నిధులు నిల్.. లైన్ క్లియర్
♦ రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం
♦ సర్వే పనులకు నిధులు విదల్చని వైనం
♦ మెతుకుసీమపై ప్రభుదయ అరకొరే..
♦ మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌కు రూ. 30 కోట్లు
♦ మెదక్-అక్కన్నపేటకు రూ.5 కోట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ; మెతుకుసీమకు మళ్లీ అరకొర నిధులే విదిల్చారు.. పాత రైల్వే లైన్ పనులకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండానే.. కొత్త రైలు మార్గం ప్రతిపాదనతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు జిల్లా ప్రజలను సంతోషపరిచే ప్రయత్నం చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు రూ 30 కోట్లు, మెదక్- అక్కన్నపేట లైన్‌కు రూ 5 కోట్లు మాత్రమే కేటాయించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ - జహీరాబాద్ రైలు మార్గాన్ని ఈ బడ్జెట్‌లో ఆమోదించారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలను కలుపుతూ జహీరాబాద్ వరకు రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో 70 కిలో మీటర్ల మేర కొత్త రైలు మార్గం కోసం గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సర్వే పనుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం.
కేటాయింపులు అంతంతే..
జహీరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలిని (నిమ్)్జ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో ఈ రైల్వే లైన్ తప్పని సరి అయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి బీదర్ వరకు మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. జిల్లాలోని నారాయణఖేడ్ మీదుగా వెళ్లే ఈరైల్వే లైన్‌కు కూడా ఆమోదం లబించింది. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు తీవ్ర నిరాశపరిచాయి.తూప్రాన్ మండలం మనోహరాబాద్ నుంచి కరీంనగర్ మండలం కొత్తపల్లి వరకు దాదాపు 148 కిలో మీటర్ల పొడవు , రూ.308 కోట్ల అంచనా వ్యయంతో 2005లో ఈ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు దాని అంచాన వ్యయం రూ. 1000 కోట్లకు పెరిగింది. జిల్లాలో 88 కిలో మీటర్ల వరకు లైన్ వెళుతోంది. 2014-15 బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. తొలివిడతగా 27 కిలో మీటర్ల మేర సేకరించిన 387 ఎకరాల భూమిని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ రైల్వే అధికారులకు అప్పగించారు. మరో 61 కిలోమీటర్ల మేరకు భూ సేకరణ ప్రక్రియ వేగ వంతం చేశారు. భూ సేకరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నందున ఈ బడ్జెట్‌లో మనోహరాబాద్ రైల్వే లైన్‌కు పెద్ద పీట వేస్తారని అందరూ భావించారు. కానీ తాజాగా రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించి ప్రజలను నిరాశపరిచారు.
‘మెదక్-అక్కన్నపేట’పై నీళ్లు
తుదిదశలో ఉన్న మెదక్- అక్కన్నపేట రైల్వే లైన్ మీద కేంద్ర మంత్రి కనికరం చూపించలేదు. కేవలం రూ. 5 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొత్త బ్రాడ్‌గేజ్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తి చేశారు. మొత్తం 17 కిలో మీటర్ల మేరకు దాదాపు 318 ఎకరాల భూమి సేకరించారు. భూమి కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. కానీ బడ్జెట్‌లో కేవలం రూ 5 కోట్లు మాత్రమే కేటాయించడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నిరాశే మిగిలింది..
2016-27 రైల్వే బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు మళ్లీ నిరాశే మిగిలింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు రూ.5 కోట్లు, కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. కొత్తగా బోధన్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్‌కు 138 కి.మీ., సికింద్రాబాద్-సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు 64 కి.మీ. రైలు మార్గం మంజూరు చేసినా నిధులివ్వలేదు. లింగంపల్లి నుంచి సంగారెడ్డి, జోగిపేట, మెదక్, సిద్దిపేట మీదుగా పెద్దపల్లికి కొత్తలైన్ నిర్మించాలన్న జిల్లా ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరలేదు.
- ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు
జిల్లాకు మళ్లీ మొండిచెయ్యి
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే మిగిలింది. అక్కన్నపేట-సిద్దిపేట లైన్‌కు సర్వే జరిగినా హామీ ఇవ్వలేదు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు సౌకర్యం, సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వరకు లైన్ అవసరమైనా కేటాయించలేదు. - ఎ.మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి
బడ్జెట్‌లో ఆ ఊసే లేదు..
రైల్వే లైన్ ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించి ఊసే లేదు. ఎంపీలూ కృషి చేయలేదు. రాష్ట్రం వెనుకబడిందనే తెలంగాణ తెచ్చుకున్నాం. నిధులు లేకుంటే ఎలా అభివృద్ధి చెందుతుంది. జిల్లాకు అన్యాయం జరిగింది. - సునీత లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు
ఏదీ ప్రాధాన్యం?
వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధ్యాన క్రమం లో నిధులు కేటాయిస్తామని తరచూ చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాటలు వట్టి మాటలే. మంజూరైన వాటిని నిధులు లేవు. కొత్త లైన్ల ఊసే లేదు. - కె.రాజయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాకు అన్యాయం
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం జరిగింది. జిల్లా ఎం పీలు ఏం చేస్తున్నారు. జిల్లాలో రైల్వే సౌకర్యం ఎంత ఎ క్కువ ఉంటే అంత అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ కావాలంటే జిల్లాలో రైల్వే లైన్లు ఎక్కువ ఏర్పాటు చేయాలి. టీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చే సుకుంటున్నారు. అభివృద్ధి గురించి వారికి పట్టడం లేదు. - గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు
పేదలకు ఉపయోగం
కేంద్ర ప్రభుత్వం పేదలకు, మధ్య తరగతి ప్రయాణికులకు ఉపయోగపడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ చేసిన పాపాలు కడగాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. దేశాభివృద్ధి, లక్ష్యాలకు అనుకుణంగానే బడ్జెట్ ఉంది. - కాసాల బుచ్చిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు