సమాచారం ముందుగా ఇవ్వలేదని ఆగ్రహం
రైల్వే, రాష్ట్ర అధికారుల మధ్య పొరపచ్చాలు
విజయవాడ : రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు పలువురు డుమ్మాకొట్టారు. విజయవాడ - ధర్మవరం (17215నంబరు) రైలును మంగళవారం న్యూఢిల్లీ నుంచి రిమోట్ వీడియో లింకు ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఆ రైలుకు విజయవాడలో రైల్వే జీఎం ఆధ్వర్యంలో అధికారులు పచ్చజెండా ఊపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు రైల్వేస్టేషన్‌లో ఎంతో ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇప్పటి వరకు రైళ్లు మంజూరు చేయలేదని తప్పుబట్టిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు కొత్త రైలు ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మాకొట్టారని రైల్వే వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో ఏళ్ల డిమాండ్
విజయవాడ నుంచి రాయలసీమవైపు బయలుదేరే రైళ్లు కావాలని ఈ ప్రాంత ప్రయాణికులు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుకున్నట్లుగానే విజయవాడ నుంచి రాయలసీమకు వైపు వెళ్లేలా విజయవాడ - ధర్మవరం రైలును రైల్వేమంత్రి సురేష్ ప్రభు మంజూరు చేశారు. ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తరువాత రాష్ట్రానికి మంజూరు చేసిన రెండో రైలు ఇది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం గత నెలలో అమరావతి- సికింద్రాబాద్ మధ్య కొత్త రైలును మంజూరు చేసిన విషయం విదితమే.
రైల్వే, రాష్ట్ర యంత్రాంగం మధ్య పొరపచ్చాలు....
పుష్కరాల పేరుతో మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే తాము ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ జిల్లా యంత్రాంగం, మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలను రైల్వే తోసిపుచ్చుతున్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డు చివర్లో ఉన్న స్థలాన్ని బలవంతంగా తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తే రైల్వే అధికారులు అడ్డుకున్నారు. పుష్కర ఘాట్ల నిర్వహణలో జిల్లా, రైల్వే అధికారుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే మంత్రులు కొత్త రైలు ప్రారంభోత్సవానికి డుమ్మాకొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కరోజు ముందే పిలిచారని...
కొత్త రైలు మంజూరు చేసిన విషయం రైల్వే అధికారులకే ఆలస్యంగా అందింది. దీంతో అప్పటికప్పుడు కార్యక్రమాన్ని నిర్ణయించుకుని రాష ్టమ్రంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)తో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి పేర్లతో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఒక్క రోజు ముందుగా తమకు తెలపడమేమిటంటూ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహించి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని సమాచారం. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య రైలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరైన మంత్రులు, తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉండటంతో తమతమ పనుల్లోబిజీబిజీగా ఉండీ ఈ కార్యక్రమానికి రాలేదని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు.
రైలు ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధుల డుమ్మా
Published Wed, Jul 13 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement