దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్‌టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.
‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.
ఎదుర్కొన్న సవాళ్లు
మొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి.
మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్‌పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను.
పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది.
ముఖ్యమైనవి వదులుకోవద్దు
పిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని.
ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను.
పాజిటివ్ ఆలోచనలు మేలు..
ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్.
కుటుంబ మద్దతు
ట్రెయిన్స్‌కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటో: నోముల రాజేష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment