సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్రంలో మళ్లీ కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 12న తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ సమాచారం పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రేణుసరీన్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో చేర్చిన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు, ఎన్‌టీపీసీ ప్లాంటు, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలపై ఇందులో చర్చ జరగనుంది. వీటితోపాటే కేంద్ర ఆర్థిక, జల వనరులు, రైల్వే, ఉన్నత విద్య, రవాణా, పెట్రోలియం, స్టీల్, ఆరోగ్య, గృహ నిర్మాణ, విద్యుత్, న్యాయ, విమానయాన శాఖల కార్యదర్శులను కూడా ఈ భేటీకి ఆహ్వానించింది.
బయ్యారంపై ప్రత్యేక చర్చ...
బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రం పలుమార్లుకేంద్రానికి విన్నవించింది. కేంద్రం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి బయ్యారం స్టీలు ప్లాంటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రానికి నివేదించింది. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కావాల్సిన సహకారాన్ని అందిస్తామని రాష్ట్రం సైతం చెబుతోంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ఇనుప ఖనిజాన్ని ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని విశాఖకు తరలిస్తున్నారని, కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి ఎందుకు ఇనుమును తరలించి స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో దీనిపై ఢిల్లీ భేటీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీకి కేంద్ర జల వనరులశాఖను సైతం కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. దీంతోపాటే పట్టిసీమతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలో తెలంగాణ వాటాను కేటాయించాలని కోరుతోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత రాలేదు. దీనిపైనా కేంద్ర జల వనరుల శాఖతో హోంశాఖ చర్చించే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.
12న హస్తినకు రండి!
Published Wed, Apr 10 2019 2:33 AM | Last Updated on Wed, Apr 10 2019 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment