యాదాద్రి వరకు ఎంఎంటీఎస్
- రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసిన సీఎం కేసీఆర్
- భక్తుల సౌకర్యార్థం రెండో దశను విస్తరించాలని విజ్ఞప్తి
- ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు అదనపు లైన్ వేయాలి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని కోరారు. అందుకయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లిస్తామన్నారు. 2016-17 రైల్వే బడ్జెట్‌లో కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల్లో కొత్త లైన్ విస్తరణకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు.
హైదరాబాద్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి అభివృద్ధికి 2 వేల ఎకరాల భూములను సేకరించడంతో పాటు పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్-కాజీపేట రైల్వే లైన్ మార్గంలో రాయగిరి రైల్వే స్టేషన్‌కు సమీపంలో యాదాద్రి ఆలయం ఉందని, అందుకే ఎంఎంటీఎస్ రెండో విడతను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు మరో 32 కిలోమీటర్ల మేరకు ఈ లైన్‌ను పొడిగించి ఎంఎంటీఎస్ సేవలు అందించాలని కోరారు.
ఈ అదనపు లైన్ నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఎంఎంటీఎస్‌కు సంబంధించి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం అయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల వాటాను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాయగిరి స్టేషన్‌ను ‘యాదాద్రి’ స్టేషన్‌గా పేరు మార్చి అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. యాదాద్రి మాస్టర్ ప్లాన్ సంపూర్ణంగా అమలయ్యే నాటికి యాదాద్రికి ప్రతి రోజు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్ష దాటిపోతుందని వివరించారు.