ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును ఆదుకోవాలంటూ ఓ తండ్రి ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తికి.. 20 నిమిషాల్లోనే స్పందించి, సాయమందించి మరోసారి ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకున్నారు.
@sureshpprabhu @RailMinIndia need medical attention..One of the child 6yrs old fell off upper seat..cut back of the head
— Bibhuti (@goneinseconds) 31 March 2016
మార్చి 31న న్యూఢిల్లీ నుంచి వైష్ణో దేవీ ఆలయానికి తన కుటుంబంతోపాటు బిభూతి రైల్లో బయలుదేరి వెళ్లారు. అయితే, ప్రయాణిస్తుండగా అప్పర్ బెర్తు నుంచి తన ఆరేళ్ల కొడుకు కిందపడి.. తల వెనుకభాగంలో తెగిన గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో సురేశ్ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖలకు ట్యాగ్ చేస్తూ వెంటనే ట్వీట్ చేశారు బిభూతి. తన కొడుకుకు రక్తస్రావం జరుగుతోందని, వెంటనే సాయమందించాలని వేడుకున్నాడు. కనీసం బ్యాండేజ్ అయినా అందించాలని ప్రార్థించాడు. కేవలం 20 నిమిషాల్లోనే ఆయన ట్వీట్‌కు స్పందన లభించింది. రైల్వేమంత్రిత్వశాఖ బిభూతికి సాయమందించేందుకు ముందుకొచ్చింది. ఆయన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది. తదుపరి స్టేషన్ లుధియానాలో ఆ బాలుడికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి తన బిడ్డకు సత్వరమే వైద్యసాయమందినందుకు బిభూతి రైల్వే మినిస్ట్రీకి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు.
@sureshpprabhu @RailMinIndia it's bleeding..pls help..atleast bandage
— Bibhuti (@goneinseconds) 31 March 2016
@sureshpprabhu @RailMinIndia I am thankful to all of you for providing medical facility to my son in quickest possible time. Awesome support
— Bibhuti (@goneinseconds) 31 March 2016
నిజానికి గోయింగ్ ఇన్ సెకండ్స్ పేరిట ట్విట్టర్లో ఖాతా కలిగిన బిభూతి అంతకుముందు రైల్వేమంత్రిత్వశాఖను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. తాము ప్రయాణిస్తున్న రైల్లో టాయ్‌లెట్ సరిగ్గా లేదని, దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కూడా రైల్వేశాఖ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించింది. ఇటీవల ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు రైల్వేశాఖ వెంటనే స్పందిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఓ జంట తమ బిడ్డ రైల్లో తప్పిపోయిందని ఫిర్యాదు చేయగా.. వారి బిడ్డను తిరిగి వారికి చేర్చడంలో సాయపడింది. అలాగే ఇతన విజ్ఞప్తుల విషయంలోనూ రైల్వేశాఖ సహకారమందిస్తుండటంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు.