‘ప్రభూ’! మాకేమిచ్చావు.....
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చప్ప చప్పగా ఉంది. నిర్దిష్టమైన ప్రణాళికలనుగానీ, ప్రగతిదాయక ప్రాజెక్టులుగానీ పెద్దగా లేవు. రైల్వే ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నప్పటికీ రైలు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలను పెంచక పోవడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశం. రానున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ చార్జీల జోలికి వెళ్లలేదని స్పష్టమవుతుంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలైన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియాకు కాస్త పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. మేన్ ఇన్ ఇండియా కింద 40వేల కోట్ల రూపాయలతో రెండు లోకోమోటివ్ పరిశ్రమలను ప్రకటించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో రైళ్లలో 17వేల బయో టాయ్‌లెట్లు, 475 రైల్వే స్టేషన్లలో అదనపు టాయ్‌లెట్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో సుందరీకరిస్తామని, మరికొన్నింటిని ఆధునీకరిస్తామని చెప్పారు.
ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు అన్ని స్టేషన్లలో దశలవారీగా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 400 రైళ్లలో వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని, ముందుగా ఈ ఏడాది 100 రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కొత్తదేమీ కాదు. ఇంతకుముందే గూగుల్‌తో రైల్వే శాఖ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా అవసరమైన చోట రైల్వే యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సురేశ్ ప్రభు గుజరాత్‌లోని బరోడాకు మాత్రమే ఒక యూనివర్శిటీని ప్రకటించారు. మిగతావి ఎక్కడన్న ఊసే లేదు.
హమ్ సఫర్, తేజస్, ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ సర్వీసులను కొత్తగా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటితో సామాన్య ప్రయాణికులకు ఒరిగేదీమీ లేదు. ఈ ఏడాది దాదాపు రెండువేల కిలీమీటర్ల ట్రాక్‌ను విద్యుదీకరిస్తామని చెప్పారు. 2,800 కిలీమీటర్ల మేర కొత్త లైన్లను నిర్మిస్తామన్నారు. అంతే దూరం మేర బ్రాడ్ గేజ్ పనులను చేపడతామన్నారు. మొత్తంగా 5,300 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు 92,714 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు రైల్వే శాఖ వద్ద ఆర్థిక వనరులేమీ లేవు. అయితే జనరల్ బడ్జెట్‌లో కేంద్రం 40,000 కోట్ల రూపాయల సహాయం ఇస్తానందని, 1.25 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఎల్‌ఐసీ అంగీకరించిందని మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు.
రిజర్వేషన్ల కోటాలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు 60 కిలీమీటర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 80 కిలీమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, కొన్ని రూట్లలో, కొన్ని రైళ్లలో వేగాన్ని గణనీయంగా పెంచుబోతున్నామని చెప్పారు. మధ్యలో రైళ్లు ఆగే సమయాన్ని ఆయన లెక్కలోకి తీసుకోలేదు. ప్రయాణకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే సగటున భారత రైళ్లు 38 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తున్నాయని రైల్వే శాఖ గణాంకాలే తెలియజేస్తున్నాయి.
రైల్వే రెవెన్యూలో ఈ సారి పదిశాతం వృద్ధిని సాధిస్తామని మంత్రి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు కేవలం 5.8 శాతం మాత్రమే ఉంది. దీన్ని రెండంకెలకు తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. ఇక రూపాయి పెట్టుబడికి ఐదు రూపాయలు సంపాదిస్తామని సురేశ్ ప్రభు సెలవిచ్చారు. ప్రస్తుతం వందరూపాయలకు 97.8 రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును 88.5 శాతానికి తగ్గిస్తామని గతేడాది పెట్టిన టార్గెట్‌నే ప్రభు అందుకోలేక పోయారు. ఏడాదిలో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడున్న సంఖ్యకన్నా అదనంగా కల్పిస్తారా? అన్న విషయంలో స్పష్టల లేదు. ఈ ఏడాదిలో దాదాపు 8,9 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఈ బడ్జెట్ వల్ల కాస్తో కూస్తో ప్రయోజనం కలిగేది ఉన్నత తరగతికి చెందిన ప్రయాణికులకే. సామాన్య, మధ్య తరగతి వారికి ఒరిగేదేమీ లేదు. చార్జీల భారం పడలేదని సంతోషించడం తప్పా.