ఎస్కలేటర్లకు వారంలోగా టెండర్లు
రైల్వే జీఎంను ఆదేశించిన మంత్రి సురేష్‌ప్రభు
రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని ముఖ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీ ప్రతిపాదించిన ప్రతిపాదనల పట్ల రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైల్వే మంత్రి తో చర్చించిన అంశాలు ఇలా...
► ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సంఖ్య పెరిగినందున రెండు లిఫ్ట్‌లు, రెండు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్ మంజూరై ఉందని, దీనికి నిధులు విడుదల కావాల్సి ఉందని ఎంపీ సుబ్బారెడ్డి రైల్వే మంత్రికి గుర్తు చేశారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవకు ఫోన్ చేసి వారం రోజుల్లోగా ఆయా పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పారంభించాలని ఆదేశించారు.
► రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏసీ వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న విశ్రాంతి గదులను ఏసీ చేయాలని కోరారు.
► సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని, ఇక్కడ నీటి కొరత కూడా ఉందని వివరించారు.
► ఒంగోలు రైల్వేస్టేషన్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 4.30 గంటల మధ్య ఒక్క రైలు కూడా లేదని, సికింద్రాబాద్- విజయవాడ వరకు వేసిన డబుల్ డెక్కర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
► జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కోసం జిల్లాలో దాదాపు 45 వేలమంది రాజస్థానీలు స్టాపింగ్ కోసం ఎదురు చూస్తున్నారని, ఆ రైలుతోపాటు కేరళ ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఒంగోలులో నిలపాలని పేర్కొన్నారు.
► కొండపి, కందుకూరుతోపాటు పలు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రంగా మారిన సింగరాయకొండలో కూడా పలు రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు.