సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు, ప్రత్యేకించి యువత అనేక త్యాగాలు చేసిన విషయాన్ని మరచి, పార్లమెంటు వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరాధార ప్రకటనలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వాస్తవాలను పక్కన పెట్టి తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదన్నారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు సాగించిన రాజీ లేని పోరాటం వల్లే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదన్న మోదీ, చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చారిత్రక అంశాల పట్ల ప్రధాన మంత్రి సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మానుకోవాలన్నారు.
గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని ప్రధాని, కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి, ఇక్కడ పుట్టగతులు ఉండవన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం మానుకుని పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పాలన్నారు. ద్వేషం కంటే దేశం ముఖ్యమని, దేశమంటే రాష్ట్రాల సమాహారం అని ప్రధాని తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment