Railway budget 2016
-
'గౌరవం సరే.. కష్టాల్ని పట్టించుకోరా?'
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకొని తమకు అరకొర సంతోషాన్ని మాత్రమే ఇచ్చిన కేంద్రం ప్రధాన సమస్యను మాత్రం పక్కకు పెట్టిందని రైల్వే సహాయక్ (కూలీలు)లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సమస్య తమను పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అని, దీంట్లో నుంచి తమను బయటపడేసేలా నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. అయితే, బడ్జెట్ లో ప్రకటించినట్లుగా కొత్త డ్రెస్ కోడ్, కూలీలనే పేర్ల స్థానంలో సహాయక్ అనే కొత్త పేరు తమకు కొంత గౌరవాన్ని మాత్రం కట్టబెడుతుందని అభిప్రాయపడ్డారు. 'కొత్త యూనిఫాం, స్టేటస్ మాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది మా అందరికి మంచి విషయమే. కానీ మాకు అతిపెద్ద సమస్య ఆర్థికపరమైన సమస్య. దీన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మాకంటూ ముందే నిర్ణయించబడిన రేట్లు లేనందువల్ల ప్రయాణీకులతో నిత్యం వాగ్వాదాలు తప్పడం లేదు. ప్రయాణీకులు మా కష్టం అర్థం చేసుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ రైల్వే బడ్జెట్లో ఇంత వరకు ఈ విషయాన్ని స్పృషించలేదు' అని రైల్వే సహాయకులు అంటున్నారు. -
డ్రీమ్స్ ఎక్కువ ..డీజిల్ తక్కువ !
కష్టాల పట్టాలపై ‘ప్రభు రైలు’ కలల ప్రయాణం ఈ ఏడాది ఆదాయార్జనలో వెనుకబడిన రైల్వేశాఖ ప్రయాణికులకు ప్రత్యేకం ♦ జనని పథకం కింద చిన్నారులకు ఆహారం, వేడి పాలు, నీళ్లను అందుబాటులో ఉంచుతారు. ♦ ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న అన్ని తరగతుల ప్రయాణికులకు ఎంపిక చేసిన ♦ రైల్వేస్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్‌రోల్స్ అందిస్తారు. ♦ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా లోకల్ ట్రైన్ టికెట్లు, 139కు కాల్ చేస్తే ‘వన్ టైమ్ పాస్వర్డ్’ ద్వారా పీఆర్ఎస్ టికెట్లు రద్దు. ♦ టికెట్లపై బార్కోడ్ల ముద్రణ ♦ వికల్ప్ ద్వారా ప్రయాణికులు కోరుకున్న రైళ్లలో ప్రత్యామ్నాయ వసతి కల్పించటం కలలు... ► ఢిల్లీ - చెన్నైలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్లను మూడేళ్లలో నిర్మించటం. ► 3 రకాల కొత్త ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు.. హమ్‌సఫర్, తేజాస్, డబుల్ డెక్కర్ ఉదయ్, ఏసీ రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు అంత్యోదయ, తీర్థ స్థలాలను కలుపుతూ ‘ఆస్థా’ రైళ్లు ప్రవేశపెట్టడం. ► చెన్నైలో భారతదేశపు తొలి ఆటో హబ్ ఏర్పాటు. ఏడాదిలో రూ. 40 వేల కోట్ల వ్యయంతో రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీల ఏర్పాటు. ► వచ్చే ఏడాది 2,000 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ.. 300 రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు. ఈ ఏడాది కల్లా 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తేవటం.. రానున్న రెండేళ్లలో మరో 400 స్టేషన్లలో ఆ సౌకర్యం ఏర్పాటు. ► మొత్తం మీద రూ. 92,714 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 44 కొత్త ప్రాజెక్టులను కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేయటం. కష్టాలు... ► ‘‘ఇది సవాళ్ల సమయం. మేం రెండు ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాం. అవి ఏమాత్రం మా నియంత్రణలో లేనివి. (అవి) అంతర్జాతీయంగా మందగమనం కారణంగా మన ఆర్థికవ్యవస్థ మూల రంగాల వృద్ధి నెమ్మదించటం.. ఏడో వేతన సంఘం ప్రభావం...’’ అని రైల్వేమంత్రే స్వయంగా పేర్కొన్నారు. ► 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ. 15,744 కోట్లు తగ్గింది. ఆర్థికవ్యవస్థలో మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరుకు రవాణా ఆదాయం తగ్గిపోయింది. ► ప్రస్తుత ఏడాది ఆదాయం కన్నా పది శాతం ఎక్కువగా వచ్చే ఏడాదిలో రూ. 1.84 లక్షల కోట్లు ఆదాయార్జన లక్ష్యమని ప్రకటించారు. ఆర్థికవ్యవస్థ మూల రంగం వృద్ధి ఆరోగ్యవంతంగా ఉంటుందన్న ఆశతో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ.. అది ఆశే.. గ్యారంటీ లేదు. ► ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వస్తుండటంతో వచ్చే ఏడాది రైల్వేపై దాదాపు రూ. 32,000 కోట్ల అదనపు భారం పడుతోంది... రైల్వే కష్టాల్లో ఉన్నాకూడా.. ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. న్యూఢిల్లీ: ఒకవైపు ఈ ఏడాది అనుకున్న ఆదాయం రాలేదు. లక్ష్యానికి రూ. 15.7 వేల కోట్ల దూరంలోనే మన రైలు బండి ఆగిపోయింది. మరోవైపు.. వచ్చే ఏడాది ఏడో వేతన సంఘం అమలు భారం రైల్వేలపై భారీగానే పడనుంది. దాదాపు రూ. 32 వేల కోట్లు అదనపు వ్యయం కానుంది. పరిస్థితి సవాళ్లతో కూడుకుని ఉందని స్వయంగా అమాత్యులే ప్రకటించారు. అవి తన నియంత్రణలో లేనివనీ వక్కాణించారు. అలాగని.. చార్జీలు పెంచలేదు. ప్రయాణ చార్జీలు కానీ, సరకు రవాణా చార్జీల జోలికి పోలేదు. కానీ.. వచ్చే ఏడాది బడ్జెట్లో కొన్ని కొత్త కలలను రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు ఆవిష్కరించారు. మూడు రకాల కొత్త సూపర్ ఫాస్ట్ ఏసీ రైళ్లు; మరో రకం ఏసీ, రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు; ముఖ్యమైన తీర్థస్థలాలను కలుపుతూ ఆస్థా రైళ్లు.. మూడేళ్లలో ఉత్తర - దక్షిణ, తూర్పు - పడమర, తూర్పు తీర రవాణా కారిడార్ల నిర్మాణం.. వంటి ఆశావహ ప్రాజెక్టులను ప్రకంటించారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, ఆధునీకరణ చర్యలతో పాటు.. స్టేషన్లలోనూ, రైళ్లలోనూ వసతి సదుపాయాల పెంపు.. మహిళలకు, వృద్ధులకు, విలేకరులకు పలు తాయిలాలు ప్రకటించారు. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 790 కోట్ల మేర ప్రస్తుతం నడుస్తున్న, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. 4 కొత్త రకం రైళ్లు... రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు 2016-17 సంవత్సరానికి రైల్వేబడ్జెట్‌ను గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన సమర్పించిన రెండో రైల్వే బడ్జెట్ ఇది. దాదాపు గంటసేపు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రకటించిన కొత్త రకం రైళ్లలో.. మూడో తరగతి ఏసీతో నడిచే ‘హమ్‌సఫర్’ సర్వీసు మొదటిది. రెండోది.. దేశంలో రైలు ప్రయాణ భవిష్యత్తును ప్రతిబింబించే ‘తేజాస్’ సర్వీసు. ఇది 130 కిలోమీటర్ల వేగంతో నడవటమే కాక.. వినోదం, స్థానిక ఆహారం, వైఫై వంటి సర్వీసులూ ఉంటాయి. మూడోది ఉదయ్ (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఎక్స్‌ప్రెస్). అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రివేళ ఈ రైలు నడుస్తుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికుల ప్రయాణ నాణ్యతను పెంపొందించటం కోసం దూర ప్రాంతాల మధ్య ‘అంత్యోదయ’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే.. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోని పలు రైళ్లలో ‘దీన్ దయాళ్’ పేరుతో రిజర్వేషన్ లేని బోగీలు రెండు, మూడు చేరుస్తామని చెప్పారు. అందులో తాగునీరు, మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎక్కువ ఏర్పాట్లు ఉంటాయన్నారు. 3 కొత్త రవాణా కారిడార్లు... ఇక కొత్త సరకు రవాణా కారిడార్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. ఢిల్లీ - చైన్నై నగరాలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్లను నిర్మిస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులను 2019 కల్లా పూర్తిచేస్తామని.. వాటిని నిర్దిష్ట కాలావధిలో అమలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి సహా వినూత్న నిధుల కేటాయింపు పథకాలతో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తామని చెప్పారు. అలాగే.. రూ. 40 వేల కోట్ల వ్యయం కాగల రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీలను కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది వెల్లడించలేదు. ఇక చెన్నైలో దేశంలోనే తొలి ఆటో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైల్ డెవలప్మెంట్ అథారిటీ.. సరకు రవాణా టారిఫ్ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తామని ప్రభు హామీ ఇచ్చారు. ఇతర రవాణా పద్ధతులతో పోటీపడేలా ధరలను రూపొందించటానికి సమీక్ష చేపడతామని చెప్పారు. అదనపు ఆదాయాన్ని సముపార్జించటానికి సరకు రవాణా బాస్కెట్‌ను విస్తరిస్తామన్నారు. సేవలకు న్యాయమైన ధరలను నిర్ణయించటానికి, పోటీని పెంపొందించటానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపడటానికి, సామర్థ్య ప్రమాణాలను నిర్ధారించటానికి రైల్ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పుతామని ప్రభు ప్రకటించారు. సంబంధిత భాగస్వాములతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధమవుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం దీర్ఘ కాలిక దృష్టితో ‘జాతీయ రైల్వే ప్రణాళిక’ను తొలిసారిగా రూపొందించనున్నట్లు సురేశ్‌ప్రభు వివరించారు. పెట్టుబడి వ్యయం 1.21 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.21 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయంతో బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు రైల్వేమంత్రి తెలిపారు. గత సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రణాళికా వ్యయం సగటుకన్నా ఇది రెట్టింపని చెప్పారు. ప్రస్తుత సంవత్సరం కన్నా ఇది 20 శాతం అధికం. సామర్థ్య నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టులకు కచ్చితమైన నిధులు అందేలా చూడటం కోసం.. వివిధ మార్గాల నుంచి నిధులు సేకరిస్తామని చెప్పారు. రైల్వే ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయీ ఆర్థికాభివృద్ధిని ఐదు రూపాయలు పెంచుతుందని పేర్కొన్నారు. 2015-16 సంత్సరంలో నిర్వహణ దామాషా (ఆపరేషన్ రేషియో) 90 శాతంగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం అది 92 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. 2020 నాటికి సామాన్యుల కలలు సాకారం సామాన్యుడు సుదీర్ఘ కాలంగా కోరుకుంటున్న ఆకాంక్షలు 2020 నాటికి సాకారమవుతాయని రైల్వేమంత్రి తన విజన్‌ను వివరిస్తూ పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న రైళ్లలో రిజర్వుడు వసతి, టైమ్-టేబుల్ ప్రకారం నడిచే రవాణా రైళ్లు, భద్రత రికార్డును మెరుగుపరచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లన్నిటినీ తొలగించటం, సమయపాలనను మెరుగుపరచటం, రవాణా రైళ్ల అధిక వేగం, మానవ వ్యర్థాల నేరు విసర్జనను సున్నాకు తీసుకెళ్లటం లక్ష్యాలుగా చెప్పారు. మార్చికల్లా కాంట్రాక్టులన్నీ కేటాయింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి ముందే.. సివిల్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టులన్నిటి కేటాయింపు పూర్తవుతుందని ప్రభు తెలిపారు. అంతకుముందు ఆరేళ్లలో కేవలం రూ. 13,000 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇవ్వగా.. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రూ. 24,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వసూళ్ల అంచనా 1.84 లక్షల కోట్లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రవాణా వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లు ఉంటాయని బడ్జెట్లో అంచనా వేశారు. అందులో ప్రయాణ ఆదాయం 12.4 శాతం మేర పెరుగుతుందన్న అంచనాతో.. రూ. 51,012 కోట్ల ఆదాయ లక్ష్యం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగం ఆరోగ్యవంతమైన వృద్ధి సాధిస్తుందన్న అంచనాతో.. వచ్చే ఏడాది రైల్వే సరకు రవాణా 500 కోట్ల టన్నుల మేర అదనంగా పెరుగుతుందని లెక్కగట్టారు. ఆ మేరకు సరకు రావాణా ఆదాయం రూ. 1.17 లక్షల కోట్లు ఉంటుందని అంచనాగా పేర్కొన్నారు. ఇతరత్రా మార్గాల్లో రూ. 15,775 కోట్లు ఆర్జిస్తామని అంచనా వేశారు. ప్రయాణ చార్జీల రాయితీ నష్టం రూ. 30,000 కోట్లుగా ఉండగా.. ప్రభుత్వం నుంచి రూ. 40,000 కోట్లు బడ్జెటరీ మద్దతుగా రైల్వేలు పొందనున్నాయి. బడ్జెట్ హై లైట్స్.. రైల్వే చార్జీలు పెంచలేదు. ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు యథాతథం రూ.8.5 లక్షల కోట్లతో ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణ 2016-17లో ైరె ల్వేలో 1.21 కోట్ల పెట్టుబడులు ► హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేర్లతో కొత్తగా మూడు సూపర్‌ఫాస్ట్ రైళ్లు ► ప్రముఖ పుణ్యతీర్థాలను అనుసంధానిస్తూ ఆస్థా సర్క్యూట్ ► సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ పేరుతో సూపర్‌ఫాస్ట్ రైలు ► నీళ్లు, మొబైల్ చార్జింగ్ వసతులతో సాధారణ ► ప్రయాణికులకు దీన్‌దయాళు కోచ్‌లు 50% సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తుల్లో అదనపు కోటా 400 రైల్వే స్టేషన్లలో వైఫై. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరో 100 స్టేషన్లలో వైఫై 30,000 వచ్చే ఏడాదికల్లా రైళ్లలో ఏర్పాటు చేసే బయో టాయ్లెట్లు ► 2020కల్లా డిమాండ్‌కు అనుగుణంగా {పయాణికులందరికీ రిజర్వేషన్ సదుపాయం ► ఇ-టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 2,000 నుంచి 7,200కు పెంపు ► ముఖ్యమైన అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు ► వచ్చే ఏడాదికల్లా రైళ్లలో 30 వేల బయో టాయ్లెట్లు ► పాత్రికేయులు రాయితీ టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా పొందే సదుపాయం... ప్రయోగప్రాతిపదికన టికెట్లపై బార్కోడ్ ► విదేశీ డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ఇ-టికెట్లు ► త్వరలో చేతిలో ఇమిడే మిషన్ల ద్వారా రైల్వే టికెట్ల జారీ. ► వికలాంగులు, వృద్ధులకు ‘రైల్ మిత్ర’ ద్వారా సేవలు ► ప్రయాణికులకు ఐచ్చిక ప్రయాణ బీమా ► చిన్న పిల్లలకు ఆహారం అందించేందుకు జననీ సేవ ► అటోమేటిక్ డోర్లు, బయో వాక్యూమ్ టాయిలెట్లతో స్మార్ట్ బోగీలు ► టికెట్ల జారీ, ఫిర్యాదులు తదితరాలకు మొబైల్ యాప్ ► బోగీల్లో జీపీఎస్ ఆధారిత డిజిటల్ సమాచార బోర్డులు ► ప్రయాణికుల చార్జీల్లో రాయితీలకు రూ.30 వేల కోట్లు లక్ష్యానికి దూరంగా ఆదాయార్జన ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయార్జన సాధించలేదు. 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది ఆదాయం రూ. 15,744 కోట్లు తగ్గింది. ప్రయాణ, సరకు రవాణా ఆదాయాలు రెండూ అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. మూల రంగం నుంచి డిమాండ్ తగ్గటం కారణంగా సరకు రవాణా ఆదాయం తగ్గిపోయింది. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో రూ. 8,720 కోట్లు ఆదా చేసినట్లు లెక్కలు చూపారు. అయితే.. గత ఏడాది కాస్త ఆదాయం పెంచుకోవటానికి సరకు రవాణా చార్జీలను స్వల్పంగా పెంచిన సురేశ్‌ప్రభు.. ఈ ఏడాది పరిస్థితి గడ్డుగా ఉన్నా కూడా.. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చార్జీల జోలికి పోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ. -
ఏపీకి రిక్తహస్తం!
♦ రూ.2,823 కోట్ల పనులు కేటాయింపులతోనే సరి ♦ ఏపీలో 9 కొత్త మార్గాలకు సర్వే ♦ విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు ♦ విభజన చట్టంలోని హామీలకూ కేంద్రం మొండి చెయ్యే సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రైల్వేశాఖ రిక్తహస్తం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలనూ విస్మరించింది. అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. కొత్త రైళ్ల ఊసే లేదు. రాష్ట్రానికి 2016-17లో మొత్తంగా రూ.2,823 కోట్ల మేర ప్రాజెక్టుల పనులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఏపీలో కొత్తగా 10 మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. రాష్ట్రంలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులు కేటాయించారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే చేయకపోవడం గమనార్హం. తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరీకరిస్తామని ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇలా.. యూపీఏ-2 హయాంలో సగటున ఏటా రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో సగటు రూ.2,195 కోట్లుగా ఉంది. తాజాగా రూ.2,823 కోట్లు కేటాయించారు. కొత్తగా రైల్వే మార్గాల నిర్మాణం మార్గం దూరం అంచనా(రూ.కోట్లలో) గుంతకల్లు-గుంటూరు (డబ్లింగ్) 443 4,000 గద్వాల-మాచర్ల 184 3,500 డబ్లింగ్‌కు కేటాయింపులు రూ.కోట్లలో గుత్తి-ధర్మవరం-బెంగళూరు 30 కల్లూరు-గుంతకల్లు 60 రేణిగుంట-ధర్మవరం-వాడీ బైపాస్ 75 విజయవాడ-కాజీపేట్-బైపాస్ లైన్ 27 గత మూడేళ్లుగా ఇలా.. 2014-15 రూ.1,105 కోట్లు 2015-16 రూ.2,659 కోట్లు 2016-17 రూ.2,823 కోట్లు నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు (రూ. కోట్లలో) మార్గం కేటాయింపు నంద్యాల-ఎర్రగుంట్ల 50 మాచర్ల-నల్లగొండ 0.2 గద్వాల-రాయిచూర్ 5 కాకినాడ-పిఠాపురం 50 కోటిపల్లి-నర్సాపూర్ 200 ఓబులవారిపల్లె-కృష్ణపట్నం 100 జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ 110 కడప-బెంగళూరు 58 నడికుడి-శ్రీకాళహస్తి 180 గూడూరు-దుగరాజపట్నం 5 భద్రాచలం-కొవ్వూరు 15 కంభం-ప్రొద్దుటూరు 1 -
స్మార్ట్ రైళ్లు.. సినిమా తెరలు
న్యూఢిల్లీ: హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా త్వరలో భారతీయ రైళ్లు మెరిసిపోనున్నాయి. కళ్లను కట్టిపడేయనున్నాయి. త్వరలోనే స్మార్ట్ (స్పెషల్లీ మోడిఫైడ్ ఆస్తేటిక్ రిఫ్రెషింగ్ ట్రావెల్) కోచెస్ రానున్నాయి. వీటిలో ఉండే సౌకర్యాలు వింటే అబ్బుర పడాల్సిందే. ఇది ఎక్కువమంది ప్రయాణీకులను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు ప్రయాణీకులు రాగానే వాటంతట అవే తలుపులు తెరుచుకుంటాయి. అలాగే, బార్ కోడ్ రీడర్స్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, వాటర్ లెవల్ ఇండికేటర్స్, ఆధునిక డస్ట్ బిన్స్, కొత్త విధానంలో సీటింగ్ వ్యవసథ, వెండింగ్ మెషిన్స్తోపాటు ఎంటర్ టైన్ మెంట్ తెరలు, ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులు ఇందులో ఉంటాయి. దీంతోపాటు, ఇండియన్ రైల్వేలో రైల్ మిత్ర సేవ రానుంది. ఇప్పటికే కొంకణ్ రైల్వే లో ఉన్న సారథి సేవను దాదాపుగా అన్ని రైళ్లకు విస్తరించి దివ్యాంగులకు సేవలు అందించనున్నారు. విశ్రాంతి గదుల బుకింగ్ గంటగంటకు చేసుకునే అవకాశం కలగనుంది. దీనిని పూర్తిగా ఐఆర్సీటీసీకి అప్పగించనున్నారు. -
ఇంతకీ ప్రయాణీకుల సౌకర్యాలేమిటి?
న్యూఢిల్లీ: రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌తో లోక్ సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నింటికి అరకొర కేటాయింపులే చేశారు. ప్రయాణీకులను మెప్పించేలా కొన్ని ప్రకటనలు చేశారు. అయితే, ఇదివరకే ఉన్నవాటిని కాస్తంత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఆధునీకరణ దిశగా ముందుకెళుతున్నాం అని చెప్పేందుకు ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు. వాటిని సంక్షిప్తంగా పరిశీలిస్తే.. పూర్తిగా ఐవీఆర్ఎస్ వ్యవస్థకు అంకితమై సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకొని ప్రయాణీకులకు అనుసంధానమవడంతోపాటు వారి ప్రతి స్పందనలను తెలుసుకునేందుకు పెద్ద పీఠ వేశారు. అదనంగా 65,000 బెర్త్ లను ఏర్పాటుచేయనున్నారు. 2,500 వాటర్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తారు అత్యాధునిక పద్ధతిలో తీర్చిదిద్దిన బోగీలతో మహామన ఎక్స్ ప్రెస్ రైలును ప్రకటించారు 17 వేల బయో టాయిలెట్లను రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు ఇందుకోసం ప్రపంచంలోనే తొలి బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఈ టికెటింగ్ వ్యవస్థను బలపరచనున్నట్లు ప్రకటించిన ఆయన ఇందుకోసం 1,780 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. మొబైల్ ఆప్స్‌ను, గో ఇండియా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. నిమిషానికి రెండు వేల టికెట్లు వచ్చేలాగా ఈ టికెటింగ్ వ్యవస్థ రానుంది. ఇప్పటికిప్పుడు 100 స్టేషన్లలో వైఫై సేవలు.. మరో 400 స్టేషన్లలో త్వరలో వైఫై ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం ఆన్ లైన్లోనే వీల్ చైర్లు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. భద్రత కోసం మరిన్ని సీసీటీవీ కెమెరాలు, హెల్ప్ లైన్ సెంటర్లు పెంచనున్నారు. -
‘ప్రభూ’! మాకేమిచ్చావు.....
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చప్ప చప్పగా ఉంది. నిర్దిష్టమైన ప్రణాళికలనుగానీ, ప్రగతిదాయక ప్రాజెక్టులుగానీ పెద్దగా లేవు. రైల్వే ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నప్పటికీ రైలు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలను పెంచక పోవడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశం. రానున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ చార్జీల జోలికి వెళ్లలేదని స్పష్టమవుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఫ్లాగ్షిప్ కార్యక్రమాలైన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియాకు కాస్త పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. మేన్ ఇన్ ఇండియా కింద 40వేల కోట్ల రూపాయలతో రెండు లోకోమోటివ్ పరిశ్రమలను ప్రకటించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో రైళ్లలో 17వేల బయో టాయ్లెట్లు, 475 రైల్వే స్టేషన్లలో అదనపు టాయ్లెట్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో సుందరీకరిస్తామని, మరికొన్నింటిని ఆధునీకరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు అన్ని స్టేషన్లలో దశలవారీగా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 400 రైళ్లలో వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని, ముందుగా ఈ ఏడాది 100 రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కొత్తదేమీ కాదు. ఇంతకుముందే గూగుల్‌తో రైల్వే శాఖ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా అవసరమైన చోట రైల్వే యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సురేశ్ ప్రభు గుజరాత్‌లోని బరోడాకు మాత్రమే ఒక యూనివర్శిటీని ప్రకటించారు. మిగతావి ఎక్కడన్న ఊసే లేదు. హమ్ సఫర్, తేజస్, ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ సర్వీసులను కొత్తగా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటితో సామాన్య ప్రయాణికులకు ఒరిగేదీమీ లేదు. ఈ ఏడాది దాదాపు రెండువేల కిలీమీటర్ల ట్రాక్‌ను విద్యుదీకరిస్తామని చెప్పారు. 2,800 కిలీమీటర్ల మేర కొత్త లైన్లను నిర్మిస్తామన్నారు. అంతే దూరం మేర బ్రాడ్ గేజ్ పనులను చేపడతామన్నారు. మొత్తంగా 5,300 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు 92,714 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు రైల్వే శాఖ వద్ద ఆర్థిక వనరులేమీ లేవు. అయితే జనరల్ బడ్జెట్లో కేంద్రం 40,000 కోట్ల రూపాయల సహాయం ఇస్తానందని, 1.25 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఎల్ఐసీ అంగీకరించిందని మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. రిజర్వేషన్ల కోటాలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు 60 కిలీమీటర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 80 కిలీమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, కొన్ని రూట్లలో, కొన్ని రైళ్లలో వేగాన్ని గణనీయంగా పెంచుబోతున్నామని చెప్పారు. మధ్యలో రైళ్లు ఆగే సమయాన్ని ఆయన లెక్కలోకి తీసుకోలేదు. ప్రయాణకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే సగటున భారత రైళ్లు 38 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తున్నాయని రైల్వే శాఖ గణాంకాలే తెలియజేస్తున్నాయి. రైల్వే రెవెన్యూలో ఈ సారి పదిశాతం వృద్ధిని సాధిస్తామని మంత్రి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు కేవలం 5.8 శాతం మాత్రమే ఉంది. దీన్ని రెండంకెలకు తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. ఇక రూపాయి పెట్టుబడికి ఐదు రూపాయలు సంపాదిస్తామని సురేశ్ ప్రభు సెలవిచ్చారు. ప్రస్తుతం వందరూపాయలకు 97.8 రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును 88.5 శాతానికి తగ్గిస్తామని గతేడాది పెట్టిన టార్గెట్‌నే ప్రభు అందుకోలేక పోయారు. ఏడాదిలో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడున్న సంఖ్యకన్నా అదనంగా కల్పిస్తారా? అన్న విషయంలో స్పష్టల లేదు. ఈ ఏడాదిలో దాదాపు 8,9 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఈ బడ్జెట్ వల్ల కాస్తో కూస్తో ప్రయోజనం కలిగేది ఉన్నత తరగతికి చెందిన ప్రయాణికులకే. సామాన్య, మధ్య తరగతి వారికి ఒరిగేదేమీ లేదు. చార్జీల భారం పడలేదని సంతోషించడం తప్పా. -
మూడు రకాల కొత్త సూపర్‌ఫాస్ట్ రైళ్లు
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో మూడు కొత్త రకాల సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రకటించారు. పూర్తిగా థర్డ్ ఏసీ బోగీలతో కూడిన హమ్‌సఫర్ రైలు మొదటిది. ఇందులో కావల్సిన వాళ్లకు భోజనం కూడా పెడతారు. ఇక గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే తేజస్ రైలు రెండోది. ఇందులో వినోదం, స్థానిక ఆహారం, వై-ఫై సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ రెండు రైళ్లకు కేవలం చార్జీల ద్వారానే నిర్వహణ వ్యయం మొత్తాన్ని రాబడతారు. వీటితో పాటు ఉదయ్ అనే పేరుతో ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ రైళ్లను, బిజీ మార్గాల్లో పూర్తిగా ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో కూడిన 'ఉత్కృష్ట్' రైళ్లను కూడా ప్రకటించారు. వీటితో పాటు రిజర్వేషన్ లేని ప్రయాణికులకు నాణ్యమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను అంత్యోదయ అనే సూపర్ ఫాస్ట్ రైలును ప్రకటించారు. అలాగే, అన్ని రైళ్లలోనూ 'దీన్‌దయాళు' పేరుతో ఉండే అన్ రిజర్వుడు బోగీలలో మంచినీళ్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లను కూడా ప్రవేశపెడుతున్నారు. -
కూలీ నెంబర్ 1 కాదు.. సహాయక్ నెంబర్ 1!
న్యూఢిల్లీ: ఇక నుంచి రైల్వే స్టేషన్లలో కూలీ.. కూలీ అనే పిలుపులు వినపడటం ఆగిపోనుంది. ఆ పేరు ఇక చరిత్ర పుస్తకాలకు పరిమితం కానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కూలీలకు గౌరవాన్ని కట్టబెట్టారు. కూలీ అనే పేరు స్థానంలో ఆయన కొత్త పేరును ప్రకటించారు. ఇక నుంచి రైల్వే కూలీలను కూలీలు అని పిలవకూడదని, వారిని సహాయక్‌లు లేదా హెల్పర్స్ అని పిలవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక నుంచి ఇదే పేరు ఉంటుందని చెప్పారు. దీంతోపాటు వారికి కొన్ని ప్రత్యేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు విమానాశ్రయాల మాదిరిగా ట్రాలీలను కూడా అందించనున్నారు. రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌ను మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో రైళ్ల సగటు వేగాన్ని పెంచుతామని, మీటర్‌గేజిని బ్రాడ్ గేజిగా మారుస్తామని, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వే కూలీల పేరిట పలు సినిమాలు, పుస్తకాలు విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
ఖరగ్‌పూర్- విజయవాడ ఫ్రైట్ కారిడార్
ఈసారి బడ్జెట్లో మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలుపుతూ ఢిల్లీ - చెన్నై మధ్య ఒకటి, తూర్పు-పడమరలను కలుపుతూ ఖరగ్‌పూర్ - ముంబై మధ్య ఒకటి, తూర్పు తీరం వెంబడి ఖరగ్‌పూర్ నుంచి విజయవాడకు ఒకటి ఈ కారిడార్లను ఆయన ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులుగా నిర్ణయించారు. వీటిని తగిన సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. పీపీపీ పద్ధతిలో వినూత్న ఫైనాన్సింగ్ పథకాల ద్వారా వీటికి నిధులు ఇస్తామని తెలిపారు. మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా.. సివిల్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులను అప్పగిస్తామన్నారు. గత ఆరేళ్లలో మొత్తం రూ. 13 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించగా, తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రూ. 24 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించినట్లు సురేశ్ ప్రభు వివరించారు. -
ప్రతీ వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడర్
న్యూఢిల్లీ: ప్రతీ వినియోగదారుడు తమకు బ్రాండ్ అంబాసిడరేనని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో మెరుపులు మెరిపించారు. 2016 సంవత్సరానికి ఆయన గురువారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తామని సురేశ్ ప్రభు ప్రకటించారు. దీంతోపాటుగా ఈ బడ్జెట్ లో మహిళల రక్షణకు పెద్దపీట , దీన్ దయాళ్ రైళ్ల ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు 50శాతం లోయర్ బెర్తులు, 311 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, అన్నిబోగీలలో మొబైల్ చార్జింగ్ ఏర్పాటు.. సోషల్ మీడియాలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా తక్షణం చర్యలు తదితర తాయిలాలను ఆయన తన బడ్జెట్ లో పంచారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు జర్నలిస్టులకు ఒక తీపి కబురు అందించారు. జర్నలిస్టులు రైల్వే టికెట్ పై రాయితీని ఆన్లైన్ లోనే పొందే వెసులుబాటును కల్పించారు. దీంతో ఎక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు రైల్వే రాయితీని ఇక మీదట ఆన్లైన్లోనే పొందే అవకాశం కలిగింది. మొత్తం మీద ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చాలా చప్పగా సాగిందని విశ్లేషకులు అంటున్నారు. దాదాపు గంట పది నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని పెదవి వివరించారు. -
ప్రయాణికులకు ఊరట
న్యూఢిల్లీ: టికెట్ చార్జీలు పెంచకపోవడంతో రైల్వే ప్రయాణికులకు ఊరట లభించింది. టికెట్ ధరలు, రవాణా చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో పేర్కొన్నారు. అన్ని భాషల్లోనూ రైల్వే వెబ్ సైట్ ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తాత్కాల్ టికెట్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో రైల్వే టికెట్లపై బార్ కోడింగ్ ముద్రిస్తామని పేర్కొన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం సరఫరా చేస్తామని చెప్పారు. పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కోచ్ లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్‌ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు అప్పగిస్తామని హామీయిచ్చారు. -
అమరావతికి తూచ్.. వడోదరకు రైల్వే వర్సిటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఓ వరం ప్రకటించారు. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. ఈ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నగరానికి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే రైల్వే మంత్రికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తులు చేశారు. పరిశీలిస్తామని చెప్పినా.. చివరకు ప్రధాని సొంత రాష్ట్రానికే దాన్ని తరలించుకుపోయారు. ఇక దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న రైల్వే ఆటో హబ్‌ను తమిళనాడు రాజధాని చెన్నైకి కేటాయించారు. ఇది ఏంటన్న విషయమై ఇంకా వివరణ మాత్రం రాలేదు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి ఇది వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మొండిచేయి చూపారు. 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకే నిరాశ ఎదురయింది. ఒక్క కొత్త రైలు సర్వీసు దక్కలేదు. సుదీర్ఘకాలంగా ఉన్న ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మాత్రమే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగించాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తామని హామీయిచ్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు మోక్షం లభించలేదు. విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలన్నా ప్రధాన డిమాండ్ ను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. -
2016-17 రైల్వే బడ్జెట్ హైలైట్స్
కేంద్రమంత్రి సురేశ్ ప్రభు లోక్ సభలో గురువారం 2016-17 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రెండోసారి ఆయన రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * ప్రయాణికుల, రవాణా ఛార్జీల పెంపు లేదు *రైళ్లలో పబ్లిక్ ఎనౌన్స్మెంట్ సిస్టం ద్వారా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు *వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు *పోర్టర్లకు కూలీ బదులు సహాయ్ అనే పేరు *పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు *ఐఆర్సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం *త్వరలో రైల్వే టికెట్లకు బార్‌కోడింగ్ సదుపాయం *ప్రపంచంలో తొలిసారి బిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్ *ఈ ఏడాది 1600 కిలోమీటర్ల మార్గం విద్యుదీకరణ *వచ్చే ఏడాది మరో 2వేల కిలోమీటర్ల విద్యుదీకరణకు ప్రతిపాదన *కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు నిరాశే *కాజీపేట కోచ్ అంశమే ప్రస్తావించని కేంద్రం *యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపుకు మొండిచేయి *విశాఖ రైల్వే జోన్ ను పట్టించుకోని కేంద్రం *గ్యాంగ్ మెన్లకు రక్షక్ పరికరం అందజేత, *బెంగళూరు- తిరువనంతపురంలో సబ్ అర్బన్ రైళ్లు *రైల్వే స్టేషన్లలో యాడ్ రెవెన్యూ పెంపుకు కృషి *రైల్వే కోచ్‌ల లీజు అంశం పరిశీలన *తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ * బ్రాడ్ గేజ్‌గా మిజోరాం-మణిపూర్ రైల్వేలైన్ మార్పు *డిమాండ్‌కు అనుగుణంగానే రైళ్లు *తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో అభివృద్ధి * గూడ్స్ రైలు సగటు వేగం 50 కిలోమీటర్లకు పెంపు *రైలు కొలిజన్ అవాయిడింగ్ సిస్టమ్ * సెకెండ్ క్లాస్ ప్రయాణినికీ దుప్పట్లు, దిండ్లు * డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్‌ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం *ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు * అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ సర్క్యూట్ రైలు * చెన్నైలో తొలి రైల్వే ఆటో హబ్ ఏర్పాటు * ప్రతి వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడరే * కోచ్‌లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు *అన్ని కమ్యూనికేషన్ల కోసం కస్టమర్ మేనేజర్లను నియమిస్తాం *ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ ట్రైన్, దానికి జపాన్ సాయం *పార్సిల్ బిజినెస్‌ను మరింత సరళీకరిస్తాం *ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకునే వీలు కల్పిస్తాం *2020 నాటికి 4వేల కోట్ల ఆదాయం సాధించే లక్ష్యం పెట్టుకున్నాం * పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లు మరింత ఆధునీకరణ *ముంబైలో రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం *టిక్కెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ వర్తింపు *408 స్టేషన్లలో ఈ-కేటరింగ్ *కోల్‌కతాలో 100 కిలోమీటర్ల మేర మెట్రో పనులు *ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌కు అన్ని సమస్యలు పరిష్కరించాం *2018 జూన్ నాటికి ఈ మెట్రో పూర్తవుతుంది *బెంగళూరులో సబర్బన్ సిస్టం సరిగా లేదు.. దీనికోసం రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తాం *కేరళలో తిరువనంతపురం నగరానికి కూడా ఇదే అమలుచేస్తాం *సీనియర్ సిటిజన్ కోటా 50 శాతం పెంపు *ప్రస్తుతం ఉన్న బెర్త్ లకు అదనంగా 65వేల బెర్త్‌ల ఏర్పాటు *రైల్వే పోర్టర్లకు కొత్త యూనిఫాంలు, గ్రూప్ ఇన్సూరెన్స్ *ఆహార నాణ్యత తగ్గకుండా చర్యలు *రైళ్లలో 30వేల బయో టాయిలెట్స్ * ఇక నుంచి ఆన్ లైన్లోనే రైల్వే నియామకాలు * జర్నలిస్టులకు ఆన్లైన్లోనే రాయితీ *ఫారెన్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ-టికెట్ కొనుగోలు సౌకర్యం *వృద్ధులకు అనుకూలంగా ఉండే సాథి సేవను మరిన్ని స్టేషన్లకు పొడిగింపు *రైల్వేస్టేషన్లలో అవసరమైన వారి కోసం అందుబాటులో వేడినీళ్లు *బయో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తాం *నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్ *వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు * ప్రతి టైన్లో వృద్ధుల కోసం 120 బెర్త్‌లు *139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం *స్వచ్ఛరైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింత శుభ్రం చేయిస్తాం *కోచ్, టాయిలెట్ లను శుభ్రం చేయించాలని ఎస్ఎంఎస్ తో కోరే అవకాశం *ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటాం *దీన్ దయాళ్ బోగీలు *సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ రిజర్వుడు కేటగిరీలో దీన్ దయాళ్ బోగీలు *హమ్ సఫర్ 3 ఏసీ సర్వీసు *తేజస్ - 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో వైఫై, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది *ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెడతాం *కొత్తగా మూడు రకాల రైలు సర్వీసులను ప్రకటించిన సురేశ్ ప్రభు *కొత్తగా హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ లు *ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెండరింగ్లు *2020 నాటికి గూడ్స్ రైళ్లకు టైంటేబుల్ * అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు *నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు * సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం * రూ.1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం *రైల్వే యూనివర్సిటీని ఈ ఏడాది ప్రారంభిస్తాం *ఒక్క ప్రమాదం జరిగినా నాకు చాలా బాధ కలుగుతుంది *జీరో యాక్సిడెంట్లను సాధించాలని అనుకుంటున్నాం *అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అధిగమిస్తాం *కొత్త రైలుబోగీలతో శబ్ద కాలుష్యం తగ్గుతుంది * 40వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు * టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత * రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ * రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు *100 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ * ఈ ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం * 2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన * అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్ *ఈ ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు *ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి *మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది. *ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు * వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం *ఖరగ్ పూర్-ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ట్రిప్లింగ్ * రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం * ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం *జమ్ము-కశ్మీర్ టన్నెల్ వర్క్స్ వేగవంతం *దేశంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టవిటీ * ఈశాన్య రైల్వే పనులు మరింత వేగవంతం * పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి * ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాం *రైల్వే టెండరింగ్ విధానంలో పేపర్ లెస్ పద్ధతి *రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ పెంపు * పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు * ఈ ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21లక్షల కోట్లు * వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ * 2016-17 ఆదాయ లక్ష్యం 1.87 లక్షల కోట్ల లక్ష్యం * సేవల నుంచి సౌకర్యాల వరకూ మరింత మెరుగు *1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది *ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం *రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున వీటిని మారుస్తాం. ప్రస్తుతం ఇది 4.8గా ఉంది *9 కోట్ల మ్యాన్డేస్ ఉపాధి కల్పిస్తాం *రైల్వే మార్గాల విద్యుదీకరణ వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది *ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లు *ఎక్స్‌ప్రెస్ వేగం 80 కిలోమీటర్లు *2020 నాటికి దీర్ఘకాల కోరికలు తీరుస్తాం *ఆన్ డిమాండ్ రైళ్లను కల్పిస్తాం * సేఫ్టీ కోసం హై ఎండ్ టెక్నాలజీ *అన్ మ్యాన్డ్ రైల్వే క్రాసింగులను తీసేయాలి * రైళ్ల వేగాన్ని మరింతగా పెంచుతాం * స్వయం సంవృద్ధితో రైల్వేలు * చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ * గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం * రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతాం * ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగాం * ఇది సవాళ్లతో కూడిన పరీక్షా సమయం * అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగు పరుస్తున్నాం * వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం * ఆదాయ మార్గాల పెంపును అన్వేషిస్తున్నాం * ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్ * ఇది నా ఒక్కడిదీ కాదు....ప్రతి పౌరుడి బడ్జెట్ * సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం * దేశాభివృద్ధికి రైల్వే వెన్నెముకలా ఉండేలా రైల్వే బడ్జెట్ * తన ప్రసంగంలో వాజ్‌పేయి కవితను చదవి వినిపించిన సురేశ్ ప్రభు * రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయాలకు ప్రతిపాదికన బడ్జెట్ -
'టికెట్ల రద్దు... ఇక ఈజీ'
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి టైన్లో వృద్ధుల కోసం 120 బెర్త్‌లు కేటాయించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు అందిస్తామన్నారు. ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే కోచ్, టాయిలెట్ లను శుభ్రం చేసే సిబ్బంది వచ్చే విధంగా మార్పులు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ రైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింత శుభ్రం చేయిస్తామని చెప్పారు. నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు పెట్టిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత పెద్దపీట వేస్తామని, అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2020 నాటికి ఆన్ డిమాండ్ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
100 స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు
న్యూఢిల్లీ: కొత్తగా మూడు రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ఆయన ప్రకటించారు. ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ థర్డ్ క్లాస్ బోగీలతో హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ఉంటుందని వెల్లడించారు. తేజస్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పారు. ఇందులో వై-ఫై, వినోదం సహా అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దీన్ దయాళ్ బోగీలు ప్రవేశపెడుతున్నట్టు వీటిలో మంచినీళ్లు, చార్జింగ్ పాయింట్లు సహా అన్ని సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కల్పిస్తామని, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరిస్తామని హామీయిచ్చారు. -
'సోషల్ మీడియాను టూల్ గా వాడతాం'
న్యూఢిల్లీ: రైల్వేలో వంద శాతం పారదర్శకత సాధించడమే తమ లక్ష్యమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ను గురువారం లోక్‌సభలో ఆయన ప్రవేశపెట్టారు. పారదర్శకత కోసం సోషల్ మీడియా టూల్ కోసం వినియోగించుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. సామాజిక మాధ్యమం ద్వారా ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రయాణికులు, రైల్వేకు మధ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తామని చెప్పారు. కోపరేషన్, కొలాబ్రేషన్, కమ్యూనికేషన్- తమ కొత్త నినాదంగా పేర్కొన్నారు. రైళ్ల రాకపోకల్లో సమయపాలన కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా 17 వేల బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 475 రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు కట్టిస్తామన్నారు. -
92 శాతం ఆక్యుపెన్సీ రేటు సాధిస్తాం
న్యూఢిల్లీ వచ్చే ఏడాదికల్లా రైల్వేలలో 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోను సాధిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. రైల్వేల ప్రణాళికా వ్యయం రూ. 1.21 లక్షల కోట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈసారి మొత్తం 1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ సంస్థ పెట్టుబడిగా పెడుతోందని చెప్పారు. రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్‌గేజిగా మారుస్తామని తెలిపారు. తద్వారా మొత్తం 9 కోట్ల మ్యాన్డేస్ ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మేకిన్ ఇండియాకు అనుగుణంగా రెండు లోకో ఫ్యాక్టరీలను నెలకొల్పుతామని, దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని ఆయన ప్రకటించారు. పారదర్శకతను మరింత పెంచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామన్నారు. ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయని, మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోందని చెప్పారు. ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదని ఆయన అన్నారు. -
ఆసక్తికర అంశం వెల్లడించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిగా తాను చాలా ప్రాంతాలకు వెళ్లి చాలామందిని కలిశానని, అందులో భాగంగానే ముంబై సెంట్రల్ కు వెళ్లినప్పుడు ఓ మహిళ అక్కడి స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నారని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గురువారం లోక్‌సభలో 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. గత 5 నెలలుగా ఆమె స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నారని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ రైల్వేలను తమ సొంత సంస్థ అనుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. సోషల్ మీడియా కూడా ప్రయాణికుల సేవలను మెరుగుపరిచేందుకు సాయం చేస్తోందని అన్నారు. రైల్వే కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడి ఆశలు, ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. రైల్వేలు అందరివీ.. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై రైల్వేశాఖ దృష్టిపెట్టిందని, కొత్త వనరులవైపు దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయి వల్ల ప్రయోజనం ఉండేలా చూస్తున్నామని చెప్పారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, అంతర్జాతీయంగా ఉన్న మంచి విధానాలను అనుసరిస్తున్నామని అన్నారు. ఆక్యుపేషన్ రేషియో 92 శాతాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. -
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రసంగపాఠం మొదలుపెట్టారు. రైల్వే నిలయం నుంచి 11:30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. కాగా ఈ సారి చార్జీల మోత ఉండకపోవచ్చని సాంకేతాలు అందుతున్నాయి. పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసే అవకాశం ఉంది. స్వదేశీ తయారీ, ఐటీ సేవలకు పెద్దపీట వేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
రైల్ భవన్ నుంచి పార్లమెంట్‌కు సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం రైల్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సురేశ్ ప్రభు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ సిద్ధం చేశామని తెలిపారు. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. కాగా ప్రయాణికులపై ఛార్జీల భారం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత, సదుపాయాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అలాగే రైల్వేల సామర్థ్యం పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు చేరాయి.