Self-Quarantine
-
తల్లి కడసారి చూపునకూ నోచుకోక..
ఒంగోలు: అమెరికా నుంచి వచ్చి.. కరోనా హెచ్చరికల నేపథ్యంలో తాము ఉంటున్న అపార్ట్మెంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడో యువకుడు. ఇంతలో తల్లి అనారోగ్యంతో మరణించింది. ఈ పరిస్థితుల్లో బయటికి రాలేక తల్లి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయాడు ఆ కుమారుడు. ఈ హృదయ విదారకర ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్ బాలిన రామసుబ్బారావు కుమారుడు అమెరికాలో ఉండేవాడు. కరోనా భయాలతో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. స్వీయ నిర్బంధం నిబంధనలను అనుసరించి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతని తల్లి సుజాత అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం ఒంగోలులోని తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చారు. కనుచూపు మేరలో తల్లి మృతదేహం ఉన్నా.. కడసారి చూపునకు కూడా నోచుకోలేక కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వీడియోకాల్ ద్వారా అంతిమ సంస్కారాలను చూడాల్సి వచ్చింది. అంత్యక్రియలను సామాజిక దూరం పాటిస్తూ బంధువులు పూర్తి చేశారు. తల్లిని కడసారిగా చూడలేకపోయానన్న బాధ ఉన్నా సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటికి పరిమితమైన అతని ఆదర్శం పట్ల స్థానికులు కృతజ్ఞతలు ప్రకటించారు. -
బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
లండన్: బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అధికార వర్గాలు తెలిపిన దాని ప్రకారం బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20వేలమందికిపైగా మరణించారు. మొత్తం 181 దేశాల్లో 4.45 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బాధితులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటలీలో ఫిబ్రవరిలో తొలి కోవిడ్ మరణం నమోదు కాగా, నెల తిరక్కుండానే ఆ దేశంలో సుమారు 6,820 మంది ప్రాణాలు కోల్పోవడం, వ్యాధి పుట్టిన చైనా కంటే ఎక్కువ మరణాలు స్పెయిన్‌లోనూ సంభవించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో 3281 మరణాలు సంభవించగా స్పెయిన్‌లో ఈ సంఖ్య 3434కు చేరుకుంది. వ్యాప్తి కట్టడికి స్పెయిన్ అనేక కఠిన చర్యలు చేపట్టినప్పటికీ సుమారు 47,610 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశం కామరూన్, నైజర్‌లో మంగళవారం తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్ రాజకుటుంబానికి పరీక్షలు బ్రిటన్ రాజకుటుంబానికి సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది. ఇరాన్లో రెండువేలకు పైమాటే ఇరాన్లో బాధితుల సంఖ్య 2077కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 143 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 27,017గా ఉన్నట్లు తెలిపారు. -
మార్కెట్లో ఫైట్
తిబిలిసీ (జార్జియా రాజధాని) లోని ఫ్లీ మార్కెట్‌కు (పాత వస్తువులు, పురాతన వస్తువులు, సెకండ్‌హ్యాండ్ వస్తువులు దొరికే ప్రాంతం) వెళ్లారు ప్రభాస్. అక్కడ ఓ గొడవ జరిగింది. విలన్స్‌ను రఫ్ఫాడించారు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్ ముగిసింది. అక్కడి ఫ్లీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ ఫైట్‌ను చిత్రీకరించారని సమాచారం. ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జార్జియా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఎవరికివారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభాస్ కూడా స్వీయ గృహనిర్భందంలో ఉన్నారు. -
హోటల్లో క్వారంటైన్‌కు రూ.3,100 అద్దె
సాక్షి న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చేవారు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మూడు హోటళ్లలో క్వారంటైన్ సదుపాయాలను ఖరీదు చెల్లించి పొందడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. లెమన్‌ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబీఐఎస్ హోటళ్లలో 182 గదులను ఇందుకోసం అందుబాటులో ఉంచారు. ఆసుపత్రులలో లభించే క్వారంటైన్ సదుపాయాలు నచ్చనివారు ఈ హోటళ్లలో గదులను సెల్ఫ్ క్వారంటైన్ కోసం ఉపయోగించుకోవచ్చు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే ) క్వారంటైన్ సేవలు ఇలా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ప్రభుత్వం హోటల్ యాజమాన్యాలతో ఈ విషయాన్ని చర్చించి వాటిని విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ కోసం ఉపయోగించాలనే ఆదేశం జారీ చేసింది. ఢిల్లీí ఎడెమిక డిసీజ్ కోవిడ్–19 నిబంధనలు 2020 కింద ప్రభుత్వం ఈ రూముల అద్దెకు, వాటి మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే) ఐబీఐఎస్ హోటల్లో 92 గదులను, లెమన్‌ట్రీ ప్రీమియర్ హోటల్లో 54 గదులను, రెడ్‌ఫాక్స్ హోటల్లో 36 గదులను క్వారంటైన్ కోసం కేటాయించారు. ఈ క్వారంటైన్ గదుల్లో బస చేసేవారు రోజుకు రూ.3100 అద్దె చెల్లించవలసి ఉంటుంది. ఈ గదుల్లో బస చేసేవారికి ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం, టీ, కాఫీలతో పాటు రోజుకు రెండు బాటిళ్ల మినరల్ వాటర్‌ను అందజేస్తారు. భోజనాన్ని వారి గదులలోనే డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలలో అందిస్తారు. వాడిన డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలను బయోమెడికల్ వ్యర్థాల కింద ప్రొటోకాల్ ప్రకారం నిర్మూలిస్తారు. గదులలో వైఫై సదుపాయం, టీవీ ఉంటాయి. ఈ గదులలో వాడే లాండ్రీని మిగతా గదుల లాండ్రీతో కలపకుండా జాగ్రత్త వహిస్తారు. ఈ హోటళ్లలో బస చేసిన వారు నిర్దేశించిన పరిసరాలకు మాత్రమే పరిమితమై ఉండేలా భద్రతా సిబ్బంది చూస్తారు. గదులలో ఉండేవారి కదలికలను హోటల్ యాజమాన్యం సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూము నుంచి గమనిస్తుంది. -
సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్‌గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.