సీఎం ఆదేశాలతోనైనా ‘రింగ్’ పూర్తయ్యేనా?
మేడ్చల్ : మేడ్చల్ పరిధిలో కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగ్‌రోడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనైనా పూర్తి అయ్యేనా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పటాన్‌చెరువు, మేడ్చల్ మండలం మీదుగా శామీర్‌పేట వరకు హుడా రెండో ఫేజ్‌లో రింగు రోడ్డు నిర్మాణాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2012 డిసెంబర్‌లో అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి దశలో శంషాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు నిర్మించిన రోడ్డుకు శామీర్‌పేట వరకు రెండో దశలో రింగు రోడ్డును నిర్మించారు. మేడ్చల్ మీదుగా వెళ్లే రోడ్డు అలైన్‌మెంట్‌లో రాజకీయాలు చేసి రూట్ మ్యాప్ మార్చారని భూములు కోల్పోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మండలంలోని కండ్లకోయ వద్ద రోడ్డు నిర్మాణంపై స్టే విధించింది.
దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రింగు రోడ్డుకు 44 జాతీయ రహదారిని, మేడ్చల్ గండి మైసమ్మను రోడ్డులకు అనుసంధానం చేసి ప్రారంభించింది. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపైనే జంక్షన్ ఏర్పాటు చేసిన అధికారులు అక్కడి నుంచి పటాన్‌చెరు వైపు వెళ్లాలంటే జాతీయ రహదారిపై మేడ్చల్ చెక్‌పోస్టు వరకు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి మేడ్చల్ గండిమైసమ్మ ఆర్‌అండ్‌బీ రోడ్డులో రెండు కిలో మీటర్లు వెళ్లి సుతారిగూడ వద్ద ఉన్న రింగు రోడ్డు పైకి ఎక్కాలి.
పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట వెళ్లాలన్నా.. ఇదే రూట్‌లో వెళ్లాలి. దీంతో వాహన చోదకులకు ప్రయాణం నరకయాతనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈనెల 21న అవుటర్ రింగు రోడ్డు చుట్టూ సీఎం కేసీఆర్ పర్యటించారు. రింగురోడ్డు చుట్టూ మొక్కలు పెంచి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెబుతూ.. అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగు రోడ్డును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సీఎం ఆదేశాలతోనైనా పూర్తి అవుతుందో వేచి చూడాలి.