ప్రయాణికులకు ఊరట
న్యూఢిల్లీ: టికెట్ చార్జీలు పెంచకపోవడంతో రైల్వే ప్రయాణికులకు ఊరట లభించింది. టికెట్ ధరలు, రవాణా చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని 2016-17 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో పేర్కొన్నారు. అన్ని భాషల్లోనూ రైల్వే వెబ్ సైట్ ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తాత్కాల్ టికెట్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో రైల్వే టికెట్లపై బార్ కోడింగ్ ముద్రిస్తామని పేర్కొన్నారు.
ఐఆర్‌సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం సరఫరా చేస్తామని చెప్పారు. పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కోచ్ లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు అప్పగిస్తామని హామీయిచ్చారు.