కొత్త రైళ్లు హుష్‌కాకి | The new trains Hush crow | Sakshi
Sakshi News home page

కొత్త రైళ్లు హుష్‌కాకి

Published Mon, Apr 6 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

కొత్త రైళ్లు హుష్‌కాకి

కొత్త రైళ్లు హుష్‌కాకి

  • సదానందగౌడ, ఖర్గే వరాలకు సురేశ్‌ప్రభు గండి
  •  కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మంజూరైన రూ. 5 కోట్లు వెనక్కి
  •  ప్రీమియం రైళ్ల విషయంలో పునరాలోచన
  •  రైల్వేశాఖలో సంస్కరణల ఫలితం?
  • సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో చోటు దక్కించుకున్న కొన్ని కొత్త రైళ్లు హుష్‌కాకి అయ్యాయి. వాటిని రైల్వేశాఖ దాదాపుగా రద్దు చేసినట్టు సమాచారం. సంస్కరణలకే పెద్దపీట వేస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం... గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంజూరైన కొన్ని ప్రాజెక్టులు కూడా అటకెక్కినట్టు తెలుస్తోంది. విచిత్రమేంటంటే... ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మధ్యంతర రైల్వే బడ్జెట్‌లో సదానందగౌడ మంజూరు చేసిన రైళ్లు, నిధులను కూడా సురేశ్ ప్రభు నిలిపివేశారు. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి ప్రజలకు వెంటనే ఉపయోగం కలిగించే వాటిపైనే దృష్టి సారించాలని ఆయన నిర్ణయించటంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న రైల్వే శాఖను ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే

    సంస్కరణల రూపంలో

    కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నాలుగు రోజుల క్రితం సిఫారసు నివేదిక కూడా అందజేసింది. దాన్ని ప్రభుత్వం దాదాపుగా పరిగణనలోకి తీసుకోబోతోందని అధికారవర్గాలు చెబుతున్న సమాచారం. వెరసి ఇక పాత హామీలు, ఇప్పటికే మంజూరై పట్టాలెక్కని ప్రాజెక్టుల్లో కొన్ని రద్దయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
     
    గడువు దాటినా పట్టాలెక్కని రైళ్లివే....

    గత సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరక ముందుయూపీఏ-2 ప్రభుత్వం ఫిబ్రవరిలో తుది బడ్జెట్ ప్రవేశపెట్టింది. నాటి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తెలంగాణ మీదుగా నడిచేలా కామాఖ్య-చెన్నై, హౌరా-యశ్వంత్‌పూర్, మన్నార్‌గుడి-జోథ్‌పూర్ ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లను మంజూరు చేశారు. వాస్తవానికి ఇవి ఇటీవలి మార్చి 31లోపు పట్టాలెక్కాల్సి ఉంది. కానీ వాటి జాడే లేకుండా పోయింది. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత గత సంవత్సరం  జూలైలో నాటి రైల్వే మంత్రి సదానందగౌడ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

    ఇందులో తెలంగాణకు కాజీపేట-లోకమాన్యతిలక్ టెర్మినస్ (ముంబై) వీక్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించారు. వీటితోపాటు తెలంగాణ మీదుగా వెళ్లేలా జైపూర్-మధురై ఏసీ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌ను కూడా మంజూరు చేశారు. ఇప్పుడు ఈ రైళ్లు దాదాపు రద్దయినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ కేటాయించాల్సి ఉంది. సదానందగౌడ విజయవాడ-ఢిల్లీ మధ్య కొత్త రైలును ఇదే ఉద్దేశంతో కేటాయించారు. కానీ దాన్ని కూడా బడ్జెట్ గడువు ముగిసినా ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది రద్దయ్యే అవకాశం లేనప్పటికీ జాప్యం చేయటానికి కారణాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా విశ్లేషించలేకపోతున్నారు.
     
    వ్యాగన్‌వీల్ ఫ్యాక్టరీ నిధులు వెనక్కి..?

    కాజీపేటకు ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి సదానందగౌడ 2014 జూలై బడ్జెట్‌లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు వాటి విడుదల నిలిచిపోయింది. వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు నిర్వహణకు అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. దాన్ని కాజీపేటలోనే ఏర్పాటు చేయాలా వద్దా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఫలితంగా మంజూరైన నిధులను కూడా నిలిపివేశారు.
     
    ‘ప్రీమియం’కు మంగళం

    వీలైనంత మేర టికెట్ ధరలు పెంచి డబ్బు చేసుకునే ఉద్దేశంతో గతంలో ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేసిన ప్రీమియం రైళ్లకు తెర దించాలని సురేశ్‌ప్రభు భావిస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఈ రైళ్ల టికెట్ ధరలు (డైనమిక్ ప్రైస్) పెరుగుతుంటాయి. విమానాలకు అమలు చేసే పద్ధతిని ప్రీమియం రైళ్ల పేరుతో రైల్వేలోకి చొప్పించారు. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతోపాటు వాటికి ఆదరణ కూడా లేకుండా పోయింది. దీంతో అలాంటి రైళ్లను పక్కన  పెట్టాలని సురేశ్‌ప్రభు భావిస్తున్నట్టు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement