కేంద్రమంత్రికి మహా కక్కుర్తి విజ్ఞప్తి!
ప్రభుత్వ మంత్రిత్వశాఖలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాంగ శాఖ, రైల్వేశాఖలు నెటిజన్ల విజ్ఞప్తులపై చురుగ్గా స్పందిస్తూ.. వారికి వేగంగా సేవలు అందిస్తున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విదేశాల్లోని భారతీయులకు ఏ కష్టం వచ్చినా.. ట్విట్టర్‌లో ఒక చిన్న మాట చెప్తే చాలు.. వారి సమస్యలను తీరుస్తూ.. సూపర్ మామ్ గా పేరుతెచ్చుకుంటున్నారు. అటు సురేశ్ ప్రభు కూడా రైల్వేశాఖలోని సమస్యలను ట్విట్టర్ వేదికగా పరిష్కరిస్తున్నారు.
కానీ రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ఓ ఇటీవల ఓ ప్రయాణికుడు ఓ వింత మెసేజ్ పెట్టాడు. ‘నేను చిన్నపాపతో ప్రయాణిస్తున్నా. ఒక డైపర్ కావాలి. దయచేసి సాయం చేయండి’ అంటూ ప్రభాకర్ ఎస్ ఝా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. రైల్వేశాఖకు, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లకు మంట పుట్టించింది. ట్విట్టర్‌లో అందుతున్న రైల్వేసేవలను జోక్‌గా మార్చడం సరికాదని, ఇలాంటి విజ్ఞప్తులు చేసి మూర్ఖుడిగా మిగలొద్దని ఓ నెటిజన్ సూచించగా.. ఇలాంటి మూర్ఖులకు టికెట్ ధర కంటే రెట్టింపు రేటుకు డైపర్ అందించి కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో జవాబు చెప్పాలని మనో నెటిజన్ సూచించాడు.