ఏపీకి రిక్తహస్తం!
♦ రూ.2,823 కోట్ల పనులు కేటాయింపులతోనే సరి
♦ ఏపీలో 9 కొత్త మార్గాలకు సర్వే
♦ విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు
♦ విభజన చట్టంలోని హామీలకూ కేంద్రం మొండి చెయ్యే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రైల్వేశాఖ రిక్తహస్తం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలనూ విస్మరించింది. అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. కొత్త రైళ్ల ఊసే లేదు. రాష్ట్రానికి 2016-17లో మొత్తంగా రూ.2,823 కోట్ల మేర ప్రాజెక్టుల పనులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఏపీలో కొత్తగా 10 మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. రాష్ట్రంలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులు కేటాయించారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే చేయకపోవడం గమనార్హం. తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరీకరిస్తామని ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇలా..
యూపీఏ-2 హయాంలో సగటున ఏటా రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో సగటు రూ.2,195 కోట్లుగా ఉంది. తాజాగా రూ.2,823 కోట్లు కేటాయించారు.
కొత్తగా రైల్వే మార్గాల నిర్మాణం
మార్గం దూరం అంచనా(రూ.కోట్లలో)
గుంతకల్లు-గుంటూరు
(డబ్లింగ్) 443 4,000
గద్వాల-మాచర్ల 184 3,500
డబ్లింగ్‌కు కేటాయింపులు రూ.కోట్లలో
గుత్తి-ధర్మవరం-బెంగళూరు 30
కల్లూరు-గుంతకల్లు 60
రేణిగుంట-ధర్మవరం-వాడీ బైపాస్ 75
విజయవాడ-కాజీపేట్-బైపాస్ లైన్ 27
గత మూడేళ్లుగా ఇలా..
2014-15 రూ.1,105 కోట్లు
2015-16 రూ.2,659 కోట్లు
2016-17 రూ.2,823 కోట్లు
నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు (రూ. కోట్లలో)
మార్గం కేటాయింపు
నంద్యాల-ఎర్రగుంట్ల 50
మాచర్ల-నల్లగొండ 0.2
గద్వాల-రాయిచూర్ 5
కాకినాడ-పిఠాపురం 50
కోటిపల్లి-నర్సాపూర్ 200
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం 100
జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ 110
కడప-బెంగళూరు 58
నడికుడి-శ్రీకాళహస్తి 180
గూడూరు-దుగరాజపట్నం 5
భద్రాచలం-కొవ్వూరు 15
కంభం-ప్రొద్దుటూరు 1