సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైల్వే బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో పలు ప్రతిపాదనలను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు అందజేసినట్లు శ్రీకాకుళం ఎంపీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. గుణుపూర్ నేరోగేజ్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు దివంగత నేత ఎర్రన్నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. అదే విధంగా నవ్యాంధ్రలో ఇచ్ఛాపురం నుంచి కొత్త రాజధాని వరకు పాసింజర్ రైలు నడపాలని కోరినట్లు తెలిపారు. అన్ని స్టేషన్లను కలుపుతూ ఈ రైలు వెళ్లాలని జిల్లావాసుల కోరికగా పేర్కొన్నారు. స్థానిక స్టేషన్లలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండిం గ్‌లో ఉన్న పనుల కోసం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. వికలాంగుల కోసం ఎస్కలేటర్, పలాస, పొందూరు ప్రాంతాలకు మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఉత్తరాంధ్రను ఆదుకోవాలి
మార్చిలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలు ప్రస్తావించినట్లు తెలిపారు. తుపాను తర్వాత పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామికీకరణ, పన్ను రాయితీలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇటీవల ప్రకటించిన రూ.50 కోట్లు ఏ మూలకూ చాలవని, ఏపీ విభజన సమయంలో బిల్లులో పేర్కొన్న విధంగా సాయం చేయాలని కోరినట్లు తెలిపారు.
క్రికెట్ అభిమానుల కోసం..
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే వరల్డ్ కప్‌కు వెళుతున్న భారత్ జట్టు మంచి ఫామ్‌లో ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతతో సాగిందన్నారు. ఆదివారం సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ట్రాఫిక్ జాం, శాంతిభద్రతలు, కొందరు అభిమానుల దుందుడుకు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఫైనల్ మ్యాచ్‌కు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తానన్నారు.
రైల్వే మంత్రికి ప్రతిపాదనలు
Published Sun, Feb 22 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement