రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఈ సారైనా ప్రాధాన్యత దక్కేనా..? రైల్వే మంత్రి సురేష్ ప్రభు దక్షిణ రైల్వేను కరుణించేనా?.. పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?.. అని తమిళనాడు రాష్ర్ట ప్రజలు ఆలోచనల్లో పడిపోయారు. రైల్వే బడ్జెట్‌ను గురువారం పార్లమెం టులో ప్రవేశపెట్టనుండడమే ఇందుకు కారణం.
చెన్నై, సాక్షి ప్రతినిధి :కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఏడాది అప్పటి రైల్వేమంత్రి సదానంద గౌడ మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో కొత్త రైళ్లు పరుగులెట్టాలని, కొత్త మార్గాల రూపకల్పన సాగాలని, మరిన్ని సౌకర్యాలు కలగాలని ప్రయాణికులు ఆశించడం సహజం. కొత్త బడ్జెట్‌లో ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఏసీలో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లుగా ఒక చల్లని వార్త ప్రచారంలో ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాలు ఏనాడో అటకెక్కేశాయి. గత మధ్యంతర బడ్జెట్‌లో తమిళనాడుకు రెండు కొత్త రైళ్లు, అనేక పథకాలను ప్రకటించారు. వీటిలో చెన్నై-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ హామీకే పరిమితమైంది.
తిరుచ్చీ-నాగర్‌కోవిల్, చెంగల్పట్టు-దిండుగల్లు డబుల్‌లైన్ పనులు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. చెన్నై- కన్యాకుమారీ డబుల్‌లైన్ పనులు పదేళ్లుగా సాగుతున్నాయి. నిధుల్లేమి వల్లనే నత్తనడకలా పనులు నిర్వహిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జ్ నడుమ 5, 6వ లైన్ల విస్తరణ పనులకు సైతం నిధుల గ్రహణం పట్టుకోవడంతో పనుల్లో వేగం కొరవడింది. రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావించడమేగానీ, నిధులు మంజూరు చేయకపోవడంతో రాష్ట్రానికి సంబంధించి సుమారు 24 పథకాలు బుట్టదాఖలయ్యాయి
రాయపురం వరం దక్కేనా
రైల్వే బడ్జెట్ అనగానే రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదురుచూసేది రాయపురం రైల్వేస్టేషన్ వైభవం. దక్షిణాది రాష్ట్రాల్లోకే ప్రథమంగా బ్రిటిషు దొరలు రాయపురం రైల్వేస్టేషన్‌ను 1856లో నిర్మించగా అదే ఏడాది అక్కడి నుంచి తొలిరైలు పట్టాలపై పరుగులెట్టింది. 1873లో సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో సేవలు ప్రారంభం కాగా 1959, 1998లో మరింతగా విస్తరించారు. 1922 వరకు రాయపురం నుండే రైల్వేసేవలు అందగా, ఎగ్మూర్‌లో మరో రైల్వేస్టేషన్ నిర్మించి అదే ఏడాది రాయపురం ైరె ల్వేస్టేషన్ కార్యకలాపాలను బదలాయించారు. ఈ మార్పులో రాయపురం రైల్వేస్టేషన్ కేవలం లోకల్‌రైళ్లకే పరిమితమైంది.
సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల సంఖ్య ప్రయాణికుల రద్దీ, పెరిగిపోవడంతో అందరి దృష్టి మరలా రాయపురం రైల్వేస్టేషన్‌పై పడింది. చెన్నైలో మూడో రైల్వేస్టేషన్‌గా రాయపురం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దాలని 2005లో తమిళనాడుకు చెందిన అప్పటి రైల్వేమంత్రి వేలు నిర్ణయించారు. అనేక ఇబ్బందులు ఎదురైన దృష్ట్యా ఇది అంతసులువు కాదని తేలడంతో పక్కనపెట్టేశారు. ఈ విషయమై ఇటీవల చెన్నైకి వచ్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభును మీడియా ప్రశ్నించగా సర్వే సాగుతోంది, పరిశీలిస్తున్నామని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి ప్రాధాన్యం ఏర్పడుతుందోలేదో వేచిచూడాలి మరి?.
‘ప్రభు’వు కరుణించేనా?
Published Thu, Feb 26 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement