భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై–గూడూరు మార్గంలో రైలు వేగాన్ని పెంచే విధంగా నిర్వహించిన ట్రైల్ రన్ సంతృప్తికరంగా జరిగినట్లు దక్షిణ రైల్వే జీఎం బీజీ మాల్య తెలిపారు. రైల్వే డివిజనల్ మేనేజర్ గణేష్, ప్రధాన ఇంజినీర్ దేశ్ రతన్ గుప్తాతో కలిసి గురువారం ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 110 కి.మీ వేగం నుంచి 130 కి.మీ వరకు పరిశీలించారు. చివరకు 143 కి.మీ వరకు నడిపారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా ప్రయాణ సమయం తగ్గతుందని, తద్వారా ప్యాసింజర్ల విలువైన సమయం ఆదా కానుంది.
సంతృప్తికరం
ట్రయల్ రన్ గురించి శుక్రవారం రైల్వే జీఎం బీజీ మాల్య మీడియాతో మాట్లాడారు. చెన్నైగూడూరు మార్గంలో అన్ని స్టేషన్‌లలో ఇంటర్‌లాకింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచామని తెలిపారు. ట్రాక్, సిగ్నల్, టీఆర్‌డీ, రోలింగ్ స్టాక్‌ల నిర్వహణ అవసరం పెరిగినట్లు వివరించారు. ఈ మార్గంలో వేగంగా సాగిన ట్రయల్ రన్ సంతృప్తిని కలిగించిందన్నారు. వేగం పెరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హౌరా, ముంబై వైపుగా వెళ్లే అనేక రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు.
తదుపరి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిని కలిపే విధంగా చెన్నై–రేణిగుంట మార్గంలో వేగం పెంపునకు ట్రయల్ రన్ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ తర్వాత అరక్కోణం–జోలార్‌పేట–పొత్తనూరు, సేరనూర్, తిరువనంతపురం, ఆలపులా, మంగళూరు తదితర మార్గాలపై దృష్టి పెడతామన్నారు. చివరగా, ఎగ్మూర్ నుంచి విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్ మార్గంలో వేగం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా రైళ్లు నడిపేందుకు తగ్గ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని తెలిపారు.
చదవండి: క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Comments
Please login to add a commentAdd a comment