దశ మారుస్తాం
- 60 టీఎంసీల సామర్థ్యం గల రెండు ప్రాజెక్టులు సాధిస్తాం
- నగరంలో అండర్‌డ్రెయినేజీ, రింగ్‌రోడ్డు నిర్మిస్తాం
- ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం
- భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి జయశంకర్ పేరుపెడతాం : టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ హామీ
వరంగల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి చెందాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. నలభైయేండ్ల క్రితం వరంగల్ ఎట్లుందో ఇప్పుడూ అట్లనే ఉంది.. ఇక్కడ బలమైన నాయకుడు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నగరశివారు మడికొండలో గురువారం రాత్రి జరిగిన ‘ఓరుగల్లు గర్జన’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పూర్తి భరోసా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.
వరంగల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులతో వాటర్‌షెడ్‌ను కాకతీయులు గొప్పగా నిర్మించారని, 11శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్‌షెడ్‌లు నేర్పిన జిల్లాలో మంచినీళ్ళకు ఇబ్బంది పడుతున్నారని, ఈ కరువు పరిస్థితి మారాలన్నారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అజంజాహి మిల్లు వలసవాదుల పాలనలో నాశనమైదని, ఆ మిల్లు స్థానంలో తమిళనాడు తిరువూరు తరహాలో టెక్స్‌టైల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్, మామునూరు ఎయిర్‌పోర్టు ఉన్నందున టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. జిల్లాలో పత్తి ఎక్కువ పండుతుందని, మూడు నాలుగు జిల్లాలకు కలిపి కాటన్ మార్కెట్ విస్తరించి ఇక్కడే కొనుగోలు చేసేవిధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘పొన్నాల లక్ష్మయ్య పొంకనాలు మాట్లాడుతున్నాడు.. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఎందుకు తేలేకపోయాడో చెప్పాలి’ అని నిలదీశాడు.
కమీషన్లు వసూలు చేసుకునేందుకే టైమ్ సరిపోలేదా? అంటూ విమర్శించారు. దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖలను గెలిపిస్తే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తానని, రింగ్‌రోడ్డును తానే పర్యవేక్షించి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. వరంగల్ ప్రగతిబాట పట్టాలి..ఎవడు అడ్డమొస్తడో చూస్తానంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయంలో దేవాదులకు శంకుస్థాపన చేసిండ్రు... తర్వాత ఆరేండ్లు పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు నీ చేతుల తెలంగాణ పెడితే జిల్లాకు నీళ్లొస్తయా? అని నిలదీశారు. ‘పొన్నాల ఒక్కనాడైనా ఉద్యమంలో ఉన్నడా? యాకూబ్‌రెడ్డిని పశువులెక్క చితక్కొట్టించిండు. ఇంటిచుట్టూ ముళ్ళకంచెలు పెట్టుకున్నడు’ అని మండిపడ్డారు. ఉద్యమాన్ని చేసినట్లు జిల్లాలో నీళ్ళు తెచ్చి పారిస్తం.. పక్కనే గోదావరిలో కావాల్సినన్ని నీళ్ళున్నయి. 60 టీఎంసీల సామర్థ్యంతో రెండు ప్రాజెక్టులు కడుతమని హామీ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.
జూరాల-పాకాల ప్రాజెక్టును జబర్‌దస్తీగా సాధించుకుంటామని, 400 కిలో మీటర్లు లిఫ్ట్‌లేకుండా నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు నీళ్లతో నింపొచ్చన్నారు. కేంద్రంతో కొట్లాడి ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, కాజీపేటను డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇక్కడ కాకతీయుల వారసత్వ సంపద ఉందని, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా పేరుపెడ్తామని ఆయన చెప్పారు. జయశంకర్ తనకు ఉద్యమగురువని, బతికున్నంత కాలం ఆయన తన గుండెల్లో ఉంటారని కేసీఆర్ అన్నారు.