యువతిని ఆపద నుంచి కాపాడిన ట్వీట్
అసహాయ స్థితిలో స్మార్ట్ ఫోన్ సహాయకారిగా పనిచేస్తుందని మరోసారి రుజువైంది ఈ యువతి విషయంలో. రైలులో ప్రయాణిస్తున్న తనను వేధింపులకు గురిచేసిన ఆకతాయిని ఒకే ఒక ట్వీట్తో కటకటాల్లోకి నెట్టించింది. ఇంతకీ ఆమె ట్వీట్ చేసింది స్నేహితులకో, పోలీసులకు కాదు.. ఏకంగా రైల్వే శాఖకే. ఢిల్లీ- పట్నాల మధ్య చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
పట్నాకు చెందిన ఓ యువతి ఢిల్లీలో చదువుకుంటోంది. వారాంతపు సెలవు కావడంతో శనివారం సొంత ఊరికి బయలుదేరిన ఆమెను రైలులో ఓ ఆకతాయి అడ్డగించాడు. దురదృష్టం కొద్దీ ఆమె ఎక్కిన బోగీ ఖాళీగా ఉంది. దీంతో వాడు మరింత రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు వాగాడు. అడ్డు చెప్పినా ఆగలేదు.
ఇక ఓపిక పట్టలేక రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ కు ఆమె ఫిర్యాదు పంపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీప స్టేషన్లలోని జీఆర్పీ బలగాలకు సమాచారం చేరవేశారు. అంతే, తర్వాత స్టేషన్ లో రైలు ఆగటం, పోలీసులొచ్చి ఆకతాయికి బేడీలు తగిలించి తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. తనను ఆదుకున్నందుకుగానూ రైల్వే మంత్రిత్వ శాఖకు, మంత్రి సురేశ్ ప్రభుకు ధన్యవాదాలు తెలిపిందా యువతి.