అది సామాన్యుల బడ్జెట్
రైల్వే బడ్జెట్‌పై మంత్రి సురేశ్‌ప్రభు
♦ రైల్వే వృద్ధి కోసం మూడంచెల వ్యూహం
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న విపక్షాల ఆరోపణలను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తిప్పికొట్టారు. బడ్జెట్ సామాన్యుల కోసమే రూపొందించిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం సేవల మెరుగు, ఆదాయ సమీకరణ, వ్యయ నియంత్రణ అనే మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో స్టాళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తామన్నారు. బుధవారం లోక్‌సభలో రైల్వేబడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. రైల్వేలో రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ పరీక్ష పద్ధతి తెచ్చామన్నారు. ప్రయాణ, రవాణా చార్జీల నుంచి మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీల సవరణల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎప్పుడు ధరలు పెంచినా ధరల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయని, అందువల్ల దీన్ని నివారించేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వే రెగ్యులేటరీ అథారిటీ పేరును ‘రైల్వే డెవలప్‌మెంట్ అథారిటీ’గా మార్చాలనుకుంటున్నామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో చేపడతామన్నారు. దీనికయ్యే మొత్తాన్ని 0.1 శాతం నామమాత్ర వడ్డీతో రుణమిచ్చేందుకు జపాన్ అంగీకరించిందన్నారు. జాట్ ఆందోళనల వల్ల రైల్వేకి రూ.55.92 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. చర్చ తర్వాత రైల్వే బడ్జెట్ సంబంధ ద్రవ్యవినియోగ బిల్లులను, గ్రాంట్స్ డిమాండ్లను సభ ఆమోదించింది.
జాతీయ జలరవాణా బిల్లుకు ఆమోదం
111 నదీమార్గాల్లో జలరవాణాను పెంచేందుకు ఉద్దేశించిన జాతీయ జలరవాణా బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. . బిల్లుకు లోక్‌సభ గత ఏడాదే ఆమోదం తెలిపింది.