ప్రతీకాత్మక చిత్రం
ఒంగోలు: అమెరికా నుంచి వచ్చి.. కరోనా హెచ్చరికల నేపథ్యంలో తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడో యువకుడు. ఇంతలో తల్లి అనారోగ్యంతో మరణించింది. ఈ పరిస్థితుల్లో బయటికి రాలేక తల్లి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయాడు ఆ కుమారుడు. ఈ హృదయ విదారకర ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్ బాలిన రామసుబ్బారావు కుమారుడు అమెరికాలో ఉండేవాడు. కరోనా భయాలతో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. స్వీయ నిర్బంధం నిబంధనలను అనుసరించి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతని తల్లి సుజాత అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది.
ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం ఒంగోలులోని తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చారు. కనుచూపు మేరలో తల్లి మృతదేహం ఉన్నా.. కడసారి చూపునకు కూడా నోచుకోలేక కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వీడియోకాల్ ద్వారా అంతిమ సంస్కారాలను చూడాల్సి వచ్చింది. అంత్యక్రియలను సామాజిక దూరం పాటిస్తూ బంధువులు పూర్తి చేశారు. తల్లిని కడసారిగా చూడలేకపోయానన్న బాధ ఉన్నా సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటికి పరిమితమైన అతని ఆదర్శం పట్ల స్థానికులు కృతజ్ఞతలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment