డ్రీమ్స్ ఎక్కువ ..డీజిల్ తక్కువ ! | Dreams are so many | Sakshi
Sakshi News home page

డ్రీమ్స్ ఎక్కువ ..డీజిల్ తక్కువ !

Published Fri, Feb 26 2016 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

డ్రీమ్స్  ఎక్కువ ..డీజిల్ తక్కువ !

డ్రీమ్స్ ఎక్కువ ..డీజిల్ తక్కువ !

కష్టాల పట్టాలపై ‘ప్రభు రైలు’ కలల ప్రయాణం  ఈ ఏడాది ఆదాయార్జనలో వెనుకబడిన రైల్వేశాఖ
 
 ప్రయాణికులకు ప్రత్యేకం
 
♦ జనని పథకం కింద చిన్నారులకు ఆహారం, వేడి పాలు, నీళ్లను అందుబాటులో ఉంచుతారు.
♦ ఐఆర్‌సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న అన్ని తరగతుల ప్రయాణికులకు ఎంపిక చేసిన
♦ రైల్వేస్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్‌రోల్స్ అందిస్తారు.
♦ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా లోకల్ ట్రైన్ టికెట్లు, 139కు కాల్ చేస్తే ‘వన్ టైమ్ పాస్‌వర్డ్’ ద్వారా పీఆర్‌ఎస్ టికెట్లు రద్దు.
♦ టికెట్లపై బార్‌కోడ్‌ల ముద్రణ
♦ వికల్ప్ ద్వారా ప్రయాణికులు కోరుకున్న రైళ్లలో ప్రత్యామ్నాయ వసతి కల్పించటం
 
 కలలు...
► ఢిల్లీ - చెన్నైలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్‌లను మూడేళ్లలో నిర్మించటం.
► 3 రకాల కొత్త ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు.. హమ్‌సఫర్, తేజాస్, డబుల్ డెక్కర్ ఉదయ్, ఏసీ రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు అంత్యోదయ, తీర్థ స్థలాలను కలుపుతూ ‘ఆస్థా’ రైళ్లు ప్రవేశపెట్టడం.
► చెన్నైలో భారతదేశపు తొలి ఆటో హబ్ ఏర్పాటు. ఏడాదిలో రూ. 40 వేల కోట్ల వ్యయంతో రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీల ఏర్పాటు.
► వచ్చే ఏడాది 2,000 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ.. 300 రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు. ఈ ఏడాది కల్లా 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తేవటం.. రానున్న రెండేళ్లలో మరో 400 స్టేషన్లలో ఆ సౌకర్యం ఏర్పాటు.
► మొత్తం మీద రూ. 92,714 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 44 కొత్త ప్రాజెక్టులను కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేయటం.
 
 కష్టాలు...
► ‘‘ఇది సవాళ్ల సమయం. మేం రెండు ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాం. అవి ఏమాత్రం మా నియంత్రణలో లేనివి. (అవి) అంతర్జాతీయంగా మందగమనం కారణంగా మన ఆర్థికవ్యవస్థ మూల రంగాల వృద్ధి నెమ్మదించటం.. ఏడో వేతన సంఘం ప్రభావం...’’ అని రైల్వేమంత్రే స్వయంగా పేర్కొన్నారు.
► 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ. 15,744 కోట్లు తగ్గింది. ఆర్థికవ్యవస్థలో మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరుకు రవాణా ఆదాయం తగ్గిపోయింది.
► ప్రస్తుత ఏడాది ఆదాయం కన్నా పది శాతం ఎక్కువగా వచ్చే ఏడాదిలో రూ. 1.84 లక్షల కోట్లు ఆదాయార్జన లక్ష్యమని ప్రకటించారు. ఆర్థికవ్యవస్థ మూల రంగం వృద్ధి ఆరోగ్యవంతంగా ఉంటుందన్న ఆశతో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ.. అది ఆశే.. గ్యారంటీ లేదు.
► ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వస్తుండటంతో వచ్చే ఏడాది రైల్వేపై దాదాపు రూ. 32,000 కోట్ల అదనపు భారం పడుతోంది... రైల్వే కష్టాల్లో ఉన్నాకూడా.. ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది.
 
 న్యూఢిల్లీ: ఒకవైపు ఈ ఏడాది అనుకున్న ఆదాయం రాలేదు. లక్ష్యానికి రూ. 15.7 వేల కోట్ల దూరంలోనే మన రైలు బండి ఆగిపోయింది. మరోవైపు.. వచ్చే ఏడాది ఏడో వేతన సంఘం అమలు భారం రైల్వేలపై భారీగానే పడనుంది. దాదాపు రూ. 32 వేల కోట్లు అదనపు వ్యయం కానుంది. పరిస్థితి సవాళ్లతో కూడుకుని ఉందని స్వయంగా అమాత్యులే ప్రకటించారు. అవి తన నియంత్రణలో లేనివనీ వక్కాణించారు. అలాగని.. చార్జీలు పెంచలేదు. ప్రయాణ చార్జీలు కానీ, సరకు రవాణా చార్జీల జోలికి పోలేదు. కానీ.. వచ్చే ఏడాది బడ్జెట్‌లో కొన్ని కొత్త కలలను రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఆవిష్కరించారు. మూడు రకాల కొత్త సూపర్ ఫాస్ట్ ఏసీ రైళ్లు; మరో రకం ఏసీ, రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు; ముఖ్యమైన తీర్థస్థలాలను కలుపుతూ ఆస్థా రైళ్లు.. మూడేళ్లలో ఉత్తర - దక్షిణ, తూర్పు - పడమర, తూర్పు తీర రవాణా కారిడార్ల నిర్మాణం.. వంటి ఆశావహ ప్రాజెక్టులను ప్రకంటించారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, ఆధునీకరణ చర్యలతో పాటు.. స్టేషన్లలోనూ, రైళ్లలోనూ వసతి సదుపాయాల పెంపు.. మహిళలకు, వృద్ధులకు, విలేకరులకు పలు తాయిలాలు ప్రకటించారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 790 కోట్ల మేర ప్రస్తుతం నడుస్తున్న, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.
 
 4 కొత్త రకం రైళ్లు...
  రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు 2016-17 సంవత్సరానికి రైల్వేబడ్జెట్‌ను గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన సమర్పించిన రెండో రైల్వే బడ్జెట్ ఇది. దాదాపు గంటసేపు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రకటించిన కొత్త రకం రైళ్లలో.. మూడో తరగతి ఏసీతో నడిచే ‘హమ్‌సఫర్’ సర్వీసు మొదటిది. రెండోది.. దేశంలో రైలు ప్రయాణ భవిష్యత్తును ప్రతిబింబించే ‘తేజాస్’ సర్వీసు. ఇది 130 కిలోమీటర్ల వేగంతో నడవటమే కాక.. వినోదం, స్థానిక ఆహారం, వైఫై వంటి సర్వీసులూ ఉంటాయి. మూడోది ఉదయ్ (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఎక్స్‌ప్రెస్). అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రివేళ ఈ రైలు నడుస్తుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికుల ప్రయాణ నాణ్యతను పెంపొందించటం కోసం దూర ప్రాంతాల మధ్య ‘అంత్యోదయ’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే.. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోని పలు రైళ్లలో ‘దీన్ దయాళ్’ పేరుతో రిజర్వేషన్ లేని బోగీలు రెండు, మూడు చేరుస్తామని చెప్పారు. అందులో తాగునీరు, మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎక్కువ ఏర్పాట్లు ఉంటాయన్నారు.
 
 3 కొత్త రవాణా కారిడార్లు...
 ఇక కొత్త సరకు రవాణా కారిడార్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. ఢిల్లీ - చైన్నై నగరాలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్‌లను నిర్మిస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులను 2019 కల్లా పూర్తిచేస్తామని.. వాటిని నిర్దిష్ట కాలావధిలో అమలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.  ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి సహా వినూత్న నిధుల కేటాయింపు పథకాలతో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తామని చెప్పారు. అలాగే.. రూ. 40 వేల కోట్ల వ్యయం కాగల రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీలను కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది వెల్లడించలేదు. ఇక చెన్నైలో దేశంలోనే తొలి ఆటో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
 
 రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ..
 సరకు రవాణా టారిఫ్ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తామని ప్రభు హామీ ఇచ్చారు. ఇతర రవాణా పద్ధతులతో పోటీపడేలా ధరలను రూపొందించటానికి సమీక్ష చేపడతామని చెప్పారు. అదనపు ఆదాయాన్ని సముపార్జించటానికి సరకు రవాణా బాస్కెట్‌ను విస్తరిస్తామన్నారు. సేవలకు న్యాయమైన ధరలను నిర్ణయించటానికి, పోటీని పెంపొందించటానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపడటానికి, సామర్థ్య ప్రమాణాలను నిర్ధారించటానికి రైల్ డెవలప్‌మెంట్ అథారిటీని నెలకొల్పుతామని ప్రభు ప్రకటించారు. సంబంధిత భాగస్వాములతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధమవుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం దీర్ఘ కాలిక దృష్టితో ‘జాతీయ రైల్వే ప్రణాళిక’ను తొలిసారిగా రూపొందించనున్నట్లు సురేశ్‌ప్రభు వివరించారు.
 
 పెట్టుబడి వ్యయం 1.21 లక్షల కోట్లు
 వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.21 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయంతో బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు రైల్వేమంత్రి తెలిపారు. గత సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రణాళికా వ్యయం సగటుకన్నా ఇది రెట్టింపని చెప్పారు. ప్రస్తుత సంవత్సరం కన్నా ఇది 20 శాతం అధికం. సామర్థ్య నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు కచ్చితమైన నిధులు అందేలా చూడటం కోసం.. వివిధ మార్గాల నుంచి నిధులు సేకరిస్తామని చెప్పారు. రైల్వే ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయీ ఆర్థికాభివృద్ధిని ఐదు రూపాయలు పెంచుతుందని పేర్కొన్నారు. 2015-16 సంత్సరంలో నిర్వహణ దామాషా (ఆపరేషన్ రేషియో) 90 శాతంగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం అది 92 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.
 
 2020 నాటికి సామాన్యుల కలలు సాకారం
 సామాన్యుడు సుదీర్ఘ కాలంగా కోరుకుంటున్న ఆకాంక్షలు 2020 నాటికి సాకారమవుతాయని రైల్వేమంత్రి తన విజన్‌ను వివరిస్తూ పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న రైళ్లలో రిజర్వుడు వసతి, టైమ్-టేబుల్ ప్రకారం నడిచే రవాణా రైళ్లు, భద్రత రికార్డును మెరుగుపరచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లన్నిటినీ తొలగించటం, సమయపాలనను మెరుగుపరచటం, రవాణా రైళ్ల అధిక వేగం, మానవ వ్యర్థాల నేరు విసర్జనను సున్నాకు తీసుకెళ్లటం లక్ష్యాలుగా చెప్పారు.
 
 మార్చికల్లా కాంట్రాక్టులన్నీ కేటాయింపు
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ముందే.. సివిల్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టులన్నిటి కేటాయింపు పూర్తవుతుందని ప్రభు తెలిపారు. అంతకుముందు ఆరేళ్లలో కేవలం రూ. 13,000 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇవ్వగా.. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రూ. 24,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
 
 వసూళ్ల అంచనా 1.84 లక్షల కోట్లు
 2016-17 ఆర్థిక సంవత్సరంలో రవాణా వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లు ఉంటాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. అందులో ప్రయాణ ఆదాయం 12.4 శాతం మేర పెరుగుతుందన్న అంచనాతో.. రూ. 51,012 కోట్ల ఆదాయ లక్ష్యం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగం ఆరోగ్యవంతమైన వృద్ధి సాధిస్తుందన్న అంచనాతో.. వచ్చే ఏడాది రైల్వే సరకు రవాణా 500 కోట్ల టన్నుల మేర అదనంగా పెరుగుతుందని లెక్కగట్టారు. ఆ మేరకు సరకు రావాణా ఆదాయం రూ. 1.17 లక్షల కోట్లు ఉంటుందని అంచనాగా పేర్కొన్నారు. ఇతరత్రా మార్గాల్లో రూ. 15,775 కోట్లు ఆర్జిస్తామని అంచనా వేశారు. ప్రయాణ చార్జీల రాయితీ నష్టం రూ. 30,000 కోట్లుగా ఉండగా.. ప్రభుత్వం నుంచి రూ. 40,000 కోట్లు బడ్జెటరీ మద్దతుగా రైల్వేలు పొందనున్నాయి.
 
 బడ్జెట్ హై లైట్స్..
 రైల్వే చార్జీలు పెంచలేదు. ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు యథాతథం రూ.8.5 లక్షల కోట్లతో ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణ
 
 2016-17లో ైరె ల్వేలో 1.21 కోట్ల పెట్టుబడులు
 
► హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేర్లతో కొత్తగా మూడు సూపర్‌ఫాస్ట్ రైళ్లు
► ప్రముఖ పుణ్యతీర్థాలను అనుసంధానిస్తూ ఆస్థా సర్క్యూట్
► సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ పేరుతో సూపర్‌ఫాస్ట్ రైలు
► నీళ్లు, మొబైల్ చార్జింగ్ వసతులతో సాధారణ
► ప్రయాణికులకు దీన్‌దయాళు కోచ్‌లు
 
 50% సీనియర్ సిటిజన్‌లకు లోయర్ బెర్తుల్లో అదనపు కోటా
400 రైల్వే స్టేషన్లలో వైఫై. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరో 100 స్టేషన్లలో వైఫై
30,000 వచ్చే ఏడాదికల్లా రైళ్లలో ఏర్పాటు చేసే బయో టాయ్‌లెట్లు
 
► 2020కల్లా డిమాండ్‌కు అనుగుణంగా {పయాణికులందరికీ రిజర్వేషన్ సదుపాయం
► ఇ-టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 2,000 నుంచి 7,200కు పెంపు
► ముఖ్యమైన అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు
► వచ్చే ఏడాదికల్లా రైళ్లలో 30 వేల బయో టాయ్‌లెట్లు
► పాత్రికేయులు రాయితీ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కూడా పొందే సదుపాయం... ప్రయోగప్రాతిపదికన టికెట్లపై బార్‌కోడ్
► విదేశీ డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ఇ-టికెట్లు
► త్వరలో చేతిలో ఇమిడే మిషన్ల ద్వారా రైల్వే టికెట్ల జారీ.
► వికలాంగులు, వృద్ధులకు ‘రైల్ మిత్ర’ ద్వారా సేవలు
► ప్రయాణికులకు ఐచ్చిక ప్రయాణ బీమా
► చిన్న పిల్లలకు ఆహారం అందించేందుకు జననీ సేవ
► అటోమేటిక్ డోర్లు, బయో వాక్యూమ్ టాయిలెట్లతో స్మార్ట్ బోగీలు
► టికెట్ల జారీ, ఫిర్యాదులు తదితరాలకు మొబైల్ యాప్
► బోగీల్లో జీపీఎస్ ఆధారిత డిజిటల్ సమాచార బోర్డులు
► ప్రయాణికుల చార్జీల్లో రాయితీలకు రూ.30 వేల కోట్లు
 
 లక్ష్యానికి దూరంగా ఆదాయార్జన
 ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయార్జన సాధించలేదు. 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది ఆదాయం రూ. 15,744 కోట్లు తగ్గింది. ప్రయాణ, సరకు రవాణా ఆదాయాలు రెండూ అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరకు రవాణా ఆదాయం తగ్గిపోయింది. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో రూ. 8,720 కోట్లు ఆదా చేసినట్లు లెక్కలు చూపారు. అయితే.. గత ఏడాది కాస్త ఆదాయం పెంచుకోవటానికి సరకు రవాణా చార్జీలను స్వల్పంగా పెంచిన సురేశ్‌ప్రభు.. ఈ ఏడాది పరిస్థితి గడ్డుగా ఉన్నా కూడా.. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చార్జీల జోలికి పోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement