సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకూ కొట్లాడుతామని తెలిపారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మోదీ ప్రభుత్వ తీరుతో ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయి. తెలంగాణను మోసగించడంలో గత పాలకులను మోదీ సర్కార్ మించుతోంది.
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినా సానుకూలంగా స్పందించడంలేదు’అని విమర్శించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసమే మహారాష్ట్రలోని లాతూర్‌కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.625 కోట్లు విడుదల చేశారని, కేంద్రం చేసిన దగాతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ప్రాంత యువత ఆశలపై నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు.
కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే బీజేపీ మంత్రి, ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమితరిమి కొడతారు’అని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment