హైదరాబాద్- విజయవాడ సూపర్‌ఫాస్ట్
- ఉద్యోగులకు ప్రత్యేక రైలు
- 14 బోగీలు, ఒకటే స్టాప్
- ఐదున్నర గంటల్లో గమ్యం
సాక్షి, విజయవాడ: హైదరాబాద్, విజయవాడ మధ్య రైల్వే శాఖ సూపర్‌ఫాస్ట్ రైలును ప్రవేశపెడుతోంది. ఈ రైలును విజయవాడలో 20వ తేది రాత్రి 8.30 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారని రైల్వే ఏసీఎం రాజశేఖర్ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ రైలు వెలగపూడిలోని తాత్కాలిక రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల పనివేళలకు అనుకూలంగా ఉంటుంది. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగులకు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు వేళలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు.
గుంటూరులో ఒకటే స్టాప్..
విజయవాడ-సికింద్రాబాద్ (నెం: 12795) రైలు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 6.20 గంటలకు గుంటూరుకు, రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-విజయవాడ (నెం: 12796) రైలు ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి 10.08 గంటలకు గుంటూరుకు, 11 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ రైలు గుంటూరులో రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. వారంలో ఆదివారం మినహా మిగతా 6 రోజులు ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 14 బోగీలు ఉండగా.. రెండు ఎస్‌ఎల్‌ఆర్, రెండు ఏసీ చైర్‌కార్, 10 సీటింగ్ ఉంటాయి. ఉదయం పూట నడిచే రైళ్లు కావడంతో బెర్త్‌లు ఉండవు. మొత్తం రైలంతా సీటింగే ఉంటుందని రాజశేఖర్ తెలిపారు.