సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు తండ్రి పేరు ఏం రాయాలి? పుట్టిన తేదీ కాలమ్‌లో ఏం నింపాలి? ఇంతకీ ఆడా, మగా అనే చోట ఏం రాయమంటారు?..కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ భూమి యాజమాన్య మార్పిడి కోసం రెవెన్యూ సిబ్బంది అడిగిన ప్రశ్నలివి. వీటికి ఎలాంటి సమాధానం లేదు. ఆ వివరాలను నమోదు చేయకుండా లావా దేవీ నిలిచిపోయింది. దీనికి కారణం ‘ధరణి’ పోర్టల్‌లోని ఓ గందరగోళం. వినడానికి చిత్రంగా కనిపిస్తున్న ఈ సమస్యతో.. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టు జాప్యం అవుతోంది. వాస్తవానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే.. వచ్చేనెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరిగి ఉండే దని అధికారవర్గాలే చెప్తున్నాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులతో దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు ధరణి వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
సమస్య ఎక్కడుంది?:
దాదాపు 13 ఏళ్ల కింద కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేట సమీపంలోని మడి కొండలో ఉన్న సీతారామస్వామి దేవాల యానికి చెందిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఏళ్లకేళ్లు జాప్యం జరిగింది. ఈ లోగా రైల్వేశాఖ ఆ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చింది. తర్వాత దానిస్థానంలో రూ.383.05 కోట్ల వ్యయ అంచనాతో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును 2016లో మంజూరు చేసింది. రైల్వే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇన్నేళ్ల తర్వాత గత ఏడాది కోర్టుకేసు పరిష్కారమై.. రైల్వేకు భూమిని అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం.. ఆ భూమి పూర్తిగా రైల్వే పేరిట ట్రాన్స్‌ఫర్ కావాలి, ఆ తర్వాతే ఫ్యాక్టరీ పనులు చేపడతారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పారు కూడా. కానీ ధరణిలో గందరగోళంతో సమస్య వచ్చి పడింది.
సంస్థల పేరిట నమోదుకు చాన్స్ లేక..
ధరణిలో వ్యక్తుల వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉందేతప్ప.. సంస్థల పేరిట నమోదు చేసే అవకాశం లేదు. పేరు, తండ్రిపేరు, ఆడా/మగ, పుట్టిన తేదీ, వాటి తాలూకు ఆధారాలు వంటి వివరాలను సంస్థలకు అన్వయించడం కుదరదు. దీనివల్ల రైల్వేకు కేటాయించిన భూముల వివరాలు ధరణిలో చేరడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం గడిచిపోయినా.. అధికారులు చిక్కు ముడిని విప్పలేకపోయారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ దగ్గరపడింది. ప్రాజెక్టు భూమి రైల్వే పేరిట ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో ఈసారి కూడా నిధులు కేటాయించే అవకాశం లేనట్టేనని, మరో ఏడాది వృధా అవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే రెవెన్యూ అధికారులు త్వరగా సమస్యను కొలిక్కి తెచ్చి.. భూమిని రైల్వే పేరిట మార్చితే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక మరో 11 ఎకరాల భూమికి సంబంధించి కూడా కొంత సమస్య నెలకొంది. అందులో పదెకరాలు పరిష్కారమైందని, ఇంకో ఎకరం కేటాయింపు త్వరలో అవుతుందని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. అయితే అంతా కలిపి ఇస్తేనే లెక్కగా ఉంటుందని, అసలు భూమి రానప్పుడు ప్రాజెక్టులో కదలికకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు తేల్చి చెప్తున్నారు.
ఏమిటీ ప్రాజెక్టు?
రైల్వేలో వినియోగిస్తున్న గూడ్స్ వ్యాగన్లను నిర్ణీత సమయంలోగానీ, మరమ్మతులు వచ్చినప్పుడుగానీ సరిచేసి.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పని. కాజీపేటలో చేపట్టదలచిన ఈ వర్క్‌షాప్‌లో నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్ హాలింగ్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. దీనితో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment