ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు | Paperless tickets in MMTS trains | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు

Published Thu, Feb 11 2016 5:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు

ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు

♦ ఢిల్లీలో ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు
♦ వీడియో లింకేజీ ద్వారా మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభం
♦ 2017 నాటికి ఎంఎంటీఎస్
♦ రెండో దశ పూర్తి చేస్తామన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం
 
 సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో మొబైల్ అప్లికేషన్ ద్వారా కాగిత రహిత టిక్కెట్లను పొందే సదుపాయాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో తిరిగే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలోనే అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని వీడియో లింకేజీ ద్వారా మంత్రి అందుబాటులోకి తెచ్చారు. బడ్జెట్‌లో ప్రకటించిన వివిధ రకాల ప్రాజెక్టులను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు.

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఖాళీ బెర్తుల సమాచారాన్ని అందజేసే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆన్‌లైన్ ద్వారా బెడ్‌రోల్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆన్‌లైన్ బుకింగ్ వివరాలను తెలుసుకునేందుకు టీటీఈలకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్(హెచ్‌హెచ్‌టీ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్ లెస్ టిక్కెట్ సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైళ్లలో ఐటీ ఆధారిత సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

జీపీఎస్ ఆధారంగా ఈ రైళ్లలో రాబోయే స్టేజీల అనౌన్స్‌మెంట్, ఎల్‌ఈడీ బోర్డులపై ప్రదర్శన వంటి సదుపాయాలకు ఐటీని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులను 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లోనూ అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లతో పాటు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను కూడా పొందే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వి.హనుమంతరావు, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్‌గుప్తా, చీఫ్ కమర్షియల్ మేనేజర్ పాపిరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్లు ఆశీష్ అగర్వాల్, అరుణా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆర్-వ్యాలెట్ ద్వారా రీచార్జ్..
 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ‘యూటీఎస్ ఆన్ మొబైల్ డాట్ ఇండియన్ రైల్ డాట్ జీవోవీ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలి. టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆర్-వ్యాలెట్‌ను రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. రూ.100 నుంచి రూ.5,000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. ఆర్-వ్యాలెట్‌ను ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. బయలుదేరవలసిన స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకోవాలి.
 
 టిక్కెట్ ఇలా బుక్ చేసుకోండి..
 ► పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ‘బుక్ టిక్కెట్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
 ► తర్వాత స్క్రీన్‌పైన ‘నార్మల్ బుకింగ్’ను ఎంపిక చేసుకోవాలి.
 ► ఆ తర్వాత బయలుదేరవలసిన స్టేషన్ పేరు, చేరుకోవలసిన స్టేషన్ పేరు నమోదు చేసి ‘డన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
 ► ఎంతమంది ప్రయాణించేది, పిల్లలు ఉంటే ఆ వివరాలను ఎంపిక చేసుకోవాలి. దాంతో ఆర్-వ్యాలెట్ సెలెక్ట్ అవుతుంది.
 ►  ఆర్-వ్యాలెట్ నుంచి ప్రయాణానికి అయ్యే టిక్కెట్ చార్జీలు డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత ‘బుక్ టిక్కెట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టిక్కెట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. టీటీఈలు వచ్చినప్పుడు ఈ మొబైల్ టిక్కెట్ చూపిస్తే చాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement