
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా... బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) వస్తాయంటూ మోదీ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అచ్చేదిన్ గురించి పలువురు కాంగ్రెస్ నాయకులు ఎన్నోసార్లు ఎద్దేవా చేశారు. అయితే అచ్చేదిన్ గురించి.. ‘మాతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాడు పాల్ పోగ్బా ఫీలింగ్ కూడా అదే’ అంటూ ఓ వీడియోను కాంగ్రెస్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
వీడియోలో ఏముందంటే..
ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో విజయం సాధించిన అనంతరం ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో సహచర ఆటగాడి కోసం వెదుకుతున్న పాల్ పోగ్బా ఉద్వేగంతో కాస్త భిన్న హావభావాలతో చుట్టూ చూశాడు. ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అచ్చేదిన్ కోసం ఎక్కడా.. ఎక్కడా అని వెదుకుతున్నారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.
Pogba and us, same feels. @paulpogba pic.twitter.com/rIOqjY6bqT
— Congress (@INCIndia) July 17, 2018