పిచ్చి ముఖ్యమంత్రిని పట్టించుకోవద్దు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలు జటిలమవుతాయంటున్న పనికిమాలిన, పిచ్చి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని పట్టించుకోవద్దని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చెబుతున్నవన్నీ కట్టుకథలు, పిట్టకథలేనని కొట్టిపారేశారు. టీడీపీకి చెందిన సామ ల రంగారెడ్డి(మహేశ్వరం), డాక్టర్ మెతుకు ఆనంద్(వికారాబాద్) శనివారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక అబద్ధాల పుట్ట. కట్టుకథలు, పిట్టకథలన్నీ చెప్పినా రెండు నిజాలను ఒప్పుకున్నడు. తెలంగాణ ఏర్పా టైతే రైతులకు, ఉద్యోగస్తులకు కష్టాలొస్తాయని అన్నడు. తెలంగాణ వస్తే ఏ ప్రాంత రైతులకు కష్టాలొస్తయి? సమైక్య రాష్ట్రంలో ఉంటే తెలంగాణకు ఏం లాభం వస్తదో ఒక్కటన్నా చెప్పిండా? కట్టె పట్టుకుని మ్యాపును చూపించిండు. నా అంత సిపాయి లేనట్టు తుపాకీ రాముని లెక్క నోటికొచ్చిన అబద్ధాలను చెప్పిండు. మహబూబ్‌నగర్‌లో 13 లక్షల ఎకరాలు కృష్ణా నదితో పారుతున్నాయన్నడు. 13 లక్షలు కాదు లక్షా 30 వేల ఎకరాలు పారినట్టు కిరణ్ చూపిస్తడా? చూపిస్తే అక్కడ్నే బాయిలో దూకి చస్తా’ అని సవాల్ చేశారు. ‘అధిష్టానానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలుచేయాలి.
ఆంధ్రోళ్లు తెలంగాణను పీక్కు తింటున్నారని తేలిపోయింది. ఎంత మూర్ఖంగా తెలంగాణను రాచిరంపాన పెట్టారో అర్థం అయిపోయింది. దారిన పోయే దానయ్య లాంటి కిరణ్‌కుమార్‌రెడ్డిని పిలిచి ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు అధిష్టానాన్ని ధిక్కరించే స్థాయికి వచ్చిండు. హైకమాండ్‌ను, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిని కూడా ధిక్కరించే స్థాయికి పోయిండు. వెంటనే నిర్ణయాన్ని అమలు చేయాలి. కిరణ్‌కుమార్ చెబ్తున్నట్టు సమస్యలేమీ జటిలం కావు. అవన్నీ దూదిపింజలు తేలిపోయినట్టుగా తేలిపోతయి. ఇలాంటి పనికిమాలిన, పిచ్చి సీఎంను పట్టించుకోవద్దు. వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌ను బర్తరఫ్ చేయండి. ఏ పద్ధతిలో అయితే చేస్తరో ఆ పద్ధతిలో వెంటనే చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దు. దేత్తడి పోచమ్మ గుడి. ఎట్లయితే అట్లయితది. మంచి మాటకు వినకుంటే వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాల్సి ఉంటది’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కిరణ్ ఎంత సోది చెప్పినా.. సీమాంధ్ర పండాలి, తెలంగాణ ఎండాలి, సీఎం పదవి అలాగే ఉండాలి అన్నట్టుగా ఉందన్నారు. ‘ఒకటో రెండో మంత్రి పదవులను తెలంగాణవారికి కుక్కకు బొక్క వేసినట్టు పారేస్తాం. నీటిని, ఉద్యోగాలను దోచుకుపోతూనే ఉంటం అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నడు. దీన్ని అంగీకరించడానికి తెలంగాణ ప్రజల్లో ఎవరూ సిద్ధంగా లేరు. మహిళలు కూడా సమ్మక్కసారక్కలై కొట్లాటకు సిద్ధపడుతున్నరు. తెలంగాణ ప్రకటనకు ముందు, ఆ తర్వాత వచ్చిన జీవోలను, సీఎం పెట్టిన సంతకాలను సమీక్షిస్తాం. అక్రమ బాగోతాలను కక్కిస్తాం’ అని కేసీఆర్ అన్నారు. పార్టీ నేతలు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, జి.వివేక్, కె.హరీశ్వర్‌రెడ్డి, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా రక్తంలోనే తేడా: కేటీఆర్
పుట్టిన గడ్డకు, పదవి ఇచ్చిన పార్టీకి, ప్రమాణం చేసిన రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారం చూస్తుంటే చిత్తూరు జిల్లాలోనే తేడా ఉందేమోనని అనిపిస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. కె.స్వామిగౌడ్, డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ప్రజలకు పన్నుపోటు పొడిచిన చంద్రబాబు వలెనే, కోన్‌కిస్కా కిరణ్‌కుమార్ రెడ్డికి పదవిని ఇస్తే సొంతపార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి కిరణ్‌బాబు,సత్తిబాబు, చంద్రబాబు, జగన్‌బాబు అంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు.