ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణకు కృషి చేస్తా
- ఆ చట్ట సవరణకు ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకువస్తా
- రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: లోప భూయిష్టంగా ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం పకడ్బందీగా అమలయ్యేందుకు వీలుగా చట్ట సవరణకు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు, విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
మొదటి సభ్యుడినవడం సంతోషం
ప్రమాణ స్వీకారం అనంతరం విజయసాయిరెడ్డి పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడారు. ‘‘మొట్టమొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రవేశిస్తుండటం.. సభకు పార్టీ నుంచి మొట్టమొదటి సభ్యుడిగా అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వం అనేది ఒక అలంకారమైన పదవిగా నేను భావించడం లేదు. ప్రజల ఆకాంక్షలను, ఆశలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేస్తానని విన్నవించుకుంటున్నా.
రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం, పారిశ్రామిక కారిడార్, 13వ షెడ్యూలులో పొందుపరిచిన ప్రతి అంశం పార్లమెంటులో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషిచేస్తాను. భారత దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు వేరే పార్టీకి మారడం చట్ట విరుద్ధమని అందరికీ తెలుసు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో చర్యలకు ఒక కాలపరిమితి లేనందున స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఫిరాయింపుల చట్టానికి సవరణ తెచ్చేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. ఈ సెషన్‌లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రాజ్యసభ సభ్యుడిగా నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.