ఆసక్తికర అంశం వెల్లడించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిగా తాను చాలా ప్రాంతాలకు వెళ్లి చాలామందిని కలిశానని, అందులో భాగంగానే ముంబై సెంట్రల్ కు వెళ్లినప్పుడు ఓ మహిళ అక్కడి స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నారని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గురువారం లోక్‌సభలో 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. గత 5 నెలలుగా ఆమె స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నారని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ రైల్వేలను తమ సొంత సంస్థ అనుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
సోషల్ మీడియా కూడా ప్రయాణికుల సేవలను మెరుగుపరిచేందుకు సాయం చేస్తోందని అన్నారు. రైల్వే కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడి ఆశలు, ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. రైల్వేలు అందరివీ.. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై రైల్వేశాఖ దృష్టిపెట్టిందని, కొత్త వనరులవైపు దృష్టి సారిస్తున్నామని అన్నారు.
ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయి వల్ల ప్రయోజనం ఉండేలా చూస్తున్నామని చెప్పారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, అంతర్జాతీయంగా ఉన్న మంచి విధానాలను అనుసరిస్తున్నామని అన్నారు. ఆక్యుపేషన్ రేషియో 92 శాతాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.