సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్‌ఈడీ డిస్‌ప్లే, డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్‌ఓబీ (రెండు బోర్డులు), కంజుర్‌మార్గ్ రోడ్ ఆర్‌ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్‌యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్‌ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి.
ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment