దక్షిణ మధ్య రైల్వే నం.1 | South Central Railway No.1 | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వే నం.1

Published Mon, Apr 20 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

దక్షిణ మధ్య రైల్వే నం.1

దక్షిణ మధ్య రైల్వే నం.1

భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్‌లలో అత్యధిక ఆదాయం పొంది తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు నిర్వహణ వ్యయాన్ని నియంత్రించటం ద్వారా ఆదాయంలో లాభపు మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచుకుని ఆపరేటింగ్ రేషియోలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. వెరసి నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించటం ద్వారా లాభాల బాటలో కూడా ఉత్తమంగా నిలిచింది. రూ. 3,610 కోట్ల లాభాలతో మూడు ఉత్తమ జోన్లలో ఒకటిగా నిలిచింది.

ఈ జోన్ అవతరించిన 49 ఏళ్లలో తొలిసారి ఈ రికార్డును సొంతం చేసుకుంది. తద్వారా ఏడాదిగా అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక సత్ఫలితాలిచ్చినట్లు అయింది.
 
రూ. 15,395 కోట్ల ఆదాయంతో దేశంలోనే తొలి స్థానం
ఏడాదిలో రూ.3 వేల కోట్ల లాభాలు.. మొత్తం ఆదాయంలో 76.55 శాతానికి వ్యయ నియంత్రణ
ఏడాది కాలంగా ప్రత్యేక ప్రణాళిక అమలుతో సత్ఫలితాలు


దూసుకెళ్లిన ఆదాయం...
ఐదేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే రూ. 8,532 కోట్ల ఆదాయాన్ని పొందితే తాజాగా అది రూ. 15,395 కోట్లకు చేరింది. ఈ రికార్డును చూసి ఆశ్చర్యపోయిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు...మిగతా జోన్లు కూడా దక్షిణ మధ్య రైల్వేను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొనడం ఈ జోన్ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. ఓ ఏడాది వ్యవధిలో 18.6 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్ల ఆదాయాన్ని పెంచుకోవటం కూడా మరే జోన్‌లో సాధ్యం కాలేదు.
 
ఆపరేటింగ్ రేషియోనే కీలకం...
ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఆపరేటింగ్ రేషియోలో తూర్పు కోస్తా రైల్వే ఇతర జోన్లకు అందనంత ఎత్తులో ఉంది. మొత్తం ఆదాయంలో అయ్యే వ్యయాన్ని శాతాల్లో చూపటమే ఆపరేటింగ్ రేషియో. తూర్పు కోస్తా రైల్వే 51 శాతాన్ని సాధించింది. అంటే మిగతా 49 శాతం లాభమన్నమాట. ఆ తర్వాతి స్థానంలో ఆగ్నేయ రైల్వే నిలిచింది. అది తాజాగా 73.72 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అంటే దాదాపు 26 శాతం లాభాలు పొందింది. దక్షిణ మధ్య రైల్వే 76.55 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. 23 శాతంకుపైగా లాభాలు సాధించిందన్నమాట. వచ్చే సంవత్సరం 70 శాతానికే ఆపరేటింగ్ రేషియోను నియంత్రించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఫలితాలిచ్చిన చర్యల్లో కొన్ని..  
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన 85 స్టేషన్‌లలో ఏడాది క్రితం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు రూ. 125 కోట్లకుపైగా విలువైన విద్యుత్ ఆదా అయింది.
సికింద్రాబాద్-వాడి, గుంతకల్-రాయచూర్, గుత్తి-రేణిగుంట, కృష్ణపట్నం పోర్టు లాంటి కీలక మార్గాలను విద్యుదీకరించారు. ఫలితంగా డీజిల్ వినియోగం తగ్గింది.
సికింద్రాబాద్-వాడిని ప్రయోగ మార్గంగా ఎంపిక చేసుకుని రైల్వేలో అత్యుత్తమ లోకో పైలట్ రైలు నడిపే తీరును పరిగణనలోకి తీసుకుని దాన్ని ఓ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. రైలు నడిపేటప్పుడు అయ్యే వ్యయాన్ని నియంత్రించేందుకు దీన్ని ప్రయోగంగా నమోదు చేశారు. దాని ఆధారంగా డీజిల్ ఆదాతోపాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని అంచనా వేశారు. ఈ లెక్కన మిగతా లోకో పైలట్లు నడిపే తీరును పరిశీలించి వారి లోపాలను గుర్తించి ప్రయోగ డ్రైవర్ స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించారు. వెరసి డ్రైవింగ్ ప్రమాణాలను పెంచటం ద్వారా రైలు నడిపేప్పుడు అయ్యే దుబారాను కనిష్ట స్థాయికి తగ్గించారు.
ఏ రాష్ట్రంలో డీజిల్ ధర తక్కువగా ఉందో గుర్తించి ఆయా మార్గాల్లో నడిచే రైళ్లలో అక్కడే డీజిల్ నింపే ఏర్పాటు చేశారు.
భారీ గూడ్సు రైళ్లకు రెండు ఇంజిన్లు ఏర్పాటు చేస్తారు. అయితే సరుకును పూర్తిగా అన్‌లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలోనూ రెండు ఇంజిన్లు నడిచేవి. ఇప్పుడు ఒక ఇంజిన్‌ను పూర్తిగా ఆఫ్ చేయిస్తున్నారు. దీనివల్ల డీజిల్/కరెంటు ఆదా అవుతోంది.
రైలును ప్లాట్‌ఫారానికి చేర్చే షంటింగ్ ఇంజిన్లు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆన్‌లో ఉంచే పద్ధతిని ఆపేశారు. దీనివల్ల భారీగా డీజిల్ ఆదా అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement