న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్‌లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.
‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్‌గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment