీ, రైల్వే యంత్రాంగమే పని ప్రారంభించటం లేదు’ –తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 13 ఏళ్లుగా ఓ రైల్వే ప్రాజెక్టు కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టుకు కేటాయించిన భూమి విషయమై వేసిన కేసు కోర్టులో నలిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత భూమి మ్యుటేషన్ అంశం అడ్డంకిగా మారింది. ఇదీ సంగతి... మమతాబెనర్జీ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేటకు సమీపంలోని మడికొండ సీతారామస్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. తర్వాత ఈ భూమి కేటాయింపుపై కోర్టులో కేసు నమోదైంది. ఇంతలో ఆ ప్రాజెక్టు రద్దవడంతో దానిస్థానంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపును 2016లో రైల్వే శాఖ మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించినా, భూవివాదం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు. ఎట్టకేలకు కోర్టు కేసు కొలిక్కి రావటంతో గత జనవరిలో 150 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రైల్వేకు అప్పగించారు. అయితే, ఆ భూమిని రైల్వే పిరియాడికల్ వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పేరుతో మ్యుటేషన్ చేయాలని, అలా భూమి తమ పేరుతో మారితేనే పనులు చేపట్టేందుకు తమ విధానాలు అంగీకరిస్తాయని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. దీంతోపాటు మరో 11 ఎకరాల భూమి కూడా కావాలని కోరగా, రెవెన్యూ అధికారులు పదెకరాలను కేటాయించారు. అయితే, మొత్తం భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వటంతోనే అప్పగింత ప్రక్రియ పూర్తయినట్టు రెవెన్యూ అధికారులు చెబుతుండగా, మ్యుటేషన్ జరగకపోవటం, ధరణి పోర్టల్ రైల్వే పేరు నమోదు కాకపోవటంతో పనులు ప్రారంభించలేమని రైల్వే అధికారులు మిన్నకుండిపోయారు. 1,500 కుటుంబాలకు ఉపాధి 1980లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కృషితో కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. సరిగ్గా పనులు మొదలుపెట్టే తరుణంలో ఇందిరాగాంధీ హత్య, సిక్కుల ఊచకోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికిగాను ఆ రాష్ట్రంలోని కపుర్తలాకు ఈ కోచ్‌ఫ్యాక్టరీని బదలాయించారు. తర్వాత రాష్ట్రవిభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏర్పడ్డ కమిటీ అది సాధ్యం కాదని తేల్చింది. ఈ క్రమంలో వర్క్‌షాపు మంజూరైంది. నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్‌హాలింగ్ చేయటం దీని పని. ఇందులో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా మరో వేయి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా ఉంది. -
ఫ్యాక్టరీ ఔట్.. వర్క్‌షాప్ ఇన్!
♦ కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మంగళం ♦ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుమంజూరు ♦ కేటాయించింది రూ.20 కోట్లే సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది! ఆరేళ్ల క్రితం కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రైల్వే శాఖ రద్దు చేసింది. దాని స్థానంలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు మంజూరు చేసింది. ఫ్యాక్టరీ రానందుకు కనీసం వర్క్షాపుతోనైనా సంతృప్తి పడదామనుకుంటే దాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసేలా కనిపించడం లేదు. ఈ వర్క్‌షాపునకు రూ.269 కోట్లు అవసరం బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆరేళ్ల క్రితం మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా రూ.200 కోట్లతో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేశారు. కానీ నాటి ప్రభుత్వం భూమి అందివ్వకపోవడాన్ని సాకుగా చూపి కాలయాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భూసేకరణ ప్రక్రియ పూర్తయినా పనులు మాత్రం మొదలు కాలేదు. చివరకు దాన్ని రద్దు చేసిన రైల్వేశాఖ.. వ్యాగన్లకు ఓవర్‌హాలింగ్ చేసే వర్క్‌షాపును కేటాయించింది. ఒకేసారి మొత్తం నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరమే ఇది ఏర్పాటయ్యేది. కానీ దాన్ని కూడా కాలయాపన చేసే ఉద్దేశంతో అత్తెసరు నిధులిచ్చి చేతులు దులుపుకుంది. -
కొత్త రైళ్లు హుష్‌కాకి
సదానందగౌడ, ఖర్గే వరాలకు సురేశ్‌ప్రభు గండి కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మంజూరైన రూ. 5 కోట్లు వెనక్కి ప్రీమియం రైళ్ల విషయంలో పునరాలోచన రైల్వేశాఖలో సంస్కరణల ఫలితం? సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో చోటు దక్కించుకున్న కొన్ని కొత్త రైళ్లు హుష్‌కాకి అయ్యాయి. వాటిని రైల్వేశాఖ దాదాపుగా రద్దు చేసినట్టు సమాచారం. సంస్కరణలకే పెద్దపీట వేస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం... గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంజూరైన కొన్ని ప్రాజెక్టులు కూడా అటకెక్కినట్టు తెలుస్తోంది. విచిత్రమేంటంటే... ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మధ్యంతర రైల్వే బడ్జెట్లో సదానందగౌడ మంజూరు చేసిన రైళ్లు, నిధులను కూడా సురేశ్ ప్రభు నిలిపివేశారు. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి ప్రజలకు వెంటనే ఉపయోగం కలిగించే వాటిపైనే దృష్టి సారించాలని ఆయన నిర్ణయించటంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న రైల్వే శాఖను ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే సంస్కరణల రూపంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నాలుగు రోజుల క్రితం సిఫారసు నివేదిక కూడా అందజేసింది. దాన్ని ప్రభుత్వం దాదాపుగా పరిగణనలోకి తీసుకోబోతోందని అధికారవర్గాలు చెబుతున్న సమాచారం. వెరసి ఇక పాత హామీలు, ఇప్పటికే మంజూరై పట్టాలెక్కని ప్రాజెక్టుల్లో కొన్ని రద్దయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడువు దాటినా పట్టాలెక్కని రైళ్లివే.... గత సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరక ముందుయూపీఏ-2 ప్రభుత్వం ఫిబ్రవరిలో తుది బడ్జెట్ ప్రవేశపెట్టింది. నాటి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తెలంగాణ మీదుగా నడిచేలా కామాఖ్య-చెన్నై, హౌరా-యశ్వంత్‌పూర్, మన్నార్గుడి-జోథ్‌పూర్ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లను మంజూరు చేశారు. వాస్తవానికి ఇవి ఇటీవలి మార్చి 31లోపు పట్టాలెక్కాల్సి ఉంది. కానీ వాటి జాడే లేకుండా పోయింది. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత గత సంవత్సరం జూలైలో నాటి రైల్వే మంత్రి సదానందగౌడ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణకు కాజీపేట-లోకమాన్యతిలక్ టెర్మినస్ (ముంబై) వీక్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించారు. వీటితోపాటు తెలంగాణ మీదుగా వెళ్లేలా జైపూర్-మధురై ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌ను కూడా మంజూరు చేశారు. ఇప్పుడు ఈ రైళ్లు దాదాపు రద్దయినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ కేటాయించాల్సి ఉంది. సదానందగౌడ విజయవాడ-ఢిల్లీ మధ్య కొత్త రైలును ఇదే ఉద్దేశంతో కేటాయించారు. కానీ దాన్ని కూడా బడ్జెట్ గడువు ముగిసినా ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది రద్దయ్యే అవకాశం లేనప్పటికీ జాప్యం చేయటానికి కారణాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా విశ్లేషించలేకపోతున్నారు. వ్యాగన్‌వీల్ ఫ్యాక్టరీ నిధులు వెనక్కి..? కాజీపేటకు ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి సదానందగౌడ 2014 జూలై బడ్జెట్లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు వాటి విడుదల నిలిచిపోయింది. వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు నిర్వహణకు అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. దాన్ని కాజీపేటలోనే ఏర్పాటు చేయాలా వద్దా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఫలితంగా మంజూరైన నిధులను కూడా నిలిపివేశారు. ‘ప్రీమియం’కు మంగళం వీలైనంత మేర టికెట్ ధరలు పెంచి డబ్బు చేసుకునే ఉద్దేశంతో గతంలో ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేసిన ప్రీమియం రైళ్లకు తెర దించాలని సురేశ్‌ప్రభు భావిస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఈ రైళ్ల టికెట్ ధరలు (డైనమిక్ ప్రైస్) పెరుగుతుంటాయి. విమానాలకు అమలు చేసే పద్ధతిని ప్రీమియం రైళ్ల పేరుతో రైల్వేలోకి చొప్పించారు. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతోపాటు వాటికి ఆదరణ కూడా లేకుండా పోయింది. దీంతో అలాంటి రైళ్లను పక్కన పెట్టాలని సురేశ్‌ప్రభు భావిస్తున్నట్టు సమాచారం.