రైలు ప్రమాదం.. బాధితులకు భారీ పరిహారం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నేటి(ఆదివారం) వేకువజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరిగిపోతుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్(రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్) రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 63 మంది చనిపోయారని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఘటన బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో వారికి అర్ధం కాలేదు. పరస్థితి వారికి అర్థమయ్యేసరికే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ స్టాఫ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జేసీబీల సాయంతో పట్టాలు తప్పి అడ్డుగా ఉన్న బోగీలను తొలగిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం అఖిలేష్.. అధికారులను సహాయక చర్యల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.