రాజంపేట: పార్లమెంట్‌లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలో రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్‌లో కేవలం పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయపరంగా ముందంజలో ఉన్నా రైళ్ల కేటాయింపులోగానీ, పొడిగింపుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు
కడప–బెంగళూరుల మధ్య కొత్త ప్రాజెక్టుకు 2008–09లో ప్రణాళికలు తయారు చేసి రూ.2706 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభించారు. మొత్తం 255 కి.మీల పొడవు కల్గిన ఈ మార్గంలో ఇప్పటివరకు కేవలం 21 కి.మీలు కడప–పెండ్లిమర్రి మార్గం మాత్రమే పూర్తయింది. గత బడ్టెట్‌లో రూ.289 కోట్లు కేటాయించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుబట్టి దక్కించుకున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప, అనంతపురం జిల్లా వాసులకు బెంగళూరు నగరం మరింత దగ్గరవుతుంది.
కలగానే బాలాజీ డివిజన్ ప్రతిపాదన
డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్ల పరిధి ఉంటే డివిజన్‌గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె (83కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు.
బడ్జెట్‌లో ఆమోదం..సర్వేకే పరిమితం
∙కడప–గుంతకల్లు–బళ్లారి
∙కంభం–ప్రొద్దుటూరు
∙భాకరాపేట–గిద్దలూరు
∙ముద్దనూరు–ముదిగుబ్బ
నందలూరు రైల్వేకు ఏదీ పూర్వవైభవం
నందలూరు రైల్వేకు పూర్వవైభవం కోసం ఐకేపీఎస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలన హయాంలో చేపట్టిన ఉద్యమం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్ కూడా రాజ్యసభలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ« తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి.
మాట తప్పిన బీజేపీ నేతలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం కృషిచేస్తామన్న బీజెపీ అగ్రనేతలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను విస్మరించారు. పరిశ్రమ కాదు..ఉన్న రన్నింగ్ స్టాఫ్ క్రూసెంటర్‌ను, వివిధ రైళ్లకు ఉన్న స్టాపింగ్స్‌ను కూడా ఎత్తివేసే క్రమంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
స్టాపింగ్స్‌కు ఎర్నింగ్ అడ్డంకి..
పలురైళ్ల స్టాపింగ్స్‌కు ఎర్నింగ్స్‌ను అడ్డంకిగా చూపుతున్నారు. ప్రజాసేవను దూరంపెట్టేసింది. కేవలం లాభార్జన పరంగా ముందుకువెళ్లడంతో పలురైళ్లు జిల్లా వాసులకు దూరమయ్యాయి. కమలాపురం, రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరుతో పాటు కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా కొన్ని రైళ్ల స్టాపింగ్‌కు ఎర్నింగ్ అడ్డంకిగా చూపుతున్నారు.
పుణ్యక్షేత్రాల స్టేషన్లపై శీతకన్ను
జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల రైల్వేస్టేషన్లపై రైల్వేశాఖ శీతకన్ను వేసింది. రాష్ట్ర విభజన తర్వాత పుణ్యక్షేత్రంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్స్ లేదు. అలాగే మరో పుణ్యక్షేత్రమైన నందలూరు(సౌమ్యనాథాలయం) స్టేషన్‌లో కూడా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల రాజధానుల నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్‌రైళ్లకు స్టాపింగ్స్ లేవు. ఈ పుణ్యక్షేత్రాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. కనీసం బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు రైల్వే పరంగా కొద్దివరకైనా న్యాయం జరుగుతుందో లేక మళ్లీ మొండి చేయి చూపుతారో వేచి చూడాల్సిందే.
కన్నెత్తిచూడని కొత్తరైళ్లు..
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమో రైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకువస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
పెన్నా ఎక్స్‌ప్రెస్ పేరుతో హిందుపూరం నుంచి వయా ధర్మవరం, అనంతపురం గుత్తి, డోన్, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె మీదుగా నెల్లూరు వరకు రైలును తీసుకొస్తే సీమలోని కడప, అనంతపురం, నెల్లూరు జిల్లా మధ్య రాకపోకలకు సులభమవుతుంది.
∙నంద్యాల–కడప మధ్య నడిచే డెమో ఎక్స్‌ప్రెస్‌రైలును రేణిగుంట వరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలుకాలేదు.
∙ముంబయి–చెన్నై రైలు మార్గంలో రాత్రి వేళలో నడిచే నైన్ మెయిల్, టెన్ మెయిల్ రైళ్లు ఇప్పుడు లేకుండా చేశారు. పగటిపూట మాత్రమే అడపాదడపా రైళ్లు నడుస్తున్నాయి..
∙మచిలీపట్నం–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదన కార్యరూపందాల్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య
ప్రధానరైల్వేకేంద్రం: నందలూరు
ప్రధానస్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల,
ఓబులవారిపల్లె
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలమీదుగా
నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్)
గూడ్స్‌రైళ్లు: 40
స్టేషన్లు: 25
కార్మికులు: 4000
కిలోమీటర్లు: 180
Comments
Please login to add a commentAdd a comment